ఇదీ బీజేపీ షరతు మోదీకి ఉద్ధవ్ క్షమాపణ చెబితేనే పొత్తు
సాక్షి, ముంబై: పొత్తు కోసం తహతహలాడుతున్న శివసేనకు బీజేపీ విధించిన షరతు గురించి తెలిస్తే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే. ఇంతకీ అదేమిటనేగా మీ సందేహం. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే... ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్షమాపణ చెప్పిన తర్వాతే ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటామని బీజేపీ పేర్కొంది. అయితే ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీకి చెందిన అందరు మంత్రులను ‘అఫ్జల్‌ఖాన్ ఫౌజ్ (అఫ్జల్‌ఖాన్ సైనికులు)’తో శివసేన ఎన్నికల సమయంలో పోల్చడం బీజేపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. దీంతో నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఉద్ధవ్ క్షమాపణ చెప్పాలనే షరతును బీజేపీ... శివసేన ముందుంచింది. క్షమాపణ చెప్పిన తర్వాతే శివసేనతో పొత్తు పెట్టుకుంటామని బీజేపీ స్పష్టం చేసినట్టు సమాచారం.
ఈ షరతుపై శివసేన ఎలా స్పందించనుందనేది వేచిచూడాల్సిందే. సీట్ల పంపకాల సమయంలో పాతికేళ్ల అనుబంధం తెగిపోయిన అనంతరం శివసేన, బీజేపీల మధ్య దూరం పెరిగిపోయింది. ఎన్నికల ప్రచారం సమయంలో శివసేన, బీజేపీల మద్య మాటల యుద్ధంకొనసాగింది. శివసేన బీజేపీపై తీవ్రంగా మండిపడితూ వ్యాఖ్యలు చేసింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ఇరు పార్టీలు మెతకవైఖరిని అవలంబించినప్పటికీ పొత్తు అంశంపై ఇంకా ఉత్కంఠకు తెరపడలేదు. కాగా రాష్ట్రంలో తొలిసారిగా అవకాశం దక్కించుకున్న బీజేపీ... ఒంటరిగానే ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.
శాసనసభా పక్షనేతగా దేవేంద్ర ఫడణవీస్‌ను ఎన్నుకున్న తర్వాత శుక్రవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా దేవేంద్ర తోపాటు కొందరు మంత్రులతో వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే శివసేనతో చర్చలు జరుగుతున్నాయని, శివసేనకూడా ప్రభుత్వంలో భాగస్వామి కావాలని బీజేపీ నాయకుడు జె.పి.నడ్డా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేనను పక్కనబెట్టి ఎన్సీపీ సహాయం తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలియవచ్చింది.
మరోవైపు అవసరమైన మెజారిటీ కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు తెరవెనుక బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని చెబుతున్నారు. ఫలితాల అనంతరం బీజేపీ నాయకులు కిరీట్ సోమయ్య మాట్లాడుతూ తమ ఎమ్మెలేల్యతోపాటు ఇతర పార్టీలకు చెందిన మరో 15 మంది మద్దతు ప్రకటించినట్టు చెప్పారు. దీంతో మరో 10 మందిని సునాయాసంగా తమవైపు తిప్పుకోగలుగుతామనే ధీమా బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుతర్వాత బలనిరూపణకు 15 రోజుల గడువు ఉంటుంది. ఈ పక్షం రోజుల వ్యవధిలో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.