సీఎం సీటుపై శశిధర్రెడ్డి కన్ను!
హైదరాబాద్: కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మరోపేరు తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు, సనత్నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి పేరు సీఎం పదవి రేసులోకి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన సీఎం పోస్టుపై కన్నేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు. శశిధర్రెడ్డి మాత్రం.. సీఎం పదవి రేసులో లేనని అంటున్నారు. అధికారం కోసం తానెప్పుడూ పనిచేయదని అన్నారు. అధిష్టానం తనను సీఎం సీటులో కూర్చోబెడితే కాదనబోనని ఆయన చెప్పకనే చెప్పారు.
శశిధర్రెడ్డి సీఎం సీటులో కూర్చునే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేర్కొన్నారు. శశిధర్రెడ్డి తండ్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వే సత్యనారాయణ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. అధిష్టానం ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తానంటే వద్దనే ధైర్యం తనకు లేదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవి దళితులకు ఇవ్వాలనుకుంటే తనకే వస్తుందన్న ఆశాభావంతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే దామోదర రాజనర్సింహ నుంచి సర్వేకు పోటీ ఎదురుకానుంది.
అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మర్రి శశిధర్రెడ్డి పేరు తాజాగా తెరపైకి రావడంతో తెలంగాణ సీఎం పదవిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ ఆసక్తికరంగా మారింది. జనవరి నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో కొత్త రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ నాయకులు అధిష్టానం అండ కోరుతున్నారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు తమ మనసులోని కోరికను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. కొంతమంది తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సస్పెన్స్ వీడాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు వేచి చూడాల్సిందే.