Telangana State CM
-
సీఎంగా కేసీఆర్ నియామకం చెల్లదు
హైకోర్టులో న్యాయవాది పి.వి.కృష్ణయ్య పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆ పదవిలో కొనసాగకుండా నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతున్నారో వివరణ ఇచ్చేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య గురువారం ‘రిట్ ఆఫ్ కో వారెంటో’ రూపంలో పిటిషన్ వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి, కేసీఆర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ సీఎంగా నియమించి గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డాయని, ఆ వెంటనే మెజారిటీ సాధించిన పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ కోరాల్సి ఉండగా ఆయన ఆ పని చేయలేదని పేర్కొన్నారు. అపాయింటెడ్ డే వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించకుండా తాత్సారం చేశారని తెలిపారు. అపాయింటెడ్ డే వరకు వేచి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా ప్రతిపాదించలేదని, అయినా కూడా గవర్నర్ తాత్సారం చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. అపాయింటెడ్ డే వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాల్సి ఉండగా, చట్టపరమైన ఈ విధి విధానాలను అమలు చేయడంలో గవర్నర్ విఫలమయ్యారని పిటిషనర్ పేర్కొన్నారు. అపాయింటెడ్ డే తర్వాతే రెండు రాష్ట్రాలకు కొత్త సీఎంలను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఇదే చెబుతోందని కోర్టుకు వివరించారు. అందువల్ల ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియామకం చెల్లదన్నారు. -
సీఎం రేసులో లేను: ఎంపీ వివేక్
మంథని: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాను ముఖ్యమంత్రి రేసులో ఉంటాననే ప్రచారం అవాస్తవమని ఎంపీ జి.వివేక్ తెలిపారు. సీఎం పదవి కోసమే తాను టీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం చేస్తున్నారని, పదవుల కోసం ఏనాడూ ఆరాటపడ లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు త్యాగం చేసిన వారిని తెలంగాణ ఫ్రీడం ఫైటర్స్‌గా గుర్తించాలని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొలువుదీరే ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూ ఎన్నోసార్లు పదవీ త్యాగం చేసిన కేసీఆర్ లాంటి వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉద్యమంలో సరైన సమయంలో త్యాగం చేస్తేనే ఫలితం లభిస్తుంది కానీ.. స్వప్రయోజనాల కోసం చేస్తే త్యాగాలు చేస్తే లాభం ఉండదని మంత్రి శ్రీధర్‌బాబు నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. -
సీఎం సీటుపై శశిధర్‌రెడ్డి కన్ను!
హైదరాబాద్: కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మరోపేరు తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు, సనత్‌నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేరు సీఎం పదవి రేసులోకి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన సీఎం పోస్టుపై కన్నేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు. శశిధర్‌రెడ్డి మాత్రం.. సీఎం పదవి రేసులో లేనని అంటున్నారు. అధికారం కోసం తానెప్పుడూ పనిచేయదని అన్నారు. అధిష్టానం తనను సీఎం సీటులో కూర్చోబెడితే కాదనబోనని ఆయన చెప్పకనే చెప్పారు. శశిధర్‌రెడ్డి సీఎం సీటులో కూర్చునే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేర్కొన్నారు. శశిధర్‌రెడ్డి తండ్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వే సత్యనారాయణ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. అధిష్టానం ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తానంటే వద్దనే ధైర్యం తనకు లేదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవి దళితులకు ఇవ్వాలనుకుంటే తనకే వస్తుందన్న ఆశాభావంతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే దామోదర రాజనర్సింహ నుంచి సర్వేకు పోటీ ఎదురుకానుంది. అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి పేరు తాజాగా తెరపైకి రావడంతో తెలంగాణ సీఎం పదవిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ ఆసక్తికరంగా మారింది. జనవరి నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో కొత్త రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ నాయకులు అధిష్టానం అండ కోరుతున్నారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు తమ మనసులోని కోరికను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. కొంతమంది తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సస్పెన్స్ వీడాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు వేచి చూడాల్సిందే.