రేసులో ఫడ్నవీస్‌తో పాటు షిండే, అజిత్
నేడు మహాయుతి ఎమ్మెల్యేల భేటీ
సీఎంపై నిర్ణయం, రేపు ప్రమాణం!
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్‌నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా తం ఆ పోస్టుపై కన్నేసినట్టు చెబుతున్నారు.
బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీపైనే అందరి కళ్లూ నిలిచాయి. ఈ భేటీలోనే కొత్త సీఎంను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి.
ఈ నేపథ్యంలో కొత్త సీఎం ప్రమాణస్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే అవకాశముంది. మూడు పార్టీల అగ్రనేతలు ఆదివారం తమ ఎమ్మెల్యేలతో చర్చల్లో మునిగితేలారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అజిత్‌ను ఆ పార్టీ నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే చెప్పారు.
బ్రాహ్మణ సామాజికవర్గానికి ఫడ్నవీస్‌కు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింటా పైచేయి. ఇప్పటిదాకా సీఎంగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ సామాజికవర్గానికి చెందినవారే.
ఈసారి కూడా తమ సామాజిక వర్గానికే సీఎం పీఠం దక్కాలని వారు ఆశిస్తున్నారు. ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం చేయాలన్న ఆలోచనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకున్న ఇమేజీని గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30 శాతం కాగా బ్రాహ్మణులు 10 శాతమున్నారు. మనోహర్ జోషీ తర్వాత మహారాష్ట్ర సీఎంగా చేసిన రెండో బ్రాహ్మణ నేతగా ఫడ్నవీస్ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment