ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. తదుపరి మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. షిండే రాజీనామా కీలకంగా మారింది. మరోవైపు నేటితో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి.
శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్‌పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)ల ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ లభించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
ఇదిలా ఉండగా మరోవైపు శాసన సభ ప్రాంగణంలో ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన 10 మంది, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)కి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ కొలువుదీరనుందనే అంశాలపై నేడు స్పష్టత లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశం..
బుధవారం కొలువుదీరనున్న మహాయుతి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై పలు రకాల ఊహగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ, మహాయుతి కూటమి అత్య«ధిక స్థానాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన, ముఖ్యమంత్రిగా అయిదేళ్ల అనుభవమున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం పదవినివ్వాలని బీజేపీ నేతలు కోరుతుండగా మరోవైపు శివసేన (షిండే) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేనే మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో మహాయుతి కూటమి ఎన్నికల బరిలో దిగింది. సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి, చూపిన ప్రభావం వల్లే ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మహాయుతి కూటమి రికార్డు స్థాయి స్థానాలను కైవసం చేసుకుందని శివసేన నేతలు చెబుతున్నారు. కాగా సీఎం పదవిరేసుకు ఏక్‌నాథ్ షిండే పేరును పరిశీలించే పక్షంలో అజిత్ పవార్ పేరును కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ అధిష్ఠానంతో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు చర్చల అనంతరం స్పష్టం కానుందని చెప్పవచ్చు. కాగా ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్టయితే దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment