Bridges
-
రూట్ బ్రిడ్జ్ యునెస్కో జాబితాలో...
మేఘాలయ రాష్ట్రంలో సర్వసాధారణంగా కనిపించే లివింగ్ రూట్ బ్రిడ్జీల గురించి మనకు తెలిసిందే. ఆ రాష్ట్రానికే మన దేశానికీ ప్రకృతి పరంగా గుర్తింపు తెచ్చిన ఈ రూట్ బ్రిడ్జ్‌లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడం కోసం ప్రతినిధుల బృందం తరలి వచ్చింది. ప్రస్తుతం యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్న లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లను ప్రపంచ ప్రసిద్ధ వారసత్వ జాబితాలోకి చేరనుందని మేఘాలయ పర్యాటక మంత్రి పాల్ తెలియజేస్తున్నారు. 42వ యునెస్కో జనరల్ కాన్ఫరె ్స ప్రెసిడెంట్, రొమేనియా రాయబారి అయిన సిమోనా–మిరేలా మికులేస్కుతో లింగ్డో, జింగ్కీంగ్ జ్రీ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో గుర్తించడం కోసం సమావేశం జరి΄ారు. ఈ సమావేశంలో యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి కూడా ఉన్నారు. -
3 నదులపై 3 వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో మూడు నదులపై వంతెనలను ఖరారు చేశారు. దక్షిణ భాగం రోడ్డును సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే యోచనలో ఉండటంతో ఉత్తర భాగాన్ని పట్టాలెక్కించే పనిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తలమునకలై ఉంది. భూసేకరణ ప్రక్రియలో కీలక అంకమైన అవార్డులను పాస్ చేసే ప్రక్రియకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత టెండర్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఆపై మరో 5–6 నెలల్లో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు డిజైన్ సహా ఇంటర్చేంజ్ వంతెలు, నదీ వంతెనలు, అండర్‌పాస్‌లు తదితర స్ట్రక్చర్ డిజైన్లు సిద్ధం చేసుకుంది. ఉత్తర భాగంలో మూడు చోట్ల రీజనల్ రింగురోడ్డు నదులను క్రాస్ చేస్తుంది. ఆ మూడు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించనుంది. మూసీ నదిపై వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ సమీపంలో, మంజీరా నదిపై పుల్కల్ మండలం శివంపేట గ్రామ సమీపంలో, హరిద్రా నది (హల్దీ నది/హల్దీ వాగు) తూప్రాన్ దగ్గర ఈ వంతెనలను నిర్మించనున్నారు. మూసీపై కిలోమీటర్ పొడవుతో.. మూడు నదులపై నిర్మించే వంతెనల్లో మూసీ నదిపై దాదాపు కిలోమీటరు పొడవుతో వంతెన నిర్మాణం కానుంది. నల్లగొండ–భువనగిరి రోడ్డులో భాగంగా ఇప్పటికే వలిగొండ వద్ద వంతెన ఉండగా ఇప్పుడు వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ శివారులో ఈ వాగును రీజనల్ రింగురోడ్డు క్రాస్ చేయనుంది. అక్కడ కిలోమీటరు పొడవుతో వంతెనకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. దీనికి దాదాపు రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. నాందేడ్ జాతీయ రహదారికి సమాంతరంగా.. మెదక్–సంగారెడ్డి రోడ్డు 161వ నంబర్ నాందే డ్–హైదరాబాద్ జాతీయ రహదారిలో కలిసిన ప్రాంతంలో మంజీరా నదిపై వంతెన నిర్మించనున్నారు. పుల్కల్ మండలం శివంపేట గ్రామ సమీపంలో మంజీరా నదిని రీజనల్ రింగు రోడ్డు క్రాస్ చేయనుంది. దీంతో అక్కడ దాదాపు 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మించనున్నారు. దీనికి దాదాపు రూ. 75 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. తూప్రాన్ సమీపంలో.. గజ్వేల్ మీదుగా ప్రవహిస్తూ మంజీరా నదిలో కలిసే హరిద్రా నదిపై తూప్రాన్ వద్ద మూడో వంతెనకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇప్పటికే అక్కడ ఓ వంతెన ఉంది. దానికి దాదాపు చేరువలో తూప్రాన్ వద్ద మరో వంతెన రానుంది. తొలుత నాలుగు వరసలకే.. రీజనల్ రింగు రోడ్డును 8 వరుసలతో నిర్మించేలా ప్రణాళిక రచించినా తొలుత నాలుగు లేన్లకే పరిమితమవుతున్నారు. మిగతా నాలుగు లేన్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగు సమయంలో నిర్మించనున్నారు. అయితే ఆ నాలుగు వరుసలకు సరిపడా భూమిని సైతం సేకరించి చదును చేసి వదిలేయనున్నారు. మిగతా నాలుగు లేన్లను మాత్రం ఇప్పుడు నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో భాగంగానే వంతెనలు ఉంటున్నందున వాటిని కూడా ఎనిమిది వరుసలకు సరిపడేలా నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన క్యారేజ్ వేను నాలుగు లేన్లకు పరిమితం చేసినందున వంతెనలను కూడా నాలుగు లేన్లకే సరిపడేలా నిర్మించనున్నారు. ఇప్పుడు నిర్మించే వంతెనల పక్కనే తదుపరి నాలుగు వరుసల వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. పక్కపక్కనే నిర్మించేప్పుడు పాత వంతెనల పిల్లర్లకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి ప్రమాదం లేకుండా ఫౌండేషన్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం వాటికి ప్రత్యేక డిజైన్‌ను అనుసరించనున్నారు. -
రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి
ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ఉక్రేనియన్ దళాలు పశ్చిమ రష్యాలోని సెమ్ నదిపై ఉన్న మూడు వంతెనలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వివరాలను రష్యన్ అధికారులు మీడియాకు వెల్లడించారు.పశ్చిమ రష్యాపై ఉక్రెయిన్ దాడి మూడో వారంలోకి ప్రవేశించింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో జరిగిన కీవ్ దాడి.. యుద్ధ పరిణామాలను ఊహకందని విధంగా మార్చివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాపై ఇదే అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. ఈ తాజా దాడి నేపధ్యంలో ఉక్రెయిన్ విజయోత్సవాలు చేసుకుంటుండగా, అదే సమయంలో తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్క్‌ను కూడా స్వాధీనం చేసుకునే దిశగా రష్యా ముందుకు కదులుతోంది.కుర్స్క్ పరిధిలోని సెయిమ్ నదిపైగల మూడు వంతెనలపై ఉక్రేనియన్ దాడి చేసింది. ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్ సెమ్ నదిపైగల వంతెనలపై జరిపిన దాడులకు సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు. కుర్స్క్ ప్రాంతంలో దాడి మొదలుపెట్టినప్పటి నుండి ఉక్రేనియన్ దళాలు 1,250 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, 92 రష్యా స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.తమ దేశంపై భవిష్యత్తులో జరిగే సరిహద్దు దాడులను నిరోధించేందుకు ‘బఫర్ జోన్’ను ఏర్పాటుచేసే లక్ష్యంతో ఉన్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్ దగ్గర భారీ సంఖ్యలో రష్యన్ యుద్ధ ఖైదీలు ఉన్నారని తెలిపారు. రష్యా తన దగ్గరున్న ఉక్రెయిన్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా ఉక్రేనియన్ సైన్యం జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన 17 మంది మృతిచెందారని, 140 మంది గాయపడ్డారని రష్యన్ మెడికల్ సర్వీస్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. -
‘‘బిహార్‌లో బ్రిడ్జిలు కూలడం వెనుక కుట్ర’’
పాట్నా: బిహార్‌లో వరుసగా బబ్రిడ్జిలు కూలిపోవడంపై కేంద్ర మంత్రి జితన్‌రామ్ మాంజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంతెనలు వరుసగా కూలిపోవడం వెనుక ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్న కుట్ర ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.‘రెండు నెలల క్రితం బ్రిడ్జిలన్నీ సరిగానే ఉన్నాయి. ఇప్పుడేమో వరుసపెట్టి కూలిపోతున్నాయి. ప్రభుత్వాన్ని అవమానించేందుకు కొంత మంది కావాలనే ఇది చేస్తున్నారని అనుమానం వస్తోంది. వంతెనలు కూలిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నాకు సమాచారం ఉంది’అని మాంజీ అన్నారు. గడిచిన 10 రోజుల్లో బిహార్‌లో వరుసపెట్టి బ్రిడ్జిలు కూలిపోవడం చర్చనీయాంశమైంది. -
హైదరాబాద్‌లోనే ‘టాప్’గా.. అత్యంత ఎత్తైన ఫ్లై ఓవర్..
హైదరాబాద్: నగరంలోనే అత్యంత ఎత్తులో.. మెట్రోరైలు మార్గంపైన నిర్మించిన ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తెలపడంతో, ఇప్పటికే పూర్తయిన ఈ ఫ్లైఓవర్‌కు తుది మెరుగులద్దే పనులు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద జీహెచ్ఎంసీ వివిధ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తోంది. వాస్తవానికి ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ఫ్లైఓవర్ పనుల్లో స్థల సేకరణ తదితర సమస్యలతో జాప్యం ఏర్పడింది. గుడి స్థలాన్ని సైతం సేకరించాల్సి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఈ ఫ్లైఓవర్‌ను తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్.. పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించడంతో వేగం పెంచి పూర్తి చేశారు. ఎస్సార్డీపీ కింద జీహెచ్ఎంసీ ఇప్పటికే 32 పనులు పూర్తి చేసింది. ఫ్లై ఓవర్లలో ఇది 20వ ఫ్లై ఓవర్‌గా అధికారులు తెలిపారు. ఎంతో ఎత్తులో.. ఎస్సార్డీపీ కింద ఇప్పటి వరకు నిర్మించిన ఫ్లై ఓవర్లు ఒక ఎత్తయితే. ఇది మరో ఎత్తు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఈ ఫ్లై ఓవర్ మెట్రో మార్గాన్ని క్రాస్ చేయాల్సి ఉండటంతో మెట్రో మార్గం పైనుంచి దీన్ని తీసుకువెళ్లారు. అక్కడ భూమి నుంచి ఫ్లై ఓవర్ ఎత్తు 26 మీటర్లకు పైగా ఉందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్)ఎం.దేవానంద్ తెలిపారు. బహుశా ఈ నెల రెండో వారంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఎస్సార్డీపీలో పొడవైన ఫ్లై ఓవర్లలో ఇది మొదటి స్టీల్ ఫ్లైఓవర్ అని తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.450 కోట్లు. ఫ్లై ఓవర్ పొడవు 2.6 కి.మీ. స్టీల్‌తో నిర్మాణం నగరీకరణ, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ సమయం తగ్గించేందుకు స్టీల్‌తో నిర్మించారు. ఖర్చు దాదాపు 30 శాతం అధికమైనప్పటికీ, 40 శాతం మేర సమయం తగ్గుతుండటంతో ట్రాఫిక్ సమస్యలున్న ప్రాంతాల్లో స్టీల్‌బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. హౌరా– కోల్కత్తా నగరాలను కలుపుతూ హుగ్లీ నదిమీద నిర్మించిన పొడవైన హౌరాబ్రిడ్జి స్టీలు బ్రిడ్జేనని అధికారులు తెలిపారు. ప్రయోజనాలు ఈ ఫ్లై ఓవర్(ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ట్రాఫిక్ తగ్గుతుంది. సచివాలయం నుంచి హిందీ మహావిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, అంబర్‌పేట, మూసారంబాగ్ల వైపు వెళ్లే వారికి ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నళ్లున్న ఇందిరాపార్కు, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఎక్కడా ఆగకుండా సిగ్నల్ ఫ్రీగా వెళ్లిపోవచ్చు. -
‘దారి’ తోచక.. దిక్కులేక..
సాక్షి, ఆదిలాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు, కోతలు ఏర్పడ్డాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పక్కా రోడ్లు లేకపోవడంతో అక్కడి ప్రజలు తాత్కాలిక దారులను ఏర్పాటు చేసుకొని రాకపోకలు సాగించడం పరిపాటిగా మారింది. పరశురాం మృతిచెందిన బజార్హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామ రోడ్డుదీ ఇదే పరిస్థితి. ఈ రోడ్డుతో కలుపుకొని జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 40 రోడ్ల నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ నుంచి గత ఏడాది నవంబర్ 14న రూ.42.29 కోట్లు మంజూరయ్యాయి. అయితే అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గిరిజన గూడేలు, తండాల గుండా రోడ్లు వేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు లభించకపోవటంతో పనులు ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. దీంతో మంజూరైన నిధులు ఇప్పటికీ మూలుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. రోడ్లు దెబ్బతినడంతో ప్రజల దైనందిన జీవనం దుర్భరంగా మారింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు, అత్యవసరాలకు ఇబ్బందులే.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం టక్కుగూడ గ్రామ గిరిజనులు సరుకుల కోసం ఇలా వాగు దాటుతూ, బురదమయంగా ఉన్న రోడ్ల గుండా మండల కేంద్రానికి చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రేషన్ సరుకులు, ఎరువులు, వైద్యం, ఇతర పనుల నిమిత్తం కార్యాలయాలకు రావాలంటే సర్కస్ ఫీట్లు చేయక తప్పదు. నేటికీ తమ బతుకులు మారడం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఉట్నూర్ మండలంలోని మారుమూల గ్రామాల రోడ్లు, వంతెనలు దెబ్బతిని కుమ్మరికుంట, వంకతుమ్మ, బాబాపూర్, రాజులగూడ, నర్సాపూర్ గ్రామాల గిరిజనులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఎప్పుడూ ఇబ్బందే.. భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చే రాజుల్ వాడి గ్రామం నుంచి గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు అస్తవ్యస్తంగా తయారైంది. ఈ గ్రామ వాసులు నిత్యావసర సరుకుల కొను గోలు, ఇతర అవసరాల కోసం కరంజి (టి)కి వెళ్లాల్సిందే. ఈ రోడ్డు బాగోలేకపోవడంతో ఎప్పుడూఇబ్బందులే. రోడ్లు లేక.. డాక్టర్లు రాక.. వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు.. వెరసి ఈ నెల 3న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో మూడేళ్ల బాలుడు పరశురాం మృతిచెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జ్వరం, వాంతులు, విరోచనాలతో ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ అతని తండ్రి పంద్ర లక్ష్మణ్.. రోడ్డు బాగాలేదనే కారణంతో అంతకు ముందు రోజు రాత్రి దూరంగా ఉన్న ఆస్పత్రికి తన బిడ్డను తీసుకెళ్లలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం బురద, గుంతల రోడ్డుపై తన బిడ్డను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళుతుండగా మధ్యలోనే బాలుడి పరిస్థితి విషమించింది. తీరా ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వెళ్లినప్పటికీ డాక్టర్లు అందుబాటులో లేక సకాలంలో వైద్యం అందక పోవడంతో పరశురాం మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల రోడ్ల దుస్థితిని తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వానికి నివేదిక ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలకు ఆర్‌అండ్‌బీకి సంబంధించి దాదాపు 87 కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనలు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రూ.28.6 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలికంగా వాటి పునరుద్ధరణకు రూ.74 లక్షలు, పక్కాగా బాగుచేయడానికి రూ.80 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇక పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 111 రోడ్లు, వంతెనలు, కల్వర్టులు 144 కిలోమీటర్ల మేర అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.67 లక్షలు అవసరం కాగా, రోడ్లు, బ్రిడ్జీల పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.255 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. -
ఐదు జిల్లాల్లో భారీ నష్టం !
సాక్షి, హైదరాబాద్, బూర్గంపాడు: భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్డీఎంఏ) సలహాదారుడు కునాల్ సత్యార్థి వెల్లడించారు. వరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనట్టు తమ పరిశీలినలో తేలిందన్నారు. ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో భారీ ఆస్తి నష్టం కలిగిందన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కునాల్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం ఈ నెల 1 నుంచి 3 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమావేశమై తమ పరిశీలనకు వచ్చిన విషయాలను వివరించింది. విపత్తుల నివారణకు కేంద్ర బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని శాంతి కుమారి తెలిపారు. కేంద్రానికి సమగ్ర నివేదిక అందిస్తాం గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లో నష్టపోయిన పంటలను, ముంపు ప్రాంత ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం పరిశీలించింది. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల దెబ్బతిన్న పంటలు, రహదారుల వివరాలను బృందం స భ్యులకు వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. పంట, రహదారుల నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే అన్న బీజేపీ నేతలు వాతావరణశాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు జారీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం తగిన వేగంతో స్పందించకపోవడంతోనే తీవ్రనష్టం వాటిల్లిందని కేంద్ర వరద పరిశీలక బృందం దృష్టికి బీజేపీ ప్రతినిధి బృందం తీసుకొచ్చింది. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం మునిగిపోవడం వెనక రాష్ట్ర ప్రభుత్వ సమన్వయలేమి స్పష్టమైన ఉదాహరణగాకనిపిస్తోందని పేర్కొంది. గురువారం ఈ మేరకు కేంద్ర హోంశాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు (పీపీ) కునాల్ సత్యార్థికి బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీనేత అశ్వథ్థామరెడ్డి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందేలా చూడాలని కోరారు. -
60 కొత్త వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రికార్డు స్థాయి వర్షాలతో రోడ్లు మునిగి వాహనరాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో 60 కొత్త వంతెనలను రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదించింది. తక్కు వ ఎత్తుతో ఉన్న కాజ్‌వేలు, కల్వర్టులను తొలగించి వాటి స్థానంలో వంతెనలు కట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వీటి నిర్మాణానికి రూ.1150 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో దాదాపు రూ.50 కోట్ల వ్యయం అయ్యే వంతెన జాతీయ రహదారుల మీద ఉండగా, మిగతావి రాష్ట్ర రహ దారులపై ఉన్నవి కావటం విశేషం. ఈ వంతెనలు కాకుండా, మరో 635 కల్వర్టులను కూడా ప్రతిపాదించారు. ఇక తాజా వాన లతో ములుగు జిల్లా జంపన్న వాగు మీద దొడ్ల గ్రామం వద్ద ఉన్న వంతెన, ములుగు–బుద్ధారం మధ్య రాళ్లవాగు మీద ఉన్న వంతెన, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల వంతెన కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మహబూబాబాద్‌లో మున్నేరు వాగు మీద ఉన్న వంతెన అప్రోచ్ రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. ఆ వంతెన వద్ద వరద పోటెత్తినందున దాని పటుత్వాన్ని పరిశీలించాల్సి ఉంది. రాష్ట్ర రహదారుల పునరుద్ధరణకు రూ.600 కోట్లు.. కొత్త వంతెనలతో కూడిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అను మతి రావాల్సి ఉంది. రాని పక్షంలో, ప్రస్తుత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించటంతో సరిపెట్టనున్నారు. ఈ పునరుద్ధరణ పనులకు రూ.600 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రోడ్లు దెబ్బతిని ప్రస్తుతం వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిన చోట్ల తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర రహదారులపై తాత్కాలిక మరమ్మతులకు రూ.46 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. జాతీయ రహదారులపై తాత్కాలిక మరమ్మతులకు రూ.36 కోట్లు విడుదల చేయాలని, దెబ్బతిన్న రోడ్ల పునురుద్ధరణ, ప్రతిపాదించిన కొత్త వంతెన, కల్వర్టుల కోసం రూ.148 కోట్లు అవసరమని జాతీయ రహదారుల విభాగం ప్రతిపాదించింది. భూపాలపట్నం జాతీయ రహదారిపై టేకులగూడెం వద్ద రూ.50 కోట్లతో వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల విభాగం ప్రతిపాదించింది. దీనికి కేంద్రప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. -
భారతదేశంలో టాప్ 10 వంతెనలు
-
ప్రపంచంలోని టాప్ 10 వంతెనలు (ఫోటోలు)
-
తెలంగాణలో కొత్తగా 300 వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రహదారుల మీదుగా పారే వాగులు, వంకలపై కొత్తగా 300 వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతినడంతో ఆయా ప్రాంతాల్లో వెంటనే వంతెనలు నిర్మించి వరద పారేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని, లేకుంటే రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఇటీవల అధికారులు నివేదిక సమర్పించారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించడంతో అధికారులు సర్వే చేసి 300 ప్రాంతాల్లో వంతెనలు అవసరమని తేల్చారు. ఇప్పుడు వాటిల్లో 150 వంతెనల పనులను ప్రారంభించి వీలైనంత తొందరగా పూర్తి చేయనున్నారు. 10 మీటర్ల నుంచి 50 మీటర్ల నిడివితో.. పంచాయతీ రోడ్లు పోను రాష్ట్ర స్థాయి రోడ్ల నిడివి 28 వేల కిలోమీటర్ల మేర ఉంది. వాటిల్లో కొన్ని చోట్లే వంతెనలు ఉన్నాయి. మిగతా చోట్ల పాత కల్వర్టులు, పాత బ్రిడ్జీలకే మరమ్మతులు చేస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. గత రెండేళ్లలో వరదలకు 133 వంతెనలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాటిని ఎత్తుగా నిర్మించనున్నారు. వాగులు పారే మరో 167 చోట్ల వంతెనలు లేవు. వర్షాకాలంలో ఆ రోడ్ల మీదుగానే వరద పారుతోంది. ఈ ప్రాంతాల్లో రూ. 635 కోట్లతో వంతెనలు నిర్మించనున్నారు. 10 మీటర్ల నుంచి 50 మీటర్ల నిడివితో వాటిని ఎత్తుగా నిర్మించనున్నారు. గత పదేళ్లలో వరదనీరు ఆయా ప్రాంతాల్లో ఎంత ఎత్తు, ఎంత వెడల్పుతో ప్రవహించిందన్న వివరాలను సేకరించిన అధికారులు ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో వంతెనల పొడవు, ఎత్తు నిర్ధారించారు. ప్రారంభమైన పునరుద్ధరణ పనులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారి రాష్ట్ర రహదారులకు కాలానుగుణ పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నారు. దాదాపు 2 వేల కి.మీ. నిడివిగల రోడ్లను పటిష్టపరిచేలా మరమ్మతులు చేపట్టనున్నారు. వాటిని 1,187 పనులుగా విభజించగా ఇందులో ఇప్పటికే 126 పనులు పూర్తి చేశారు. మిగతా వాటిల్లో 173 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 474 పనులు టెండర్లు పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతావాటికి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ మరమ్మతులకు రూ. 1,700 కోట్లు ఖర్చు కానుంది. -
వన్యప్రాణులకు అభయం.. మొదటి ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా?
పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మంత్రమిదే. వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. అభివృద్ధి కార్యకలాపాల్లో ముందడుగు వేస్తూనే వన్యప్రాణుల్ని కాపాడడం కోసం అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వేలను ఎకో వంతెనలతో తీర్చిదిద్దుతున్నారు. ఆ వంతెనల కథాకమామిషు చూద్దాం.. మహారాష్ట్రలో నాగపూర్, ముంబై మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన బాలాసాహెబ్ ఠాక్రే సమృద్ధి మహా మార్గ్ (ఎక్స్‌ప్రెస్‌వే) మొదటి దశ ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. మన దేశంలో నిర్మించిన పూర్తి స్థాయి తొలి ఎకో వంతెన ఇది. రోడ్లపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వచ్చే వన్యప్రాణులకి ఎలాంటి హాని కలగకుండా ఈ ఎక్స్‌ప్రెస్ వే మార్గం పచ్చగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేలా నిర్మించారు. దారిన పోయే జంతువులు, వన్యప్రాణులు నిర్భయంగా సంచరించడానికి తొమ్మిది గ్రీన్ వంతెనలు (ప్లై ఓవర్ తరహా నిర్మాణాలు), మరో 17 అండర్ పాపెస్ నిర్మించారు. మొత్తం 701 కి.మీ. పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్ తొలిదశలో 520 కి.మీ. పూర్తి చేసుకుంది. ఈ వంతెనతో ప్రయాణికులు వన్యమృగాల భయం లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించవచ్చు. మరో వైపు అవి తిరగడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ ఎక్స్‌ప్రెస్ వే పొడవున సంచరించే చిరుత పులులు రహదారులపైకి రాకుండా ఫెన్సింగ్ నిర్మిస్తారు. మహారాష్ట్రలో 10 జిల్లాల మీదుగా సాగే ఈ వంతెన నిర్మాణం రెండో దశ కూడా పూర్తయితే నాగపూర్, ముంబైల మధ్య 16 గంటలు పట్టే ప్రయాణ సమయం 8 గంటలు పడుతుంది. ఏమిటీ వన్యప్రాణుల వంతెనలు? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వన్యప్రాణుల రాకపోకలు సాగించడమే లక్ష్యంగా నిర్మించే వంతెనల్ని ఎకో వంతెనలు, వన్యప్రాణుల వంతెనలు అని పిలుస్తారు. అటవీ ప్రాంతాల్లో నిర్మించే హైవేలపై వాహనాలకు అడ్డంగా పడి జంతువులు ప్రాణాలు పోకుండా ఉండడం కోసం కూడా ఈ వంతెనల్ని నిర్మిస్తున్నారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో ఎకో వంతెనల నిర్మాణం సాగుతోంది. ఎకో వంతెనలు ఎన్ని రకాలు ? ఈ ఎకో వంతెనలు మూడు రకాలున్నాయి. చిన్న చిన్న పాలిచ్చే జంతువుల్ని కాపాడడం కోసం ఉద్దేశించిన కల్వర్టులు. వీటికే ఆంఫిబియాన్ వంతెనలని పిలుస్తారు. ఇక రెండో రకం కానోపి బ్రిడ్జెస్. కోతులు, ఉడతలు వంటి చెట్లపై నివసించే వాటిని రక్షించడానికి సులభంగా రాకపోకలు సాగించడానికి చెక్కలతో ఈ వంతెనల్ని నిర్మిస్తారు. ఇక కాంక్రీట్‌తో నిర్మించే అండర్‌పాసెస్, ఓవర్ పాస్ టన్నెల్స్. పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించడం కోసం వీటిని నిర్మిస్తారు. ఈ ఎకో వంతెనల నిర్మాణం సాగించడానికి ముందు ఆయా దేశాలకు చెందిన పర్యావరణ పరిరక్షకులు వాటిని నిర్మించే ప్రాంతం, సైజుని అధ్యయనం చేస్తారు. ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిన తర్వాతే వీటి నిర్మాణం సాగుతుంది. మొదటి వంతెన ఎక్కడ ? ఫ్రాన్స్‌లో 1950 సంవత్సరంలో ఈ ఎకో వంతెనల నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత స్కాట్‌ల్యాండ్, బ్రిటన్ వంటి దేశాలు వీటి నిర్మాణంపై మక్కువ చూపించాయి. మొత్తమ్మీద యూరప్ దేశాల్లో ఈ ఎకో బ్రిడ్జీల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ జంతువులు మరణిస్తూ ఉండడంతో మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని కలాధుంగి–నైనిటాల్ హైవే మధ్య రామ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్లో చెట్లపై తిరుగాడే జంతువుల కోసం 90 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మౌలిక సదుపాయాల లేమివల్లే కశ్మీర్లో ఉగ్రభూతం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్‌గా ప్రారంభించారు. రాజ్‌నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్‌లో 18, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు. -
Srikakulam: సిక్కోలు నగరానికి న్యూలుక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా విశిష్టతలు చిత్తరువుల రూపంలో కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి. గోడలపై గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తున్నాయి. అందమైన కుడ్య చిత్రాలు నగరానికి కొత్తశోభను తీసుకొస్తున్నాయి. పరిసరాలు అందంగా ఉంటే ఆ అనుభూతే వేరు. సిక్కోలు నగరంలో ఇప్పుడదే కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు కూడళ్లు, ఫ్లైవోవర్లు, వంతెనలు, ప్రభుత్వ ప్రాంగణాల గోడలపై రంగులతో అద్దుతున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్నాయి. నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా శ్రీకాకుళంలో కుడ్య చిత్రాలను వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా రంగులతో వేస్తున్న ఈ చిత్రాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల జోరుగా పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై వోవర్లు, వంతెనలు, సెంట్రల్ డివైడర్లు, పార్కులు, పాఠశాలు/కళాశాలల ప్రహరీలు, ప్రభుత్వభవనాల కాంపౌడ్స్కు జిల్లా, నగర చరిత్రను తెలియ జేసే కుడ్యచిత్రాలను ప్రత్యేక రంగులతో వేస్తున్నారు. నగరంలో 23 ప్రదేశాల్లో ఈ రకంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అరసవల్లి, వంశధార, నాగావళి, మన జాతీయతను తెలియజేసే పెయింటింగ్స్ వేస్తున్నారు. రూ.1.43 కోట్లతో ఈ పనుల్ని చేపడుతున్నారు. శరవేగంగా పనులు జరిగేలా కమిషనర్ ఓబులేసు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా రాజీ పడకుండా, దగ్గరుండి పెయింటింగ్స్ వేయించే పనిలో నిమగ్నమయ్యారు. (క్లిక్: డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు) -
నిర్మాణాల ఆయుష్షు పెంచుతుంది!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భవనాలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు మరింత కాలం దృఢంగా ఉండేందుకు తోడ్పడే ప్రత్యేక మెటీరియల్‌ను హైదరాబాద్ ఐఐటీ పరిశోధన విభాగం అభివృద్ధి చేసింది. పాత నిర్మాణాలను బలోపేతం చేయడం కోసం స్టీలు, కాంక్రీట్‌కు బదులుగా.. తాము రూపొందించిన ‘హైబ్రిడ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ (ఎఫ్ఆర్పీ)’ను వినియోగించవచ్చని ఐఐటీహెచ్ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ తెలిపారు. స్టీల్‌ప్లేట్లు, కాంక్రీట్ కంటే ఎఫ్ఆర్పీ దృఢత్వం, సామర్థ్యం ఎక్కువ అని ఐఐటీలోని క్యాస్ట్‌కాన్ ల్యాబ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలిందని చెప్పారు. ‘పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్న కొద్దీ దృఢత్వాన్ని కోల్పోతుంటాయి. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, పేలుళ్లు వంటివాటితో నిర్మాణాలు దెబ్బతింటాయి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రైల్వే, రోడ్డు వంతెనలు బలహీనమవుతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలంటే వ్యయప్రయాసలతో కూడిన విషయం. కానీ ఎఫ్ఆర్పీని వినియోగించి మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేయడంతో ఆ నిర్మాణాల దృఢత్వాన్ని పెంచవచ్చు. వాటి ఆయుష్షును కూడా మరో 20 ఏళ్లవరకు పొడిగించవచ్చు. ఎఫ్ఆర్పీని వినియోగించడం వల్ల ఆయా నిర్మాణాల పరిమాణంలో మార్పులు ఉండవు. బరువు కూడా తక్కువగా ఉంటుంది’’అని సూర్యప్రకాశ్ వెల్లడించారు. దేశ అభివృద్ధికి ఊతం ఎఫ్ఆర్పీని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ నేతృత్వంలోని పరిశోధన బృందాన్ని ఐఐటీ హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. ఈ పరిశోధన దేశంలో మౌలిక సదుపాయాలకు దీర్ఘాయువును ఇస్తుందన్నారు. మౌలిక సదుపాయాల పరిరక్షణ, వాటి జీవితకాలాన్ని పెంచడం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. -
ఆర్మీ స్వదేశీ వారధి
సాక్షి, హైదరాబాద్: ఆత్మనిర్భర భారత్ ప్రస్థానంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఇంకో ముందడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా పది మీటర్ల పొడవైన తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసింది. వాగులు, వంకల వంటి అడ్డంకులను వేగంగా దాటేందుకు ఆర్మీ ఈ వారధులను ఉపయోగిస్తుంది. లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన తాలేగావ్ కార్యాలయంలో సిద్ధమైన ఈ తాత్కాలిక వారధిని మంగళవారం ఆర్మీకి అందజేశారు. డీఆర్డీవో, ప్రైవేట్ కంపెనీలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఈ వారధిని త్వరగా అభివృద్ధిచేయగలిగినట్లు డీఆర్డీవో తెలిపింది. ఇన్నాళ్లూ ఇలాంటి వారధులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీ, డిజైన్లతో దీన్ని రూపొందించారు. -
ఆ వంతెనలు ఏ క్షణంలోనైనా కూలొచ్చు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రహదారులపై ఉన్న దాదాపు 100 వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అవి ఏ క్షణంలోనైనా కూలే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. గురువారం ఆయన లోక్‌సభలో ఈ విషయమై మాట్లాడారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఆడిట్లో దేశంలోని సుమారు 1.60 లక్షల బ్రిడ్జిలలో వంద వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తేలిందన్నారు. దీనికి సంబంధించి తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలోని సావిత్రి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన గత ఏడాది కొట్లుకుపోవడంతో రెండు బస్సులు, కొన్ని ప్రైవేట్ వాహనాలు గల్లంతయ్యాయని ఆయన తెలపారు. రోడ్డు ఆక్రమణలు, భూసేకరణ, పర్యావరణ అడ్డంకుల కారణంగా అనేక చోట్ల వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 3.85 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. అవరోధాలను అధిగమించి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. -
వంతెనలకు ఎంజీఆర్, జయలలిత పేర్లు
మదురైలో రెండు వంతెనలు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి కేకేనగర్ : మదురైలో కొత్తగా నిర్మించిన రెండు వంతెనలను ఎంజీఆర్, జయలలిత పేర్లతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రారంభించారు. మదురై వైగై నది మీదుగా రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం 2014లో ప్రారంభమైంది. వీటి నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత రూ.30.47కోట్లను కేటాయించారు. అరబ్ పాలయం, అరుళ్ దాస్పురం, సెల్లూర్, తిరుముల్లై రాయర్ పట్టిదురై ప్రాంతాలను కలిపే విధంగా నదిపై వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఆరబ్ పాళయం – అరుళ్దాస్ పురం వంతెనకు జయలలిత పేరు, సెల్లూర్ – తిరుమలైరాయర్ పట్టిదురై వంతెనకు ఎంజీఆర్ పేరు పెట్టారు. మదురైలో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించే దిశగా ఈ కొత్త వంతెనలను ప్రారంభిచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, మదురైలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వంతెనలను ప్రారంభించారు. అనంతరం రూ.22.25 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ సహాయకాలను అందజేసి ప్రసంగించారు. విమానం ద్వారా ఆయన శుక్రవారం మధ్యాహ్నం మదురై చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
రూ.14వేల కోట్లతో రోడ్లు, వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.14వేల కోట్లతో పెద్ద ఎత్తున రహదారులు, వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 9,900 కిలోమీటర్ల మేర రోడ్లు, 709 వంతెనలు నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ ఏడాది రూ.3,200 కోట్లతో 3,220 కి.మీ.రోడ్లు, 87 వంతెనలను పూర్తి చేశామన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలన కార్యాలయ భవనాల కోసం 913 కోట్లను కేటాయించామన్నారు రాబోయే రెండేళ్లలో అన్ని రకాల రహదారులను పూర్తి చేస్తామన్నారు. ► రెండేళ్లలో ఎల్ఈడీ లైట్లు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: మరో రెండేళ్లలో అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను అమరుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ పద్దుపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, సిద్ధిపేట జిల్లా ఇబ్రహీం పూర్, హాజీపూర్ లాంటి ఆదర్శ గ్రామాలను ప్రజలు స్వయంగా తీర్చిదిద్దుకున్న తీరును అన్ని గ్రామాలు అనుసరించాలన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్ యోజన కింద 37,311 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. 18,580 కిలోమీటర్ల మేర రూ. 4,636 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. -
తిరుపతిలో తీరనున్న రైల్వేగేట్ కష్టాలు
-
తమ్ముళ్ల స్వాహాకు ఎదురుదెబ్బ
రూ 90 కోట్ల పనుల టెండర్లు రద్దు రూ.10 కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి ‘సాక్షి’ అడ్డుకట్ట ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన రీ టెండర్‌కు కమిటీ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వంలో అన్న కీలక నేత ... తమ్ముడు ఓడిపోయిన ఓ నేత...అయినా తుని నియోజకవర్గంలో పెత్తనం వారిదే. ఆ ప్రాంతంలో ఏది నెలకొల్పాలన్నా ... ఏ పనులు చేయాలన్నా భారీ ఎత్తున ముడుపులు చెల్లించాల్సిందే. ఇందులో భాగంగా మంజూరైన రోడ్లకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైతే రూ.9 కోట్ల కమీషన్ల కోసం నానా గందరగోళం సృష్టించారు. లోగుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో బయటపెట్టడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఏకంగా టెండర్ ప్రక్రియనే రద్దు చేశారు. సాక్షి ప్రతినిధి కాకినాడ : తెలుగు తమ్ముళ్ల పాచిక పారలేదు సరికదా వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులతో జేబులు నింపుకుందామనుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టింది. జిల్లాలో తుని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో సుమారు రూ.90 కోట్ల పనులకు టెండరింగ్ కోసం అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. తుని–కేఈ చిన్నయ్యపాలెం 24 కిలోమీటర్లు రూ.32 కోట్లు, తుని– కోటనందూరు 18 కిలోమీటర్లు రూ.18 కోట్లు, ఎ.కొత్తపల్లి–కోదాడ ఆరు కిలోమీటర్లు రూ.8 కోట్లు, సర్పవరం–ఎఫ్.కె.పాలెం, ఎఫ్.కె. పాలెం– దివిలి రోడ్లు, వంతెనల ఆధునికీకరణ పనులు ఇందులో ఉన్నాయి. ఈ పను ల్లో రాష్ట్ర అర్థిక మంత్రి యనమల రా మకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో అత్యధికంగా రూ.60 కోట్ల విలువైన పనులున్నాయి. రెండు నెలల కిందటే టెండర్లకు పిలుపు... ఈ పనులకు సంబంధించి గత నవం బర్ నెలలో తొలుత ఆఫ్‌లైన్‌లో అనం తరం ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. ఆన్లైన్ టెండర్ల పక్రియ మొదలైన సందర్భంలో తుని నియోజకవర్గానికి సంబంధించిన మూడు ప్యాకేజీలను రాజమండ్రిలో కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేసి జిల్లాకు చెందిన ఒక మంత్రి సోదరుడు రూ.9 కోట్లు ఇచ్చిన వారికే పనులు కట్టబెడతామని అదిరించి, బెదింరించి దారిలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతా ఓకే అనుకున్న సమయంలో ఆన్లైన్ టెండర్లు మరోసారి పిలవటంతో వీరి వ్యూహం బెడిసికొట్టింది. అప్పుడు ఉన్నత స్థాయిలో మంత్రి, పై స్థాయి అధికారులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ప్రస్తుతం పనులు మొదలెట్టే సమయానికి తమ్ముళ్లతో కుమ్మక్కైన ఒక ఉన్నతాధికారి పోస్టులో లేకపోవటంతో కథ మొదటికి వచ్చింది. ‘సాక్షి’ కథనాలతో కదలిక... వారి వ్యూహం ప్రకారం రూ.90 కోట్ల పనులకు 15 శాతం అదనంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమై ఉండేది. ఈ పనుల్లో జరుగుతున్న తెలుగు తమ్ముళ్ల భాగోతాన్ని ‘మంత్రుల ఇలాకాలో టెండరింగ్’’, రూ.9 కోట్లు ఇస్తేనే’’ అనే శీర్షికలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఉన్నతాధికారులు తెలుగు తమ్ముళ్లకు కొమ్ముకాయగా కొత్తగా వచ్చిన రవాణా, రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా ‘సాక్షి’ కథనాలపై స్పందించి టెండర్లను రద్దు చేశారు. దీంతో రూ.10 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ‘సాక్షి’ పత్రిక కట్టడి చేయగలిగింది. తీవ్రంగా పరిగణించిన టెండర్ కమిటీ... ఈ పనులకు 15 శాతం అదనంగా కోట్ చేయటాన్ని తీవ్రంగా పరిణించిన రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ వీటిని రద్దు చేసి రీ టెండర్లు పిలిచేందుకు నిర్ణయించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, విపత్తు నివారణా కమిషనర్ శేషగిరిబాబు, ఆర్‌ఆండ్‌బీ. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి సమావేశమై అదనంగా 15 శాతం కోట్ చేసిన అయిదు ప్యాకేజీ పనులను రద్దు చేశారు. ఊహించని ఈ పరిణామంతో తెలుగు తమ్ముళ్లు ఖంగుతిన్నారు. అదనంగా ఐదు శాతానికి మించి అనుమతించరాదని, సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు రీటెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. ఈ పనుల ద్వారా అడ్డంగా రూ.9 కోట్లు దోచేద్దామనుకున్న తెలుగు తమ్ముళ్లు అధికారుల నిర్ణయంతో బొక్కబోర్లా పడ్డారు. -
వంతెనలు లేక అవస్థలు
కొత్తగూడ : వర్షాలు కురిసిన సమయంలో మండలంలోని రౌతుగూడెం, చింతగట్టు తండా, వేపచెట్టు తండాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని వేలుబెల్లి, బూర్కపల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలుబెల్లి, బూర్కపల్లి వాగులపై వంతెనలు నిర్మించి తమ కష్టాలను తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు అం దజేసినా పట్టించుకోవడంలేదదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వాగులు పొంగుతుండడంతో రౌతు గూడెం, చింతగట్టుతండా, వేపచెట్టుతండాలకు ఎలాంటి వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో ఇక్కడి ప్రజలు మండల కేంద్రానికి నడిచి వచ్చి అక్కడి నుంచి వాహనాల్లో తమ ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. వర్షాకాలంలో కొందరు వాగుదాటి వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ప్రత్యేక చొరవ చూపి బూర్కపల్లి వాగుపై లోలెవల్ కాజ్వే, వేలుబెల్లి వాగుపై ఒక వైపు చెక్‌డ్యాం.. మరో వైపు లోలెవల్ కాజ్వే నిర్మిస్తే ఆయా తండాలకు చెందిన ప్రజల కష్టాలు తీరుతాయి. చెక్‌డ్యాం నిర్మించడంతో ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌కు నీరందడంతో పాటు బ్రిడ్జి వద్ద వరద ఉధృతి తగ్గి రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. తండాలను పట్టించుకోవడం లేదు – అంగోతు శంకర్, రౌతుగూడెం రౌతుగూడెం, చింతగట్టు, వేపచెట్టు తండాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మా తండాలో కనీస సౌకర్యాలు లే కపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా కొత్తగూడకు వెళ్లాలి. మా తండాకు రోడ్డు సరిగా లేకపోవడంతో 108 వాహనం కూడా రావడం రాదు. వర్షం పడితే నరకమే – గుగులోతు భద్రు, చింతగట్టుతండా నేను రోజు కొత్తగూడకు హమాలీ పనిచేసేందుకు వెళ్తాను. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడకు సైకిల్‌పైనే వస్తాను. వర్షాకాలం వచ్చిందంటే వేలుబెల్లి, బూర్కవాగులు పొంగుతాయి. ఆ సమయంలో మాకు నరకమే. వాగులపై బ్రిడ్జిలు నిర్మిస్తే బాగుంటుంది. -
జలరవాణా కోసం వంతెనలు
♦ రెండు పడవలు వెళ్లేలా మార్గం ♦ ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి తుమ్మల చర్చ సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణానదుల్లో జలరవాణాకు అనువుగా కొత్త వంతెనల నిర్మాణాలకుగాను డిజైన్లు సిద్ధమయ్యాయి. రెండు పడవలు వెళ్లగలిగేలా మార్గాన్ని వదలిపెట్టి కొత్త వంతెనలను నిర్మించేలా నమూనాలను అధికారులు సిద్ధం చేశారు. రెండువైపులా ఒకేసారి రెండు పడవలు వెళ్లేందుకు వీలుగా 70-80 మీటర్ల వెడల్పు, 40-50 మీటర్ల ఎత్తుతో ఈ మార్గం ఉంటుంది. భవిష్యత్తులో రెండు నదులపై నిర్మించే అన్ని వంతెనలకు ఇదే నమూనా సిద్ధం చేయాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయ న సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీ-ప్లస్ వన్ పద్ధతిలో వాటి నమూనాను అధికారులు రూపొందించారు. ఒక్కో ఇంటికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాల్సి ఉన్నం దున స్థలసేకరణ, ఇతరత్రా అనుమతులకు కసరత్తు ప్రారంభించాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మను మంత్రి ఆదేశించారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 1400 కి.మీ. జాతీయ రహదారులకు సంబంధించి వెంటనే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలన్నారు. జిల్లా కేంద్రాలు-మండల కేం ద్రాల అనుసంధాన రహదారుల నిర్మాణ పనులన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. రోడ్లు, భవనాల శాఖలోని అన్ని ఖాళీలు, పదోన్నతుల భర్తీపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రోడ్ల విభాగం ఈఎన్సీ రవీందర్రావు, జాతీయ రహదారులు, భవనాల ఈఎన్సీ గణపతి రెడ్డి పాల్గొన్నారు. -
మానవ రహిత విమానాలతో వంతెనల తనిఖీ..!
♦ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్న వేల్ టెక్ ♦ పరిశోధనకు ఏటా రూ.30 కోట్లు ♦ వేల్ టెక్ యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంతెనలు, చారిత్రక కట్టడాల నాణ్యతను పరీక్షించేందుకు కొద్ది రోజుల్లో భారత్‌లో మానవ రహిత విమానాలు (యూఏవీ), డ్రోన్లు రంగంలోకి దిగనున్నాయి. ఇండియా-కెనడా ఇంపాక్ట్స్ కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన వేల్ టెక్ యూనివర్సిటీ, కెనడాలోని విక్టోరియా వర్సిటీలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. యూఏవీ, డ్రోన్ల సాయంతో వంతెనలకు పగుళ్లుంటే గుర్తిస్తారు. తరచూ పరీక్షలు జరపడం ద్వారా వంతెన గట్టిదనం, జీవిత కాలం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. తొలి పైలట్ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న వంతెన వేదిక కానుందని వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బీల సత్యనారాయణ గురువారమిక్కడ చెప్పారు. అరుదైన కట్టడాల నాణ్యతను తెలుసుకునేందుకూ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తామని మీడియాతో చెప్పారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్ట్... ప్రాజెక్టుకు అవసరమైన యూఏవీ, డ్రోన్లను వేల్ టెక్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. సెన్సర్లను విక్టోరియా వర్సిటీ రూపొందించింది. సెన్సర్లను యూఏవీ, డ్రోన్లతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు వేల్ టెక్ ప్రో-వీసీ యు.చంద్రశేఖర్ తెలిపారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని విక్టోరియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రిషి గుప్త ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ‘ఈ టెక్నాలజీతో ఫలితాల్లో కచ్చితత్వం ఉంటుంది. ఖర్చు తక్కువ. సమయమూ ఆదా అవుతుంది. వంతెనల కింది భాగంలోకి డ్రోన్లు సులువుగా వెళ్లి తనిఖీ చేస్తాయి. భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో 50,000కు పైగా పెద్ద వంతెనలున్నాయి. వీటిలో 100 ఏళ్లకు పైబడ్డవి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు. టెక్నాలజీని కెనడాలోనూ వినియోగిస్తామన్నారు. కాగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఏటా రూ.30 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కె.వి.డి.కిషోర్ కుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, అనుబంధ పరిశ్రమల కోసం రూ.8 కోట్లతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను నెలకొల్పామని, ఇప్పటికే ఇందులో 20 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. -
నగరాలను అభివృద్ధి చేద్దాం రండి
చైనా ఇన్ఫ్రా కంపెనీలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి * ముఖ్యమంత్రితో సమావేశమైన చైనా కంపెనీల బృందం * రోడ్లు, బ్రిడ్జీలు, సస్పెన్షన్ బ్రిడ్జీల నిర్మాణానికి సంసిద్ధత సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని 68 నగరాలు, పట్టణాల్లో ఫ్లై ఓవర్లు, రహదారులు, స్కైవేలు, మురుగు ప్రవాహ వ్యవస్థలు, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం తదితర అంశాల్లో శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే బృహత్తర కార్యంలో భాగస్వామ్యం కావాలని చైనా కంపెనీలను కోరారు. చైనాలోని బీజింగ్, షాంఘై, దాలియన్, సుజో, గాజో తదితర నగరాల ప్లాన్లను రూపొందించిన కన్సల్టెన్సీల సహకారంతో రాష్ట్రంలోని నగరాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. చైనాకు చెందిన అంజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెరైక్టర్లు యోగేష్ వా, మనోజ్ గాంధీ, రాడిక్ కన్సల్టెంట్స్ చైర్మన్ రాజ్‌కుమార్, బ్రిడ్జీ డిజైనింగ్ విభాగాధిపతి బీపీ సింగ్ తదితరులు బుధవారం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. నగరాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, బ్రిడ్జీలు, సస్పెన్షన్ బ్రిడ్జీల నిర్మాణంపై సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇవీ అభివృద్ధి ప్రణాళికలు.. హైదరాబాద్‌లో చేపట్టిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రణాళికలను సీఎం.. చైనా ప్రతిని ధులకు వివరించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం-మంచిర్యాల కార్పొరేషన్లలో కూడా అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌లోని రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు శరవేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు తగ్గట్లు ప్రణాళిక సిద్ధం చేసి రహదారులు, వంతెనలు నిర్మించాల్సి ఉందన్నారు. ఇప్పటికే స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమంతో పాటు, మూసీ నదిపై తూర్పు నుంచి పడమరకు 42 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రహదారిని నిర్మించే ప్రణాళికను వివరించారు. వరంగల్, నల్లగొండ, కరీంనగర్ తదితర హైవేలకు అనుబంధంగా ఎక్స్‌ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని కార్పొరేషన్ల పరిధిలో రింగ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, వంతెనలు నిర్మిస్తామన్నారు. గోదావరి నదిపై మూడు చోట్ల పెద్ద వంతెనలు నిర్మిస్తామన్నారు. 50 కి.మీ. దూరంలో ఉన్న తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, షాద్‌నగర్, వికారాబాద్, నర్సాపూర్ పట్టణాల వరకు హైదరాబాద్ నగరం విస్తరిస్తోందన్నారు. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని సీఎం వివరించారు. ఇటీవలి చైనా పర్యటనలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌తో పాటు అనేక మంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని చెప్పారు. త్వరలో చైనా కంపెనీలతో మరోసారి సమావేశమై ఏయే పనుల్లో ఎలా భాగస్వాములు కావాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంత కుమారి పాల్గొన్నారు.