Chief Minister Race
-
‘మహా’ సీఎంపై పీటముడి!
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా తం ఆ పోస్టుపై కన్నేసినట్టు చెబుతున్నారు. బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీపైనే అందరి కళ్లూ నిలిచాయి. ఈ భేటీలోనే కొత్త సీఎంను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ప్రమాణస్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే అవకాశముంది. మూడు పార్టీల అగ్రనేతలు ఆదివారం తమ ఎమ్మెల్యేలతో చర్చల్లో మునిగితేలారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అజిత్‌ను ఆ పార్టీ నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే చెప్పారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి ఫడ్నవీస్‌కు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింటా పైచేయి. ఇప్పటిదాకా సీఎంగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ సామాజికవర్గానికి చెందినవారే. ఈసారి కూడా తమ సామాజిక వర్గానికే సీఎం పీఠం దక్కాలని వారు ఆశిస్తున్నారు. ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం చేయాలన్న ఆలోచనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకున్న ఇమేజీని గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30 శాతం కాగా బ్రాహ్మణులు 10 శాతమున్నారు. మనోహర్ జోషీ తర్వాత మహారాష్ట్ర సీఎంగా చేసిన రెండో బ్రాహ్మణ నేతగా ఫడ్నవీస్ నిలిచారు. -
ఎల్లుండే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చి పడింది. అదే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి అని. సీఎం రేసులో సీనియర్ నేత సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరి పేర్లే మొదటి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వాళ్లు అధిష్టానం చూపు తమపైనే ఉందంటూ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో.. కర్ణాటకలో కొత్త సర్కార్ కొలువు దీరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం ప్రస్తుత సీఎం బొమ్మై తన రాజీనామాను గవర్నర్‌ను కలిసి సమర్పిస్తారు. ఎల్లుండి(మే 15వ) బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే యోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. అదేరోజు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా గతంలో డీకే శివకుమార్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ను పరిశీలిస్తే.. తన పుట్టినరోజునాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తనకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చారని డీకే ప్రకటించారు. దీంతో.. తన పుట్టినరోజు నాడే కొలువుదీరనున్న కొత్త సర్కార్‌లో డీకే శివకుమార్ స్థానం ఏమై ఉండొచ్చని?.. అధిష్టానం ఆయనకు ఏం గిఫ్ట్ ఇస్తుందనే చర్చ మొదలైంది కన్నడనాట. రేపు(ఆదివారం) సీల్పీ భేటీలో సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉండగా.. సీఎం ఎంపికపైనా సాయంత్రకల్లా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘‘మద్దతుదారులంతా నన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారా?(మీడియాను ఉద్దేశించి). నాకంటూ ప్రత్యేకించి మద్దతుదారులంటూ ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ అంతా నాకు అండగా ఉంది. ఈ విజయం అందరి సమిష్టి విజయం. సోనియా, రాహుల్ గాంధీలకు ఈ విజయం అంకితం’’: సీఎం అభ్యర్థి రేసుపై డీకే తాజా స్పందన ఇదీ చదవండి: 'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్ -
మహా ముఖ్యమంత్రి రేసులో ఎవరెవరు?
