CM Post Race
-
Maharashtra: సీఎం పదవి బీజేపీకే
ముంబై/పుణే: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో సీఎం పదవిపై పడ్డ పీటముడి క్రమంగా వీడుతోంది. వారం రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలని పట్టుబడుతూ వచ్చిన శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఎట్టకేలకు అలకపాన్పు వీడి డిప్యూటీ సీఎం పదవికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. సీఎం పదవి బీజేపీదేనని ఆయన శనివారం తేల్చేశారు. శివసేన, ఎన్సీపీ నుంచి చెరో ఉప ముఖ్యమంత్రి ఉంటారన్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధిష్టానం సమక్షంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులన్నది త్వరలో తేలుతుందన్నారు. డిసెంబర్ 5న కొత్త సర్కారు కొలువుదీరే అవకాశముందని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందన్న విపక్షాల విమర్శలను అజిత్ కొట్టిపారేశారు. ‘‘మహారాష్ట్రలో ఇలా జరగడం కొత్త కాదు, అనూహ్యమూ కాదు. 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకంగా నెల రోజులు పట్టింది’’ అని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార తేదీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా ధ్రువీకరించారు. 5న సాయంత్రం ఐదింటికి సౌత్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కార్యక్రమం జరుగుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దిగ్గజం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో రెండుసార్లు సీఎంగా చేయడం తెలిసిందే. మహాయుతి సర్కారులో ఫడ్నవీస్, అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే. నవంబర్ 23న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడం తెలిసిందే. 288 స్థానాలకు గాను మహాయుతికి ఏకంగా 233 వచ్చాయి. బీజేపీ 132. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు నెగ్గాయి. అయితే సీఎం ఎవరు కావాలన్న దానిపై అప్పటినుంచీ ప్రతిష్టంభన నెలకొంది. సీఎం అభ్యరి్థ, ప్రభుత్వ కూర్పు తదితరాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఫడ్నవీస్, షిండే, పవార్ చర్చలు జరిపారు. అంతకుముందు షిండే మీడియాతో మాట్లాడుతూ సీఎంగా ఎవరుండాలన్న దానిపై నిర్ణయాధికారాన్ని బీజేపీకే వదిలేసినట్టు చెప్పడం తెలిసిందే. కానీ ఢిల్లీ భేటీ అనంతరం ముంబై రావాల్సిన ఆయన నేరుగా సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడం, శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి భేటీ రద్దవడం అనుమానాలకు తావిచ్చింది. షిండే అలకపాన్పు ఎక్కినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం తదితరాలపై అ టు అజిత్, ఇటు బావంకులే నుంచి తాజాగా స్పష్ట త రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అ యినట్టేనని భావిస్తున్నారు. మహాయుతి భేటీ ఆదివారం జరుగుతుందని తాజా సమాచారం.సేనలో అసంతృప్తి! తాజా పరిణామాలపై శివసేన నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రెండేళ్లకు పైగా సీ ఎంగా చేసిన షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వ డమంటే స్థాయిని తగ్గించడమేనని వారంటున్నా రు. షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత సంజయ్ సిర్సత్ ఆరోపించారు. తమకు హోం శాఖ ఇచ్చి తీరాలని శనివారం పీటీఐతో మాట్లాడుతూ ఆయనన్నారు. షిండే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి. మహాయుతి కూటమి సాధించిన అనూ హ్య, అసహజ విజయమే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి దారి తీస్తోందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కూటమిలో కీచులాటలతో విసిగే షిండే సొంతూరి బాట పట్టారని ఎద్దే వా చేశారు. ‘‘2019లో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయకుండా అడ్డుకునేందుకు మోదీ రాష్ట్రపతి పాలన విధించారు. ఈసారి ఫలితాలు వెల్లడైన వారం దాటినా ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. అయినా రాష్ట్రపతి పాలన ఊసే లేదు’’ అంటూ దుయ్యబట్టారు. -
కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది?
ఎస్.రాజమహేంద్రారెడ్డి సచిన్ పైలట్‌కు హఠాత్తుగా కోపం వచ్చింది. నాలుగున్నరేళ్లుగా లోలోపల రగిలిపోతున్న అసంతృప్తిని ఒకే ఒక్క చర్యతో బలంగా బహిర్గతం చేశారు. ఎంత బలంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం కంగుతినేంతగా! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఉక్కిరిబిక్కిరయ్యేంతగా! మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె అవినీతిపై విచారణకు ఆదేశించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ గహ్లోత్ తీరును బాహాటంగానే దుయ్యబట్టిన పైలట్ ఈ నెల 11న ఏకంగా ఒక రోజు నిరసన దీక్షకు కూడా కూర్చున్నారు! అధిష్టానం హెచ్చరించినా, బుజ్జగించినా ఆయన ససేమిరా అన్నారు. దీన్ని ఏమీ పట్టించుకోనట్టుగా గహ్లోత్ పైకి గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. స్వపక్షీయుడే అయిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన పైలట్ ప్రతిపక్షంలా తనపైనే దాడికి దిగడం గహ్లోత్‌కు అసలు మింగుడు పడలేదు. ఎవరేమనుకున్నా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యాన్ని పైలట్ కాస్త గట్టిగానే వినిపించారు. ఒకవిధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారన్నమాట! సీఎం పదవిపై ఉన్న కాంక్షను వెలిబుచ్చడం ఒకటైతే, ప్రస్తుత ముఖ్యమంత్రి గహ్లోత్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని వేలెత్తిచూపడంరెండోది. అంతా బాగుందనుకున్న రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఇది సరికొత్త ముసలం...! ► గహ్లోత్–పైలట్ తలనొప్పిని ఎలా పరిష్కరించాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకు కూర్చుంది. ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో ఆరితేరిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఎవరినీ ఏమీ అనలేక, మధ్యేమార్గంగా ‘మేజర్ సర్జరీ’తో వివాదం సద్దుమణిగేలా చేస్తామన్నారు. అయితే ఆ శస్త్రచికిత్స ఎప్పుడు, ఎలా అన్నది మాత్రం దాటవేశారు. బహుశా సోనియా, రాహుల్‌గాంధీల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పైలట్‌లో ఈ రీతిన అసంతృప్తి పేరుకుపోవడానికి అధిష్టానం వైఖరే కారణం. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 2018లో పార్టీని విజయపథాన నడిపించిన పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్టే పెట్టి, గహ్లోత్ చాణక్యానికి తలవంచడం అసంతృప్తిని రాజేసింది. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆనందం ఆవిరవకుండా పైలట్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారు. సందర్భాన్ని బట్టి అప్పట్లో ఆ పదవితో పైలట్ సంతృప్తి పడినట్టు కనిపించినా రెండేళ్లు తిరిగేసరికి తనను తాను సర్దిబుచ్చుకోలేక రాజీనామా చేసి అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా దీక్షకు దిగి గహ్లోత్తోనూ, అధిష్టానంతోనూ అమీతుమీకే సిద్ధమయ్యానన్న సంకేతాలను పంపగలిగారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఎస్.ఎస్.రణ్‌ధవా నేరుగానే హెచ్చరించారు. అయితే పైలట్ మాత్రం ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. ఈసారి సీఎం పదవి చేజారితే మరో ఐదున్నరేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన భయం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ గహ్లోత్‌నే సీఎంగా చూడటం పైలట్‌కు సుతరామూ ఇష్టం లేదు. మరోవైపు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతున్న రాజస్తాన్ పడవ వివాదాల సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి రుచించడం లేదు. గహ్లోత్‌ను మళ్లీ సీఎం పదవి నుంచి తప్పించడానికి అధిష్టానం విముఖంగా ఉంది. ఎన్నికల ముందు సీఎంను మార్చి ఓటర్లను గందరగోళంలో పడేయడం తప్పుడు సంకేతాలను పంపినట్టవుతుందని భావిస్తోంది. గహ్లోత్‌పై పైలట్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చడం కూడా కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టం లేదు. పంజాబ్‌లో సిద్ధూ ఉదంతం అక్కడి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నిచ్చిందో కాంగ్రెస్‌కు అనుభవమే కాబట్టి మరోసారి అదే తప్పును పునరావృతం చేయడానికి సాహసించడం లేదు. అయితే ఈ సాకులన్నీ తనను మోసగించడానికేనని పైలట్ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత పోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం గమనార్హం. ఇప్పటికిప్పుడు బీజేపీ పరిస్థితి అమాంతం మెరుగయ్యేలా లేకపోయినా కులం కార్డు తమకు ఈసారి లాభిస్తుందని కమలనాథుల ఆశ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ జోషి (బ్రాహ్మణ్), బీజేపీ పక్ష నాయకుడిగా రాథోడ్ (రాజ్‌పుత్), ఉప నాయకుడిగా సతీశ్ పునియా (జాట్)లను నియమించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పథకాలను నమ్ముకున్న గహ్లోత్ 2018 నుంచి ఇప్పటిదాకా తను ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు 2023లో మరోసారి విజయం అందిస్తాయని గహ్లోత్ దృఢంగా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా ఇతర నాయకులతో తనకున్న సత్సంబంధాలు కూడా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక అడుగు ముందుకేసి గహ్లోత్ గుణగణాలను ప్రశంసించడం గమనార్హం. అయితే మరో ఆరేడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే గహ్లోత్–పైలట్ తమ విభేదాలను పక్కన పెట్టి సామరస్యంగా పనులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే కోరుకుంటోంది. కానీ వారు బహిరంగంగానే సై అంటే సై అనుకోవడం కాంగ్రెస్‌పై ఓటర్లకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. వివాదాలను తెగేదాకా లాగడం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటుగా మారింది. సెప్టెంబరులోనే అధికార మార్పిడికి ఒకసారి విఫలయత్నం చేసి చేతులెత్తేసిన గాంధీలు మరోసారి అలాంటి సాహసానికి దిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఖర్గే కూడా గాంధీల మార్గంలోనే పయనిస్తున్నారు. ఉన్నపళంగా పైలట్‌ను సీఎం చేసే దుస్సాహసానికి ఒడిగట్టే స్థితిలో ఆయన కూడా లేరు. పైలట్ కూడా ఇప్పటికిప్పుడు సీఎం పీఠం అధిష్టించాలన్న ఆలోచనలో లేరు. తాను వచ్చే ప్రభుత్వానికి ‘పైలట్’ కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. 2020లో తిరుగుబాటు చేసినప్పుడు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో పైలట్ విఫలమై ఉన్న డిప్యూటీ సీఎం పదవి కూడా వదులుకున్నారాయన. ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యం మరోసారి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షునిగా ఎంపికై తన మద్దతుదార్లకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడం ఒక్కటే! అదీ అధిష్టానం అనుకూలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ తాజా దీక్షతో ఆ అవకాశం కూడా పైలట్ చేజారినట్టు కన్పిస్తోంది! ఇక పైలట్‌కు మిగిలింది... ► చిన్న పార్టీలైన హనుమాన్ బెనీవాల్ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీలతో జతకట్టి స్వతంత్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. ► సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించి భావసారూప్యం గలవారిని చేర్చుకోవడం. ► పైలట్ గుజ్జర్ వర్గానికి చెందిన వారు కాబట్టి గుజ్జర్ల ఓట్లతో గెలవగలిగిన మొత్తం 30 అసెంబ్లీ సీట్లపైనా పూర్తిగా పట్టు బిగించడం. ► ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం. అయితే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయిన కేజ్రీవాల్‌తో కూడటం ఆయనకు రుచించకపోవచ్చు. ► కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాటం కొనసాగిస్తూనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. కొసమెరుపు.. రాజస్తాన్ ప్రభుత్వాన్ని పైలట్‌గా ముందుండి నడిపించాలన్న సచిన్ ఆశ నెరవేరుతుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కాంగ్రెస్ గనక ఈసారి ఆయన లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే 2013లో వచ్చిన 21 సీట్లు కూడా రాకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. అంటే సచిన్ కాస్త కష్టపడితే రాష్ట్రానికి ‘పైలట్’ అవుతారనే కదా!! -
అన్నాడీఎంకేలో కుర్చీ వార్
సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో నిప్పు రాజుకుంది. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు ‘నేనంటే నేనే’ అంటూ వాదులాడుకునే స్థాయికి చేరింది. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు పార్టీ సోమవారం స్పష్టం చేసింది. చదవండి: (కుష్బూను సందిగ్ధంలో పడేసిన గ్రూపు రాజకీయాలు) ఎడపాడి, పన్నీర్ మాటల యుద్ధం చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. ఎడపాడి, పన్నీర్ వర్గాలు రెండుగా విడిపోయి బలప్రదర్శన చేస్తూ తమ నేతలకు స్వాగతం పలికాయి. తమనేతే సీఎం అభ్యర్థి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సీఎం ఎడపాడికి బందోబస్తు పెంచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ అంశంపై 11 మందితో మార్గదర్శక కమిటీని వేయాలని పన్నీర్ ప్రతిపాదించగా, పార్టీ పరంగానే నిర్ణయం తీసుకోవచ్చు, కమిటీ అవసరం లేదని ఎడపాడి నిరాకరించారు. జయలలిత ఆదేశాల మేరకు సీఎం అయినందున తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పన్నీర్‌సెల్వం చెప్పగా, మిమ్మల్నే కాదు జయను సైతం సీఎంను చేసింది శశికళేనని ఎడపాడి బదులిచ్చారు. సుమారు ఐదు గంటపాటు సమావేశం జరిగినా ఓ అవగాహనకు రాలేకపోయారు. వచ్చే నెల 7వ తేదీన జరుగనున్న జనరల్ బాడీ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ సంయుక్తంగా ప్రకటన చేస్తారని ఆ పార్టీ అగ్రనేత కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు. 15 తీర్మానాలు ఆమోదం పార్టీ ప్రయోజనాలు, సిద్ధాంతాలకు కట్టుబడి సమష్టిగా పాటుపడదాం, తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం జీఎస్టీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల బకాయిలను చెల్లించాలని, కరోనా కష్టకాలంలో ప్రజల కోసం శ్రమించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఆరోగ్య, పోలీస్ శాఖలతోపాటు అన్నాడీఎంకే శ్రేణులకు ధన్యవాదాలు, ద్విభాషా విధానం, తమిళనాడులో నీట్ పరీక్ష రద్దు తదితర 15 తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. -
సీఎం సీటుపై శశిధర్‌రెడ్డి కన్ను!
హైదరాబాద్: కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మరోపేరు తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు, సనత్‌నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేరు సీఎం పదవి రేసులోకి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన సీఎం పోస్టుపై కన్నేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు. శశిధర్‌రెడ్డి మాత్రం.. సీఎం పదవి రేసులో లేనని అంటున్నారు. అధికారం కోసం తానెప్పుడూ పనిచేయదని అన్నారు. అధిష్టానం తనను సీఎం సీటులో కూర్చోబెడితే కాదనబోనని ఆయన చెప్పకనే చెప్పారు. శశిధర్‌రెడ్డి సీఎం సీటులో కూర్చునే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేర్కొన్నారు. శశిధర్‌రెడ్డి తండ్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వే సత్యనారాయణ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. అధిష్టానం ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తానంటే వద్దనే ధైర్యం తనకు లేదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవి దళితులకు ఇవ్వాలనుకుంటే తనకే వస్తుందన్న ఆశాభావంతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే దామోదర రాజనర్సింహ నుంచి సర్వేకు పోటీ ఎదురుకానుంది. అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి పేరు తాజాగా తెరపైకి రావడంతో తెలంగాణ సీఎం పదవిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ ఆసక్తికరంగా మారింది. జనవరి నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో కొత్త రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ నాయకులు అధిష్టానం అండ కోరుతున్నారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు తమ మనసులోని కోరికను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. కొంతమంది తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సస్పెన్స్ వీడాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు వేచి చూడాల్సిందే.