సీఎంగా కేసీఆర్ నియామకం చెల్లదు
హైకోర్టులో న్యాయవాది పి.వి.కృష్ణయ్య పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆ పదవిలో కొనసాగకుండా నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతున్నారో వివరణ ఇచ్చేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య గురువారం ‘రిట్ ఆఫ్ కో వారెంటో’ రూపంలో పిటిషన్ వేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి, కేసీఆర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ సీఎంగా నియమించి గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డాయని, ఆ వెంటనే మెజారిటీ సాధించిన పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ కోరాల్సి ఉండగా ఆయన ఆ పని చేయలేదని పేర్కొన్నారు.
అపాయింటెడ్ డే వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించకుండా తాత్సారం చేశారని తెలిపారు. అపాయింటెడ్ డే వరకు వేచి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా ప్రతిపాదించలేదని, అయినా కూడా గవర్నర్ తాత్సారం చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. అపాయింటెడ్ డే వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాల్సి ఉండగా, చట్టపరమైన ఈ విధి విధానాలను అమలు చేయడంలో గవర్నర్ విఫలమయ్యారని పిటిషనర్ పేర్కొన్నారు. అపాయింటెడ్ డే తర్వాతే రెండు రాష్ట్రాలకు కొత్త సీఎంలను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఇదే చెబుతోందని కోర్టుకు వివరించారు. అందువల్ల ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియామకం చెల్లదన్నారు.