షిండే సేన, ఎన్సీపీలకు డిప్యూటీలు
ఎన్సీపీ అధినేత అజిత్ స్పష్టికరణ
వీడుతున్న ‘మహా’ పీటముడి
ఫడ్నవీస్ హ్యాట్రిక్‌కు లైన్ క్లియర్!
5న ప్రమాణస్వీకారం: బావంకులే
ముంబై/పుణే: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో సీఎం పదవిపై పడ్డ పీటముడి క్రమంగా వీడుతోంది. వారం రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలని పట్టుబడుతూ వచ్చిన శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఎట్టకేలకు అలకపాన్పు వీడి డిప్యూటీ సీఎం పదవికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
సీఎం పదవి బీజేపీదేనని ఆయన శనివారం తేల్చేశారు. శివసేన, ఎన్సీపీ నుంచి చెరో ఉప ముఖ్యమంత్రి ఉంటారన్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధిష్టానం సమక్షంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులన్నది త్వరలో తేలుతుందన్నారు. డిసెంబర్ 5న కొత్త సర్కారు కొలువుదీరే అవకాశముందని ఆయన వివరించారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందన్న విపక్షాల విమర్శలను అజిత్ కొట్టిపారేశారు. ‘‘మహారాష్ట్రలో ఇలా జరగడం కొత్త కాదు, అనూహ్యమూ కాదు. 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకంగా నెల రోజులు పట్టింది’’ అని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార తేదీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా ధ్రువీకరించారు.
5న సాయంత్రం ఐదింటికి సౌత్ ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కార్యక్రమం జరుగుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దిగ్గజం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో రెండుసార్లు సీఎంగా చేయడం తెలిసిందే. మహాయుతి సర్కారులో ఫడ్నవీస్, అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే.
నవంబర్ 23న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడం తెలిసిందే. 288 స్థానాలకు గాను మహాయుతికి ఏకంగా 233 వచ్చాయి. బీజేపీ 132. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు నెగ్గాయి. అయితే సీఎం ఎవరు కావాలన్న దానిపై అప్పటినుంచీ ప్రతిష్టంభన నెలకొంది. సీఎం అభ్యరి్థ, ప్రభుత్వ కూర్పు తదితరాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఫడ్నవీస్, షిండే, పవార్ చర్చలు జరిపారు. అంతకుముందు షిండే మీడియాతో మాట్లాడుతూ సీఎంగా ఎవరుండాలన్న దానిపై నిర్ణయాధికారాన్ని బీజేపీకే వదిలేసినట్టు చెప్పడం తెలిసిందే.
కానీ ఢిల్లీ భేటీ అనంతరం ముంబై రావాల్సిన ఆయన నేరుగా సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడం, శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి భేటీ రద్దవడం అనుమానాలకు తావిచ్చింది. షిండే అలకపాన్పు ఎక్కినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం తదితరాలపై అ టు అజిత్, ఇటు బావంకులే నుంచి తాజాగా స్పష్ట త రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అ యినట్టేనని భావిస్తున్నారు. మహాయుతి భేటీ ఆదివారం జరుగుతుందని తాజా సమాచారం.
సేనలో అసంతృప్తి!
తాజా పరిణామాలపై శివసేన నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రెండేళ్లకు పైగా సీ ఎంగా చేసిన షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వ డమంటే స్థాయిని తగ్గించడమేనని వారంటున్నా రు. షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత సంజయ్ సిర్సత్ ఆరోపించారు. తమకు హోం శాఖ ఇచ్చి తీరాలని శనివారం పీటీఐతో మాట్లాడుతూ ఆయనన్నారు. షిండే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి.
మహాయుతి కూటమి సాధించిన అనూ హ్య, అసహజ విజయమే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి దారి తీస్తోందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కూటమిలో కీచులాటలతో విసిగే షిండే సొంతూరి బాట పట్టారని ఎద్దే వా చేశారు. ‘‘2019లో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయకుండా అడ్డుకునేందుకు మోదీ రాష్ట్రపతి పాలన విధించారు. ఈసారి ఫలితాలు వెల్లడైన వారం దాటినా ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. అయినా రాష్ట్రపతి పాలన ఊసే లేదు’’ అంటూ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment