అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సంఘర్ష్ యాత్ర’ రాష్ట్రవ్యాప్త పర్యటనకు దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ సిద్ధమవుతున్నారు.
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సంఘర్ష్ యాత్ర’ రాష్ట్రవ్యాప్త పర్యటనకు దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ సిద్ధమవుతున్నారు. నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డేతోపాటు పంకజా ముండే మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 14 రోజులపాటు నిర్వహించే యాత్రలో భాగంగా పంకజ 21 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్లు పర్యటిస్తారు.
బుల్డాణాలోని సింధ్‌ఖేడ్ జిల్లాలో యాత్ర ప్రారంభమవుతుందని పంకజ తెలిపారు. ఈ ప్రాంతం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి రాజమాత జీజావు జన్మస్థలం. తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన స్థానంలో పోటీకి పంకజ సిద్ధంగా లేరని ఇటీవల వార్తలు వచ్చాయి. ముండే కుటుంబం నుంచి ఎవరు బరిలోకి దిగినా వారికి వ్యతిరేకంగా తాము అభ్యర్థిని బరిలోకి దింపబోమని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే ముండే ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే.