ఫడ్నవీస్‌పై బీజేపీ, షిండేపై సేన పట్టు
హస్తినలో మహాయుతి నేతల మల్లగుల్లాలు
ఫడ్నవీసే సీఎం; డిప్యూటీలుగా షిండే, అజిత్!
ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న దానిపై నరాలు తెగే సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయంతో అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి సీఎం అవడం లాంఛనమేనని, సోమవారం నూతన సర్కారు కొలువుదీరుతుందనివార్తలొచ్చాయి.
కానీ ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండేనే కొనసాగించాలని కూటమి భాగస్వామి శివసేన (షిండే) పట్టుబడుతోంది. బిహార్ మోడల్‌ను మహారాష్ట్రలో కూడా బీజేపీ అమలు చేయాలని శివసేన (షిండే) అధికార ప్రతినిధి నరేశ్ మస్కే సోమవారం డిమాండ్ చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లున్నా సంకీర్ణంలోని మైనారిటీ భాగస్వామి జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్‌ను సీఎం చేశారని గుర్తు చేశారు.
‘‘సీఎంగా మహాయుతి కూటమిని షిండే ముందుండి నడిపి ఘనవిజయంలో కీలక పాత్ర పోషించారు. కనుక ఆయన్నే కొనసాగించడం సబబు’’ అన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఈసారి ఫడ్నవీస్‌ను సీఎం చేయాల్సిందేనంటున్నారు. కూటమిలోని మూడో పార్టీ ఎన్సీపీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా అందుకు మద్దతిస్తున్నట్టు సమాచారం. దాంతో సీఎంపై పీటముడి వీడక కొత్త ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు కొలిక్కి రావడం లేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సోమవారం ఢిల్లీ వెళ్లారు.
సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు వారితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్ర నేత అమిత్ షా సమావేశమవుతారంటూ తొలుత వార్తలొచ్చాయి. దాంతో రాత్రికల్లా సస్పెన్స్ వీడుతుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. దాంతోప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫడ్నవీసే సీఎం అవడం ఖాయమని, అజిత్‌తో పాటు షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. షిండే సేనకు 12, పవార్ ఎన్సీపీకి 10 మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. ఫడ్నవీస్ తొలిసారి 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లపాటు సీఎంగా ఉన్నారు. 2019లో మళ్లీ సీఎం అయినా అజిత్ పవార్ మద్దతు ఉపసంహరణతో ఆయన ప్రభుత్వం 80 గంటల్లోనే పడిపోయింది.
‘మంగళవారం డెడ్‌లైన్’ అవాస్తవం
మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో ముగుస్తున్నందున ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనను అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘మంగళవారం డెడ్‌లైన్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొత్త ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను నోటిఫై చేస్తూ ఎన్నికల సంఘం శనివారమే గవర్నర్‌కు గెజిట్ కాపీ సమరి్పంచింది. కనుక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 73వ సెక్షన్ ప్రకారం కొత్త అసెంబ్లీ ఇప్పటికే పూర్తిస్థాయిలో కొలువుదీరినట్టే లెక్క. రాష్ట్రపతి పాలన వచ్చేందుకు అవకాశమే లేదు’’ అని అసెంబ్లీ అధికారి ఒకరు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment