సీఎం పీఠంపై ఆమె... !
స్వతంత్ర భారత చరిత్రలో మహిళా ముఖ్యమంత్రులు 14 మందే
స్వతంత్ర భారతావనిలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన మహిళా నేతలు కేవలం 14 మందే! ప్రస్తుతం ఉన్న 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి) కేవలం 3 రాష్ట్రాల్లోనే మహిళలు రాజ్యమేలుతున్నారు. ఇప్పటివరకు పనిచేసిన మహిళా సీఎంల వివరాలివీ..
- ఎలక్షన్ సెల్
ఉక్కు మహిళ.. నందినీ శతపథి
ఒడిశాలోని కటక్‌లో 1931లో జన్మించిన నందిని ఎంఏ చదివారు. విద్యార్థి నేతగా కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1962లో 31 ఏళ్ల వయసులోనే రాజ్య సభకు ఎన్నికయ్యారు. 1972లో ఒడిశా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిపాటు రాష్ర్టపతి పాలన తర్వాత 1974లో మళ్లీ సీఎం అయ్యారు.
హిందుత్వ అజెండా.. ఉమ
రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు పొందిన ఉమాభారతి బీజేపీ తరఫున 2003 డిసెంబరు నుంచి, 2004 ఆగస్టు వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989 నుంచి 1999 వరకు వరుసగా లోక్‌సభకు ఎన్నిక య్యారు. అటల్‌బిహరీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2003 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు.
మహారాష్ట్ర మద్దతుదారు.. శశికళ కకోద్కర్
బహుజనుల పార్టీగా పేరొందిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ తరఫున 1973 నుంచి 1979 వరకు గోవా సీఎంగా పనిచేశారు. ఆమె తండ్రి దయానంద్ బండోద్కర్ కేంద్రపాలిత ప్రాంతమైన గోవా ప్రథమ ముఖ్య మంత్రి. నాడు గోవాను మహారాష్ట్రలో కలపాలని శశికళ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ యత్నాలేవీ నెరవేరలేదు.
సీఎంగా రికార్డ్.. షీలా దీక్షిత్
1938లో పంజాబ్‌లో జన్మిం చిన షీలా ఢిల్లీ యూని వర్సిటీలో ఎంఏ(చరిత్ర) చదివారు. 1984లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1986-89 మధ్య కేంద్ర మంత్రిగా పని చేశారు. 1998, 2003, 2008 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపి 1998 డిసెంబర్ నుంచి 2013 డిసెంబర్ వరకు అప్రతిహతంగా ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు.
మహరాణి.. వసుంధర రాజే
గ్వాలియర్ రాజవంశానికి చెందిన వసుంధర రాజే 1953లో జన్మించారు. రాజస్థాన్‌లోని ధోల్పూర్ సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన హేమంత్సింగ్ను 1972లో వివాహం చేసుకు న్నారు. బీజేపీ తరఫున రాజస్థాన్ అసెంబ్లీకి 1985లోనే ఎన్నికయ్యారు. 1989 నుంచి వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమె కుమారుడు దుష్యంత్‌సింగ్ ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు.
బహుజనుల ఆశాదీపం.. మాయావతి
మొదటి దళిత సీఎం. 1995లో జూన్ నుంచి అక్టోబర్ వరకు, 1997లో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు, 2002 మే నుంచి 2003 ఆగస్ట్ వరకు, 2007 నుంచి 2012 వరకు యూపీ సీఎంగా పనిచేశారు. లా చదివి టీచర్‌గా పనిచేస్తున్న సమయంలో కాన్షీరాం పరిచయంతో 1984లో బీఎస్పీలో చేరారు. మొదటి మహిళా సీఎం పేరు మీదున్న ఢిల్లీలోని సుచేతా కృపలానీ హాస్పిటల్లో 1956లో మాయావతి జన్మించారు.
మొదటి ముస్లిం సీఎం.. అన్వరా తైమూర్
1936లో జన్మించిన అన్వరా.. అసోం మొదటి మహిళా ముఖ్యమంత్రి, తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి. డిసెంబర్ 1980 నుంచి జూన్ 1981 వరకు సీఎంగా పనిచేశారు. అంతకుముందు, ఆ తరువాత అసోంలో రాష్ట్రపతి పాలన విధించారు. 1972, 78, 83, 91లలో అసోం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1988లో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.
స్వాతంత్య్రోద్యమ తార.. సుచేతా
స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలి మహిళా సీఎం సుచేత కృపలానీ. ఈమె హర్యానాలోని అంబా లాలో బెంగాలీ కుటుంబంలో 1908, జూన్ 25న జన్మించారు. కాంగ్రెస్ సోష లిస్ట్ నేత ఆచార్య జేబీ కృపలానీని పెళ్లి చేసుకున్నారు. 1962లో ఉత్తర ప్రదేశ్ విధాన సభకు ఎన్నికై, 1963 నుంచి 1967 వరకు ఆ రాష్ర్ట సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
పురచ్చితలైవి.. జయలలిత
పురచ్చితలైవిగా అభిమానులు పిలుచుకునే జయలలిత 1948లో జన్మించారు. తమిళ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా కీలకంగా ఉన్నారు. ఎంజీఆర్ మరణానంతరం, ఆయన రాజకీ య వారసురాలిగా ప్రకటించుకు ని, అన్నాడీఎంకేపై పట్టు సాధించా రు. రాజకీయాలకు ముందు తెలు గు, తమిళ, కన్నడలో దాదాపు 140 సినిమాల్లో హీరోయిన్గా చేశారు.
ఫైర్‌బ్రాండ్.. మమత
మమతాబెనర్జీ.. 34 ఏళ్ల లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వానికి చరమగీతం పాడి.. 2011లో పశ్చిమబెంగాల్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో మార్క్సి స్టు యోధుడు సోమనాథ్ చటర్జీని ఓడించి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ నుంచి విడిపోయి 1997లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు.
బీజేపీ వాణి.. సుష్మాస్వరాజ్
1952లో హర్యా నాలో జన్మించిన సుష్మ.. లా చదివి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జనతా పార్టీలో చేరి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. 1998 అక్టోబర్ నుంచి 1998 డిసెంబరు దాకా ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
జానకి రామచంద్రన్
తమిళనాడు మొదటి మహిళా సీఎం. 1923లో కేరళలో జన్మించారు. హీరోయిన్గా పలు సినిమాల్లో ఎంజీ రామచంద్రన్‌తో కలిసి నటించి, అనంతరం ఆయననే పెళ్లి చేసుకున్నారు. 1987లో ఎంజీఆర్ మరణానంతరం తమిళనాడు సీఎం అయ్యారు.
రబ్రీదేవి వైఫ్ ఆఫ్ లాలు ప్రసాద్
బీహార్ సీఎంగా 1997-2005 మధ్య ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. దాణా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ లాలూ ప్రసాద్ సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవిని ఆ పదవిలో కూర్చోబెట్టారు.
రాజీందర్ కౌర్ భట్టల్
కాంగ్రెస్‌కు చెందిన రాజీందర్ పంజాబ్ తొలి మహిళా ముఖ్యమంత్రి. హర్చరణ్ సింగ్ బ్రార్ రాజీనామా తర్వాత 1996 ఏప్రిల్ నుంచి 1997 ఫిబ్రవరి దాకా పంజాబ్ సీఎంగా ఉన్నారు.