మహా ముఖ్యమంత్రి రేసులో ఎవరెవరు?
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేంత స్పష్టమైన ఆధిక్యం రాకపోయినా.. అత్యధిక స్థానాలు సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన మద్దతు ఇస్తుందో, లేదా ముందే ప్రకటించిన ఎన్సీపీ మద్దతు తీసుకుంటారో.. ఇవన్నీ కావు ఇండిపెండెంట్ల సాయంతోనే గద్దెనెక్కేస్తామని అంటారో గానీ కమలనాథులు తమ పార్టీ నాయకులే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. దాంతో పలువురు ఆశావహుల పేర్లు సీఎం పదవికోసం ముందుకు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి తాను వెళ్లేది లేదని పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెబుతున్నా, ఆయన పేరుకూడా ప్రముఖంగా వినపడుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్, ప్రకాష్ జవదేకర్ పేర్లమీద కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే పేరునూ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ తరఫున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో వందకు పైగా ర్యాలీలు చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన గడ్కరీ... తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదంటున్నారు. మహారాష్ట్ర బీజేపీలో అనుభవజ్ఞుడైన నేతగా మిగతా నేతల మద్దతున్న ఆయన మాత్రం తాను కేంద్రంలోనే ఆనందంగా ఉన్నానని చెబుతున్నారు. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ పేరు కూడా సిఎం రేసులో ప్రముఖంగా వినపడుతోంది. వివాదాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ గల యువనేతగా పార్టీ అధిష్టానాన్ని ఆయన ఆకర్షించారు. సీఎం రేసులో వినపడుతున్న మరో పేరు వినోద్ తావ్‌డే. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టగలిగే చురుకైన యువనేతగా తావ్‌డే గుర్తింపు తెచ్చుకున్నారు. తావ్‌డే అభ్యర్ధిత్వాన్ని పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ సారి మహారాష్ట్రకు మహిళా సీఎం రాబోతున్నారంటూ ముంబైలో ఫలితాలకు ముందునుంచే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా పంకజాముండే గురించే. ఇటీవల కన్నుమూసిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ. ఉజ్వల భవిష్యత్తు ఉండీ అకస్మాత్తుగా కన్నుమూసిన బీజేపీ నేత ప్రమోద్ మహాజన్‌కు పంకజ కోడలు. పర్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమెకు ఐదేళ్ల రాజకీయ అనుభవం మాత్రమే ఉంది. కుటుంబ నేపథ్యం ఆధారంగా చూస్తే ఆమె ముఖ్యమంత్రి కావడానికి ఏ అడ్డంకులూ లేవు. ముండే, మహాజన్‌ల మరణాల నేపథ్యంలో పార్టీ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తే ఆమె అభ్యర్ధిత్వానికి ఎవరూ అడ్డుచెప్పే అవకాశం లేదు. అయితే కుటుంబ నేపథ్యాలకన్నా అనుభవానికే పార్టీ పెద్దలు ప్రాధాన్యతనిస్తే పంకజకు ప్రస్తుతానికి అవకాశం లేనట్లే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సోమవారం సమావేశమై.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయం తేలుస్తుంది.