రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగంలో ఖరారు
మూసీ నదిపై వలిగొండ సమీపంలోని పొద్దుటూరు వద్ద కి.మీ. నిడివితో నిర్మాణం
మంజీరా నదిపై శివంపేట వద్ద.. హరిద్రా నదిపై తూప్రాన్ వద్ద నిర్మాణం
ప్రస్తుతానికి నాలుగు లేన్లకు సరిపడా తొలి భాగం నిర్మాణం
భవిష్యత్తులో వాటి పక్కనే రెండో భాగానికి ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగంలో మూడు నదులపై వంతెనలను ఖరారు చేశారు. దక్షిణ భాగం రోడ్డును సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే యోచనలో ఉండటంతో ఉత్తర భాగాన్ని పట్టాలెక్కించే పనిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తలమునకలై ఉంది. భూసేకరణ ప్రక్రియలో కీలక అంకమైన అవార్డులను పాస్ చేసే ప్రక్రియకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత టెండర్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఆపై మరో 5–6 నెలల్లో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో రోడ్డు డిజైన్ సహా ఇంటర్‌చేంజ్ వంతెలు, నదీ వంతెనలు, అండర్‌పాస్‌లు తదితర స్ట్రక్చర్ డిజైన్లు సిద్ధం చేసుకుంది. ఉత్తర భాగంలో మూడు చోట్ల రీజనల్ రింగురోడ్డు నదులను క్రాస్ చేస్తుంది. ఆ మూడు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించనుంది. మూసీ నదిపై వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ సమీపంలో, మంజీరా నదిపై పుల్కల్ మండలం శివంపేట గ్రామ సమీపంలో, హరిద్రా నది (హల్దీ నది/హల్దీ వాగు) తూప్రాన్ దగ్గర ఈ వంతెనలను నిర్మించనున్నారు.
మూసీపై కిలోమీటర్ పొడవుతో..
మూడు నదులపై నిర్మించే వంతెనల్లో మూసీ నదిపై దాదాపు కిలోమీటరు పొడవుతో వంతెన నిర్మాణం కానుంది. నల్లగొండ–భువనగిరి రోడ్డులో భాగంగా ఇప్పటికే వలిగొండ వద్ద వంతెన ఉండగా ఇప్పుడు వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ శివారులో ఈ వాగును రీజనల్ రింగురోడ్డు క్రాస్ చేయనుంది. అక్కడ కిలోమీటరు పొడవుతో వంతెనకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతోంది. దీనికి దాదాపు రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
నాందేడ్ జాతీయ రహదారికి సమాంతరంగా..
మెదక్–సంగారెడ్డి రోడ్డు 161వ నంబర్ నాందే డ్–హైదరాబాద్ జాతీయ రహదారిలో కలిసిన ప్రాంతంలో మంజీరా నదిపై వంతెన నిర్మించనున్నారు. పుల్కల్ మండలం శివంపేట గ్రామ సమీపంలో మంజీరా నదిని రీజనల్ రింగు రోడ్డు క్రాస్ చేయనుంది. దీంతో అక్కడ దాదాపు 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మించనున్నారు. దీనికి దాదాపు రూ. 75 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.
తూప్రాన్ సమీపంలో..
గజ్వేల్ మీదుగా ప్రవహిస్తూ మంజీరా నదిలో కలిసే హరిద్రా నదిపై తూప్రాన్ వద్ద మూడో వంతెనకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతోంది. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇప్పటికే అక్కడ ఓ వంతెన ఉంది. దానికి దాదాపు చేరువలో తూప్రాన్ వద్ద మరో వంతెన రానుంది.
తొలుత నాలుగు వరసలకే..
రీజనల్ రింగు రోడ్డును 8 వరుసలతో నిర్మించేలా ప్రణాళిక రచించినా తొలుత నాలుగు లేన్లకే పరిమితమవుతున్నారు. మిగతా నాలుగు లేన్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగు సమయంలో నిర్మించనున్నారు. అయితే ఆ నాలుగు వరుసలకు సరిపడా భూమిని సైతం సేకరించి చదును చేసి వదిలేయనున్నారు. మిగతా నాలుగు లేన్లను మాత్రం ఇప్పుడు నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో భాగంగానే వంతెనలు ఉంటున్నందున వాటిని కూడా ఎనిమిది వరుసలకు సరిపడేలా నిర్మించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ప్రధాన క్యారేజ్ వేను నాలుగు లేన్లకు పరిమితం చేసినందున వంతెనలను కూడా నాలుగు లేన్లకే సరిపడేలా నిర్మించనున్నారు. ఇప్పుడు నిర్మించే వంతెనల పక్కనే తదుపరి నాలుగు వరుసల వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. పక్కపక్కనే నిర్మించేప్పుడు పాత వంతెనల పిల్లర్లకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి ప్రమాదం లేకుండా ఫౌండేషన్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం వాటికి ప్రత్యేక డిజైన్‌ను అనుసరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment