ముంబై పీఠంపై ప్రతిష్టంభన
► బీజేపీ–శివసేన దోస్తీయే ప్రత్యామ్నాయమన్న గడ్కరీ
► సామ్నాలో కమలంపై నిప్పులు చెరిగిన శివసేన
ముంబై: బీఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో మేయర్ ఎవరనే దానిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎక్కువ సీట్లు గెలుపొందిన శివసేన.. బీజేపీతో కలవబోమంటూ గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఎన్నికలు అయిపోయాక కూడా అధికార పత్రిక సామ్నాలో బీజేపీపై విమర్శలు గుప్పించింది. కాగా, బీజేపీ–శివసేన కలిసిరావటం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ‘రెండు పార్టీలకు ఒకరితో ఒకరు కలవటం తప్ప వేరే దారిలేదు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కలసి తీసుకుంటారు’ అని గడ్కరీ తెలిపారు.
అయితే, ఈ దోస్తీ కలకాలం ఉండాలని శివసేన కోరుకుంటే తన అధికార పత్రిక సామ్నాలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలపై అవమానకరంగా రాస్తున్న వార్తలపై ఆలోచించాలని సూచించారు. కాగా, కాంగ్రెస్ మద్దతుతో శివసేన మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనుందనే వార్తలను ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఖండించారు.
కలవటం కష్టమే: శివసేన
బీజేపీ స్నేహహస్తాన్ని అందిస్తున్నప్పటికీ.. వీరితో దోస్తీకి సుముఖంగాలేమని శివసేన తెలిపింది. బీజేపీతో తమ పోరు కొనసాగుతుందని.. మహారాష్ట్ర సమగ్రత కోసం యుద్ధం కొనసాగుతుందని.. అధికారం కోసం కాదని ‘సామ్నా’లో పేర్కొంది. ‘మేం (శివసేన) 25 ఏళ్లుగా బీఎంసీని ఏలుతున్నాం. వారు (బీజేపీ) కుయుక్తులతో మా పాలనను అస్థిరపరిచే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ పాలనలో ఉన్నపుడు కూడా ఇలా జరగలేదు’ అని సామ్నా వెల్లడించింది. శనివారం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశమయ్యాక తదనంతర పరిస్థితులపై ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకోనున్నారు. అటు, ఈ అంశంపై చర్చించేందుకు రెండు మూడు రోజుల్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది.