ఆ వంతెనలు ఏ క్షణంలోనైనా కూలొచ్చు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రహదారులపై ఉన్న దాదాపు 100 వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అవి ఏ క్షణంలోనైనా కూలే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. గురువారం ఆయన లోక్సభలో ఈ విషయమై మాట్లాడారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఆడిట్లో దేశంలోని సుమారు 1.60 లక్షల బ్రిడ్జిలలో వంద వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తేలిందన్నారు. దీనికి సంబంధించి తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలోని సావిత్రి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన గత ఏడాది కొట్లుకుపోవడంతో రెండు బస్సులు, కొన్ని ప్రైవేట్ వాహనాలు గల్లంతయ్యాయని ఆయన తెలపారు. రోడ్డు ఆక్రమణలు, భూసేకరణ, పర్యావరణ అడ్డంకుల కారణంగా అనేక చోట్ల వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 3.85 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. అవరోధాలను అధిగమించి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.