![Delhi Next Chief Minister A Woman says Sources](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/delhi-w-cm.jpg.webp?itok=jac2W2me)
కొత్త ఎమ్మెల్యేల నుంచే ఎంపిక!
బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు
నలుగురు మహిళల్లో చాన్స్ ఎవరికో?
మహిళలు, దళితులకు కేబినెట్లో పెద్దపీట
న్యూఢిల్లీ: ఢిల్లీకి మరోసారి మహిళే ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అత్యున్నత వర్గాలను ఉటంకిస్తూ పార్టీ వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. కాబోయే సీఎం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లోంచే ఎంపికవుతారని కూడా తెలుస్తోంది. పార్టీలో పలువురు నేతల అభిప్రాయం కూడా అదే కావడంతో ఈ విషయంలో అధిష్టానం రెండో ఆలోచన చేయకపోవచ్చంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను బీజేపీ ఓడించడం తెలిసిందే. తద్వారా ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
బీజేపీ తరఫున నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం పదవికి మహిళనే ఎంచుకుకోవాలని పార్టీ నిర్ణయిస్తే వారిలో ఎవరికి అదృష్టం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక వెనకవబడ్డ వర్గాల నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మహిళలకు, దళితులు, ఇతర వెనకబడ్డ వర్గాలకు మంత్రివర్గ కూర్పులో కూడా అధిక ప్రాధాన్యం దక్కడం ఖాయమంటున్నారు.
ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియపై పార్టీ పెద్దలు ఇప్పటికే దృష్టి పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దీనిపై చర్చించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన విజయం సాధించిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ రెండు రోజులుగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఆయన మాజీ సీఎం కుమారుడు.
![కొత్త ఎమ్మెల్యేల నుంచే సీఎం ఎంపిక!](https://www.sakshi.com/s3fs-public/inline-images/de_10.jpg)
పర్వేశ్ తండ్రి సాహిబ్‌సింగ్ వర్మ బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా పని చేశారు. పర్వేశ్‌తో పాటు వీరేంద్ర గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, పవన్ వర్మ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్న తరుణంలో తాజాగా అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ 13న తిరిగి రానున్నారు. సీఎం అభ్యరి్థపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. బహు శా 15వ తేదీకల్లా దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు.
ఆ నలుగురు వీరే...
బీజేపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. షాలిమార్‌బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా, నజఫ్‌గఢ్ నుంచి నీలం పెహల్వాన్ 29 వేల పై చిలుకు మెజారిటీతో నెగ్గారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్ 3,188 ఓట్ల మెజారిటీతో ప్రముఖ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్‌పై నెగ్గారు. వాజీపూర్ నుంచి పూనం శర్మ కూడా 11 వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు.
ఇప్పటిదాకా ముగ్గురు
ఢిల్లీకి ఇప్పటిదాకా ముగ్గురు మహిళలు సీఎంలయ్యారు. వారిలో తొలి వ్యక్తిగా బీజేపీ నేత సుష్మా స్వరాజ్ నిలిచారు. 1998లో ఆమె సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే కేవలం 52 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. ఆమె తర్వాత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ రూపంలో రెండో మహిళ ఢిల్లీ గద్దెనెక్కారు. ఆమె 2013 దాకా ఏకంగా 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగడం విశేషం. అనంతరం ఆప్ నుంచి తాజాగా ఆతిశీ రూపంలో మూడో మహిళ ఢిల్లీ సీఎం అయ్యారు. ఆమె కేవలం నాలుగున్నర నెలల పాటు పదవిలో కొనసాగారు.
Comments
Please login to add a commentAdd a comment