పక్కలో బల్లెం..!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో బీజేపీ మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకుని ఐదేళ్లపాటు సుస్థిర పాలన అందించేవిధంగా శివసేనతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి గడ్కరీ తన అనుచర గణంతో ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. అయితే ఆయనను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టి బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌కు అవకాశమిచ్చింది.
దీంతో అప్పటికి మౌనంగా ఉండి కేంద్ర పదవితో సరిపెట్టుకున్న గడ్కరీ ఇప్పుడు తెరచాటు నుంచి రాజకీయాలు నడిపిస్తూ ఫడ్నవిస్ ప్రభుత్వానికి, శివసేనకు పొత్తు కుదరకుండా అడ్డుపుల్లలు వేయిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో శివసేన భాగస్వామి కానుందని మూడు రోజుల కిందట స్వయంగా సీఎం ఫడ్నవిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా రెండు పార్టీల మధ్య శనివారం నుంచి చర్చలు మొదలయ్యాయి కూడా. అయితే ఇదే సమయంలో రాష్ట్ర మంత్రులు ఖడ్సే, సుధీర్ మునగంటివార్ తదితరులు బీజేపీ, శివసేన మధ్య పొరపొచ్చాలు వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రభుత్వంలో భాగస్వామ్యులయ్యేందుకు పలువురు శివసేన ఎమ్మెల్యేలు 8 మంది సిద్ధంగా ఉన్నారని, వారందరూ ప్రస్తుతం తమతో సంప్రదిస్తున్నారని మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే శుక్రవారం వ్యాఖ్యానించారు. అలాగే రెండు రోజుల ముందు మంత్రి సుధీర్ మునగంటివార్ కూడా ప్రభుత్వంలో చేరేందుకు పలువురు శివసేన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, వారంతా సమయం చూసుకుని ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారని పేర్కొన్నారు.
సహజంగానే శివసేనకు ఆగ్రహం తెప్పించే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరు మంత్రులూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అనుంగు శిష్యులుగా పేరు గాంచిన వారే కావడం గమనార్హం. దీంతో ఈ తతంగమంతా నితిన్ తెరచాటునుంచి నడుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే శివసేనపై కూడా అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తూ పొత్తులు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలు ఆ పార్టీనుంచే వినిపిస్తున్నాయి.
ఫడ్నవిస్‌కు తలనొప్పిగా మారిన విస్తరణ..
మంత్రి మండలి విస్తరణ బీజేపీకి తలనొప్పిగా మారింది. ఓ వైపు శివసేనను భాగస్వామిని చేసుకోవాల్సిన బీజేపికి, ఆ పార్టీ డిమాండ్లు చాలా ఇరకాటంలో పెడుతున్నాయి. ఇదిలా ఉండగా, మిత్రపక్షాలు సైతం ఈ విస్తరణలో తమకూ వాటా ఇవ్వాలని కోరుతుండటంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. పాత ఫార్ములా ప్రకారమే తమకు మంత్రి పదవులు కేటాయించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. దీని ప్రకారం ఉపముఖ్యమంత్రి పదవితోపాటు ఆరు కేబినెట్, పది సహాయ మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే శివసేనకే ఇన్ని పదవులు కట్టబెడితే మిగతా మిత్ర పక్షాలకు ఎలా సర్దుబాటు చేయాలి.. అనే విషయాలపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. దీంతో పాటు విదర్భ విషయం కూడా ఈ రెండు పార్టీల మధ్య అడ్డుగోడగా నిలుస్తోందని తెలుస్తోంది. విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ సానుకూలంగా ఉండగా, శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండింటి మధ్య పొత్తు చర్చలు ఎప్పటికి కొలిక్కి వస్తాయో వేచిచూడాల్సిందే.