pv krishnaiah
-
నోట్ల రద్దుపై విచారణ ఈ నెల16కు వాయిదా
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. నోట్ల రద్దుపై అనేక పిటిషన్లు వస్తున్నాయన్న న్యాయస్థానం వాటన్నింటినీ ఒకేసారి విచారణ చేస్తామని తెలిపింది. కాగా సామాన్య జనాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా రూ.500,1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. -
సీఎంగా కేసీఆర్ నియామకం చెల్లదు
హైకోర్టులో న్యాయవాది పి.వి.కృష్ణయ్య పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆ పదవిలో కొనసాగకుండా నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతున్నారో వివరణ ఇచ్చేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య గురువారం ‘రిట్ ఆఫ్ కో వారెంటో’ రూపంలో పిటిషన్ వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి, కేసీఆర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ సీఎంగా నియమించి గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డాయని, ఆ వెంటనే మెజారిటీ సాధించిన పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ కోరాల్సి ఉండగా ఆయన ఆ పని చేయలేదని పేర్కొన్నారు. అపాయింటెడ్ డే వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించకుండా తాత్సారం చేశారని తెలిపారు. అపాయింటెడ్ డే వరకు వేచి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా ప్రతిపాదించలేదని, అయినా కూడా గవర్నర్ తాత్సారం చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. అపాయింటెడ్ డే వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాల్సి ఉండగా, చట్టపరమైన ఈ విధి విధానాలను అమలు చేయడంలో గవర్నర్ విఫలమయ్యారని పిటిషనర్ పేర్కొన్నారు. అపాయింటెడ్ డే తర్వాతే రెండు రాష్ట్రాలకు కొత్త సీఎంలను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఇదే చెబుతోందని కోర్టుకు వివరించారు. అందువల్ల ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియామకం చెల్లదన్నారు. -
రాష్ట్ర విభజనపై హైకోర్టులో వాదనలు పూర్తి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. విభజనకు ఉద్దేశించి రాజ్యాంగంలోని 3వ అధికరణ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉందని, ఈ కారణంతో దాన్ని కొట్టివేయాలని పిటిషినర్ పీవీ కృష్ణయ్య హైకోర్టు ముందు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 371(డి) అధికరణ అమల్లో ఉండగా 3వ అధికరణకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది.