
ముంబై: తనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) తో ఎటువంటి విభేదాలు లేవని గతవారం వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాత్ షిండే(Eknath Shinde). తాజాగా తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక నేరుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కాకపోయినా, షిండే ఇలా వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటో అనేది రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
ఈరోజు(శుక్రవారం) ఏక్ నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా గురించి తెలుసు. నేను పార్టీలో సామాన్య కార్తకర్తని. నేను అలాగే భావిస్తాను. అదే సమయంలో బాలా సాహెబ్ కు కూడా కార్యకర్తనే. నన్ను గతంలో తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ఏమైందో మీకు తెలుసు.’ అంలూ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే నేతృత్వంలోని శివసేనకు 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ ప్రభుత్వానికి సూచాయాగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూనే గత ప్రభుత్వాన్ని కూల్చిన సందర్భాన్ని షిండే తాజాగా గుర్తు చేసుకోవడమే రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇది ఫడ్నవీస్ ను పరోక్షంగా హెచ్చరించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేకపోలేదనే సంకేతాలు పంపినట్లు అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫడ్నవీస్ సమావేశాలకు షిండే డుమ్మా..
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగే పలు సమావేశాలకు షిండే తరుచు గైర్హాజరు కావడంతో వారి మధ్య విభేదాలున్నాయనే దానికి అద్దం పడుతోంది. షిండే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ. 900 కోట్ల ప్రాజెక్టును ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ నిలిపివేయడంతో వీరి మధ్య అగ్నికి ఆజ్యం పోసిందనే వాదన తెరపైకి వచ్చింది. జల్నాలో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆమోదించిన ప్రాజెక్టును సీఎం హోదాలో ఉన్న ఫడ్నవీస్ ఆపడమే షిండేకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఫడ్నవీస్ క్యాబినెట్ సమావేశాలకు షిండే దూరంగా ఉన్నట్లు సమాచారం.
2022లో ఇలా..
మూడేళ్ల క్రితం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు షిండే. 40 మంది ఎమ్మెల్యేలతో బయటకొచ్చేశారు. ఫలితంగా మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరుణంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు షిండే.
ఇక 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నేతృత్వంలోని మహాయుతి 232 మంది ఎమ్మెల్యేలను సొంతం చేసుకుంది. బీజేపీ(BJP) 132 సీట్లు గెలవగా, శివసేన 57 మంంది ఎమ్మెల్యేలను, ఎన్సీపీ 41 మంది శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో సీఎం పదవి అనేది ఫడ్నవీస్ ను వరించింది. ఆ సమయంలో తనుకు ఇవ్వబోయే డిప్యూటీ సీఎం పదవిని షిండే తిరస్కరించారు. కొన్ని బుజ్జగింపుల తర్వాత దానికి కట్టుబడ్డారు షిండే.
గతవారం అలా.. ఇప్పుడు ఇలా
తనకు ఫడ్నవీస్ తో ఎటువంటి విభేదాలు లేవని షిండే గతవారం వ్యాఖ్యానించారు. మా మధ్య ఎటువంటి కోల్డ్ వార్ నడవడం లేదన్నారు షిండే. తాము కలిసి కట్టుగానే అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై యుద్ధం చేస్తామన్నారు.
అయితే తాజాగా షిండే స్వరంలో కాస్త మార్పు కనిపించింది. ‘నేను విధాన సభలో తొలి ప్రసంగం ఇచ్చినప్పుడు రెండొందలపైగా సీట్లు వస్తాయని ఫడ్నవీస్ అన్నాను. మాకు 232 సీట్లు వచ్చాయి. నన్ను తేలిగ్గా తీసుకోవద్దనే విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పానో వారికి అర్ధమైతే చాలు’ అంటూ ముక్తాయించారు ఏక్‌నాత్ షిండే
Comments
Please login to add a commentAdd a comment