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేంత స్పష్టమైన ఆధిక్యం రాకపోయినా.. అత్యధిక స్థానాలు సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన మద్దతు ఇస్తుందో, లేదా ముందే ప్రకటించిన ఎన్సీపీ మద్దతు తీసుకుంటారో.. ఇవన్నీ కావు ఇండిపెండెంట్ల సాయంతోనే గద్దెనెక్కేస్తామని అంటారో గానీ కమలనాథులు తమ పార్టీ నాయకులే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. దాంతో పలువురు ఆశావహుల పేర్లు సీఎం పదవికోసం ముందుకు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి తాను వెళ్లేది లేదని పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెబుతున్నా, ఆయన పేరుకూడా ప్రముఖంగా వినపడుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్, ప్రకాష్ జవదేకర్ పేర్లమీద కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే పేరునూ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో వందకు పైగా ర్యాలీలు చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన గడ్కరీ... తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదంటున్నారు. మహారాష్ట్ర బీజేపీలో అనుభవజ్ఞుడైన నేతగా మిగతా నేతల మద్దతున్న ఆయన మాత్రం తాను కేంద్రంలోనే ఆనందంగా ఉన్నానని చెబుతున్నారు. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ పేరు కూడా సిఎం రేసులో ప్రముఖంగా వినపడుతోంది. వివాదాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ గల యువనేతగా పార్టీ అధిష్టానాన్ని ఆయన ఆకర్షించారు. సీఎం రేసులో వినపడుతున్న మరో పేరు వినోద్ తావ్డే. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టగలిగే చురుకైన యువనేతగా తావ్డే గుర్తింపు తెచ్చుకున్నారు. తావ్డే అభ్యర్ధిత్వాన్ని పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సారి మహారాష్ట్రకు మహిళా సీఎం రాబోతున్నారంటూ ముంబైలో ఫలితాలకు ముందునుంచే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా పంకజాముండే గురించే. ఇటీవల కన్నుమూసిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ. ఉజ్వల భవిష్యత్తు ఉండీ అకస్మాత్తుగా కన్నుమూసిన బీజేపీ నేత ప్రమోద్ మహాజన్‌కు పంకజ కోడలు. పర్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమెకు ఐదేళ్ల రాజకీయ అనుభవం మాత్రమే ఉంది. కుటుంబ నేపథ్యం ఆధారంగా చూస్తే ఆమె ముఖ్యమంత్రి కావడానికి ఏ అడ్డంకులూ లేవు. ముండే, మహాజన్‌ల మరణాల నేపథ్యంలో పార్టీ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తే ఆమె అభ్యర్ధిత్వానికి ఎవరూ అడ్డుచెప్పే అవకాశం లేదు. అయితే కుటుంబ నేపథ్యాలకన్నా అనుభవానికే పార్టీ పెద్దలు ప్రాధాన్యతనిస్తే పంకజకు ప్రస్తుతానికి అవకాశం లేనట్లే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సోమవారం సమావేశమై.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయం తేలుస్తుంది. -
ఒకరికి ఛాన్స్..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు :ఢిల్లీలో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణ లతో జిల్లా నాయకులు బిజిబిజీగా మారుతున్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు పీసీసీ, ముఖ్యమంత్రులను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించిన నేపథ్యంలో వీటి కోసం నాయకులు తమ లాబీయింగ్‌ను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి రేసులో కన్నా లక్ష్మీనారాయణ పేరు మొదటి నుంచి వినపడుతున్నప్పటికీ తాజాగా చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ సీనియర్‌గా ఉన్నారు. ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు సీనియర్ మంత్రిగా వున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సైతం ఏనాడూ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయలేదు. అయితే పార్టీని విలీనం చేసి కష్టకాలంలో కాంగ్రెస్‌ను గట్టెక్కించిన చిరంజీవి ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని సీఎం పదవి వరించనుందనే అనే విషయంపై చర్చ సాగుతోంది. ఇక పీసీసీ పదవిని దక్కించుకునేందుకు మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డొక్కా తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా చేరారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఎస్సీ వర్గానికి పెద్ద పీట వేయాలని అధిష్టానం భావించడం డొక్కాకు కలిసి వచ్చే అంశంగా మారింది. తన రాజకీయ గురువు ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పినా డొక్కా మాత్రం పార్టీకి విధేయత చూపారు. దీంతో పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. మంగళవారం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి పార్టీ మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చినట్లు ఇక్కడప్రచారం జరుగుతుంది. అలాగే తెలంగాణ లో మందా కృష్ణమాదిగ వారి సామాజిక వర్గం ఓట్లను చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో అదే సామాజిక వర్గానికి చెందిన డొక్కాను సీమాంధ్రకు పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, కన్నాకు ముఖ్యమంత్రి పదవి లభిస్తే డొక్కాకు ఏ పదవి దక్కదని, చిరంజీవికి సీఎం పదవి వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కన్నాకు పీసీసీ అధ్యక్ష పదవి లభించే అవకాశాల ఉండవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.