మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్?
ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్కే ఈ పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకుంది. క్యాంపు రాజకీయాలతో కలకలం రేపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా.. శివసేన ఒత్తిడికి తలొగ్గకుండా పార్టీని విజయపథంలో నడిపించిన ఫడ్నవిస్నే ఎంచుకుంది.
ఎన్నికలకు ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన పొత్తును శివసేన తెంచుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. దేవేంద్ర ఫడ్నవిస్ చాలా గట్టిగా నిలబడ్డారు. కనీసం 135 స్థానాల్లో పోటీ చేయాల్సిందేనని అధిష్ఠానానికి చెప్పారు. అయితే శివసేన మాత్రం 119 స్థానాలకు మించి ఇచ్చేది లేదని అన్నప్పుడు, అవసరమైతే పొత్తును తెంచుకోవాలని కూడా అధిష్ఠానం దగ్గర ఫడ్నవిస్ వాదించారు. ఆయన విదర్భ ప్రాంతానికి చెందిన నాయకుడు. సాధారణంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మారాఠ్వాడా ప్రాంత నాయకులదే హవా నడుస్తుంటుంది. ఈసారి ఆ ప్రాంతాన్ని కాదని.. కరువు కాటకాలతో రైతు ఆత్మహత్యలలో ముందున్న విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడికే కమలనాథులు పట్టంగట్టారు.