
ముంబై: మహారాష్ట్రలో థాక్రే కుటుంబానికి, బీజేపీకి మధ్య గల సంబంధంపై తరచూ ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి. ఈ రెండు పార్టీల మధ్య బాల్ థాక్రే కాలంలో మొదలైన స్నేహం ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray) రాకతో ముగిసింది. బీజేపీ తమను పట్టించుకోవడంలేదని ఉద్ధవ్ థాక్రే ఆరోపిస్తుండగా, దీనిపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా మహారాష్ట్ర బీజేపీ రథసారథి దేవేంద్ర ఫడ్నవీస్.. 2014లో శివసేన- బీజేపీల మధ్య ఏం జరిగిందో, ఆ రెండు పార్టీలకు ఎందుకు చెడిందో వెల్లడించారు.
ముంబైలో జరిగిన సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రహస్యాన్ని వెల్లడించారు. ఎన్‌డీటీవీ తన కథనంలో తెలిపిన వివరాల ప్రకారం.. 2014 నాడు జరిగిన ఉదంతాన్ని వివరిస్తూ ఫడ్నవీస్ ఇలా అన్నారు ‘ఆ సమయంలో తాము శివసేనకు 147 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి ముఖ్యమంత్రి, మాకు ఉప ముఖ్యమంత్రి ఉంటారని కూడా నిర్ణయించాం. అయితే ఉద్ధవ్ థాక్రే 151 సీట్లు ఇవ్వాలని మొండికేయడంతో శివసేన, బీజేపీ మధ్య పొత్తు తెగిపోయింది’ అని అన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపిన వివరాల ప్రకారం ఉద్ధవ్ థాక్రే 151 సీట్లు కోరిన నేపధ్యంలో బీజేపీ నేతలు ఓం ప్రకాష్ మాథుర్, అమిత్ షా తదితరులు ప్రధాని మోదీ(Prime Minister Modi) నాయకత్వంలో ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఆ తరువాత 2014 నుండి 2024 వరకు మహారాష్ట్రలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వందకుపైగా సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానంపై ఉద్ధవ్ థాక్రే పార్టీ నుండి ఇంకా ఎటువంటి స్పందన వెలువడలేదు. ఒకప్పుడు ముంబైని ఏలిన థాక్రే కుటుంబం ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనే మాట వినిపిస్తోంది. పార్టీ కార్యకర్తలలో కూడా పార్టీ భావజాలం విషయంలో గందరగోళం నెలకొందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులపై నిరంతర నిఘా