సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ అలైన్‌మెంట్ ఖరారు చేసి గుర్తించిన భూములు ఇక కేంద్ర ప్రభుత్వ పరమైనట్టే. వాటిపై ఇంతకాలం వాటి యజమానులకు ఉన్న హక్కులు రద్దయ్యాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వ భూసేకరణ చట్టంలోని సెక్షన్ 3డీ ప్రకారం గుర్తిస్తూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల సంస్థ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తర భాగం పరిధిలో.. భూసేకరణకు ఎనిమిది అథారిటీ(కాంపిటెంట్ అథారిటీ ఫర్ లాండ్ అక్విజిషన్–కాలా)లు ఉండగా, ఈనెల 18వ తేదీతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్, సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్–జోగిపేట కాలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు
రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరభాగంలో 1,58.62 కి.మీ. నిడివికి గాను దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.5,170 కోట్ల వరకు ఖర్చవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐఏ) ఈ ప్రాజెక్టు బడ్జెట్‌లో అంచనా వేసింది. అందులో సగ భాగాన్ని రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. రూ.2,585 కోట్లు భూసేకరణకు, రూ.363.43 కోట్లు స్తంభాలు వంటి వాటిని తరలించేందుకు అయ్యే వ్యయంగా జమ చేయాలంటూ ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ సంతోశ్‌కుమార్ యాదవ్ గతేడాది రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు.
సాధారణంగా 3డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాక అవార్డ్ పాస్ చేసే సమయంలో ఈ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుందని, అడ్వాన్సుగా చెల్లించటమెందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. అయినా, ఎన్‌హెచ్‌ఏఐ లేఖలు రాస్తూనే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటంతో 3డీ గెజిట్ విడుదలలో జాప్యం జరిగింది. గతేడాది ఏప్రిల్‌లో మూడు, ఆగస్టులో ఐదు కాలాలకు 3ఏ గెజిట్ విడుదల చేసిన ఎన్‌హెచ్‌ఏఐ, నెలలు గడుస్తున్నా భూసేకరణ ప్రక్రియలో కీలకమైన 3డీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం వరకు వెళ్లి ఒకదశలో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.
తెలంగాణ: మహిళలకు లక్కీ చాన్స్! గురుకుల కొలువుల్లో వారికే అధికం
ఈ తరుణంలో ఇటీవల కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య దీని విషయంలో ఎట్టకేలకు రాజీ కుదిరింది. ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు కేటాయించామని, దాన్ని దశలవారీగా విడుదల చేస్తామని, ముందుగా రూ.100 కోట్లు డిపాజిట్ చేస్తామన్న రాష్ట్రప్రభుత్వ అధికారుల ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఐ అధికారులు సానుకూలంగా స్వీకరించారు. దీంతో ఎన్‌హెచ్‌ఐఏ 3 డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. పట్టాదారు పేర్లతో.. రీజినల్ రింగురోడ్డు నిర్మించే అలైన్‌మెంట్ పరిధిలోకి వచ్చే భూములను గుర్తించి గతంలోనే సర్వే చేసిన అధికారులు.. తాజా గెజిట్ నోటిఫికేషన్‌లో ఊరు, సర్వే నంబరు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పేరు.. ఇలా పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించారు.
వచ్చే నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలను అందించవచ్చని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఇంతకు ముందు ప్రాథమిక నోటిఫికేషన్ల సమయంలో అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించి చివరకు వాటిని అనుమతించలేదంటూ తాజా నోటిఫికేషన్‌లో వెల్లడించటం గమనార్హం. నిర్ధారిత భూమి పూర్తిగా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వచ్చిందంటూ కొత్త నోటిఫికేషన్‌లో పేర్కొన్నందున, ఇప్పుడు కొత్తగా వచ్చే అభ్యంతరాల ప్రభావం ఎంతుంటుందనేది ప్రశ్నార్థకమే. ఇక అవార్డు పాస్ చేయటమే.. చట్టంలోని 3డీ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనందున ఇక అవార్డు పాస్ చేయటమే తరువాయి. ఇప్పటికే ఊళ్ల వారీగా సర్వేనెంబర్లతో పట్టాదారుల పేర్లను, భూ విస్తీర్ణాన్ని గుర్తించి సర్వే చేసిన అధికారులు.. వాటిని మరోసారి వెరిఫై చేసి నోటీసులు జారీ చేయనున్నారు. పట్టాదారు బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. అభ్యంతరాలతో.. దాన్ని తీసుకునేందుకు నిరాకరించే వారి పేరుతో సంబంధిత కోర్టులో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు.
కాలాల వారీగా ఊళ్లు..సేకరించే భూ విస్తీర్ణం ఇలా..
యాదాద్రి–భువనగిరి
రోడ్డులో 98వ కి.మీ. నుంచి 118 కి.మీ. వరకు దీని పరిధి ఇందులో సేకరించే మొత్తం భూమి విస్తీర్ణం 184.961 హెక్టార్లు ఊళ్లు: వీరారెడ్డిపల్లె, ఇబ్రహీంపూర్, కోనాపురం, దత్తాయపల్లె, వేల్పులపల్లె, మల్లాపూర్, దాతర్‌పల్లె
ఆందోల్–జోగిపేట
రోడ్డు నిడివిలో 9.56 కి.మీ. నుంచి 18.18 కి.మీ. పరిధి మొత్తం భూ విస్తీర్ణం 94.38 హెక్టార్లు ఊళ్లు: శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్
చౌటుప్పల్ రోడ్డు
నిడివిలో 133.17 కి.మీ. నుంచి 158.64 కి.మీ. వరకు మొత్తం సేకరించే భూ విస్తీర్ణం 225.02 హెక్టార్లు గ్రామాలు: పహిల్వాన్‌పూర్, రెడ్లరేపాక, పొద్దటూరు, వెర్కట్‌పల్లె, గోకారం, నేలపట్ల, చిన్నకొండూరు, చౌటుప్పల్, తలసింగారం, లింగోజిగూడ.
(చదవండి: రైతన్న ఆశలు ఆవిరి)
Comments
Please login to add a commentAdd a comment