
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్(New Delhi Railway Station)లో మరోసారి భారీ రద్దీ ఏర్పడింది. దీంతో తొక్కిసలాట జరిగిందనే వదంతులు వ్యాపించాయి. స్టేషన్‌లోని 12,13 ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల కోసం వేచివుండగా, తొక్కిసలాటను తలపించే పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
శివగంగా ఎక్స్‌ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్(Swatantra Senani Express), జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, మగధ్ ఎక్స్‌ప్రెస్‌లు బయలుదేరడంలో ఆలస్యం కావడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల రద్దీని గమనించిన ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమై, తమ బృందాలను మోహరించారు. ప్టేషన్‌లో ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు వార్తలు లేవు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్‌లోని రెండు ప్లాట్‌ఫారాలపై ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
గతంలో మహా కుంభమేళా సమయంలో కనిపించిన రద్దీ మరోమారు ఎదురయ్యింది. ఈ నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో అధిక రద్దీ ఏర్పడిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఈ రద్దీపై రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. అయితే తొక్కిసలాట లాంటి పరిస్థితి ఎదురుకాలేదు’ అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఉదంతంలో రైల్వేశాఖ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. తొక్కిసలాట కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది.
ఇది కూడా చదవండి: ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్.. అంతటా అంథకారం.. కారణమిదే..
Comments
Please login to add a commentAdd a comment