ఒకరికి ఛాన్స్..!
ఒకరికి ఛాన్స్..!
Published Wed, Feb 26 2014 4:07 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు :ఢిల్లీలో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణ లతో జిల్లా నాయకులు బిజిబిజీగా మారుతున్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు పీసీసీ, ముఖ్యమంత్రులను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించిన నేపథ్యంలో వీటి కోసం నాయకులు తమ లాబీయింగ్‌ను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి రేసులో కన్నా లక్ష్మీనారాయణ పేరు మొదటి నుంచి వినపడుతున్నప్పటికీ తాజాగా చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ సీనియర్‌గా ఉన్నారు. ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు సీనియర్ మంత్రిగా వున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సైతం ఏనాడూ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయలేదు.
అయితే పార్టీని విలీనం చేసి కష్టకాలంలో కాంగ్రెస్‌ను గట్టెక్కించిన చిరంజీవి ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని సీఎం పదవి వరించనుందనే అనే విషయంపై చర్చ సాగుతోంది. ఇక పీసీసీ పదవిని దక్కించుకునేందుకు మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డొక్కా తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా చేరారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఎస్సీ వర్గానికి పెద్ద పీట వేయాలని అధిష్టానం భావించడం డొక్కాకు కలిసి వచ్చే అంశంగా మారింది. తన రాజకీయ గురువు ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పినా డొక్కా మాత్రం పార్టీకి విధేయత చూపారు.
దీంతో పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. మంగళవారం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి పార్టీ మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చినట్లు ఇక్కడప్రచారం జరుగుతుంది. అలాగే తెలంగాణ లో మందా కృష్ణమాదిగ వారి సామాజిక వర్గం ఓట్లను చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో అదే సామాజిక వర్గానికి చెందిన డొక్కాను సీమాంధ్రకు పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, కన్నాకు ముఖ్యమంత్రి పదవి లభిస్తే డొక్కాకు ఏ పదవి దక్కదని, చిరంజీవికి సీఎం పదవి వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కన్నాకు పీసీసీ అధ్యక్ష పదవి లభించే అవకాశాల ఉండవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Advertisement