
‘మహా’ విస్తరణకు ముహూర్తం ఖరారు
త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చ, అనంతరం ఆమోదించే అవకాశం
7,257 చదరపు కి.మీ. నుంచి 11,000 చదరపు కి.మీ. దాకా నగరం విస్తరణ
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్‌సిటీ దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ పరిధి మరింత విస్తరించనుంది. నిర్మాణాత్మకమైన, ప్రణాళికాబద్ధమైన మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి పెరగనుంది.
త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించే అవకాశముంది. ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీఅర్బన్‌గా విభజిస్తారు. మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు.
ఈ మేరకు సెమీఅర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దీంతో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు సుమారు 2,000 చదరపు కిలోమీటర్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రానుంది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్‌కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ పరిధి పెరగనుంది.
ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్‌ఎండీఏ పరిధి..11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్టు అంచనా. ఇప్పుడు 70 మండలాలు, 1,000 గ్రామపంచాయతీలు, 8 కార్పొరేషన్‌లు, మరో 38 కి పైగా మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి.
కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరగనున్న నేపథ్యంలో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు కొత్తగా చేరుతాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, 1,400లకు పైగా గ్రామాలతో హెచ్‌ఎండీఏ పరిధి భారీగా పెరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిన వెంటనే జీవో విడుదల అవుతుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అంచలంచెలుగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా)ని ఏర్పాటు చేశారు. 650 చదరపు కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉండేది. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో 2008లో హుడా స్థానంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ)ని ఏర్పాటు చేశారు. దీంతో 7,257 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ పరిధి పెరిగింది.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. కొత్తగా జిల్లాల విభజన జరిగిన తర్వాత హెచ్‌ఎండీఏలోని జిల్లాల సంఖ్య 7 కు పెరిగింది. ప్రస్తుతం 11జిల్లాలకు దీని పరిధిని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి.
సుమారు 1,400 గ్రామాలు హెచ్‌ఎండీఏలో కలిసే అవకాశముంది. ట్రిపుల్ ఆర్ తర్వాత 5 కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ పరిధి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ప్రజా రవాణా సదుపాయాలు, మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటికే లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది.
⇒ రీజినల్ రింగ్‌రోడ్డును అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం హెచ్‌ఎండీఏ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఔటర్‌రింగ్ రోడ్డు(రావిర్యాల) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ఆమన్‌గల్లు) వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.
⇒ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణపైన కూడా దృష్టి సారించింది. లీ అసోసియేషన్ రూపొందించే కామన్ మెబిలిటీ ప్లాన్ సమగ్ర నివేదిక త్వరలో వెలువడనుంది.
వచ్చే నెలలో మాస్టర్‌ప్లాన్‌కు బిడ్డింగ్
మరోవైపు ట్రిపుల్ ఆర్ వరకు హెచ్‌ఎండీఏ పరిధి పెరగనున్న దృష్ట్యా భవిష్యత్ అవసరాల మేరకు 2051 వరకు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాల్సిన సమగ్ర మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే నెలలో ఆన్‌లైన్ బిడ్డింగ్‌ను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఉన్న 5 మాస్టర్ ప్లాన్‌లను విలీనం చేసి ఒకే మాస్టర్‌ప్లాన్‌గా అభివృద్ధి చేస్తారు.
ఫోర్త్ సిటీకి స్పెషల్ అథారిటీ..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫోర్త్‌సిటీ అభివృద్ధికి స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు సైతం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గత నెలలోనే జీవో వెలువడింది.
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్తగా స్కిల్ యూనివర్సిటీతో పాటు విద్యాసంస్థలకు, పారిశ్రామికరంగానికి ఈ ప్రాంతం హబ్‌గా మారనుంది. ఈ క్రమంలో ఫోర్త్‌సిటీ పరిధిలోని వచ్చే 56 రెవెన్యూ గ్రామాను అభివృద్ధి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment