ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు?
ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్‌లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి.
కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు.
ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు.
తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి.
అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment