
ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
10,472.723 చదరపు కిలోమీటర్లకు
పెరగనున్న హెచ్‌ఎండీఏ పరిధి
ఎఫ్‌సీడీఏ పరిధిలోకి మరో 36గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో వెలువరించింది. దీంతో ఇప్పటివరకు 7,257 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధి 10,472.723 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాలకు విస్తరిస్తుంది.
మొత్తం 1,355 గ్రామాలు, 104 మండలాలు సంస్థ పరిధిలోకి వస్తాయి. మరోవైపు ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలోకి తెచ్చారు. రీజినల్ రింగ్‌రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టూ 354 కిలోమీటర్ల పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ప్రగతి పరుగులు!
అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడం వల్ల ప్రగతి పరుగులు పెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న హైదరాబాద్ నగరాన్ని కోర్ అర్బన్ ప్రాంతంగా పరిగణిస్తూ సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల వరకు జీహెచ్‌ఎంసీని విస్తరిస్తారు.
ఆ తర్వాత ఔటర్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా పరిగణిస్తూ శాటిలైట్ టౌన్‌షిప్పులు, ఇతర మౌలిక సదుపాయాలతో నగరాన్ని విస్తరించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు తరువాత ఉన్న తెలంగాణను రూరల్ తెలంగాణగా పరిగణించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం కూడా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం త్వరలో అంతర్జాతీయ కన్సల్టెన్సీల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment