ముంబై: ‘రాష్ట్ర బీజేపీ నాయకులకు సొంతంగా సీట్లు గెలుచుకునే దమ్ములేదా.. ప్రధాని మోడీతో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించేందుకు వారు ఏర్పాట్లు చేసుకోవడం చూస్తుంటే మాకే కాదు.. సామాన్య ఓటరుకు సైతం ఇదే అనుమానం వస్తుంది..’ అంటూ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
‘రాష్ర్టంలో మోడీ హవా ఉందని వారు అంటున్నారు.. ఇది గుజరాత్ కాదు.. ఒకవేళ అలాంటి హవా ఉందని వారు భావిస్తే తిరిగి ప్రత్యేకంగా ప్రధాన మంత్రితో రాష్ర్ట ఎన్నికల్లో ప్రచారసభలు నిర్వహించడం ఎందుకు.. ? అంటూ ప్రశ్నించారు. తనకు మోడీపై వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బహిరంగసభలకు హాజరు కావాల్సిందిగా స్థానిక బీజేపీ నాయకులు ప్రధానిని ఆహ్వానించడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు.
వాస్తవానికి మోడీ ఎన్ని పార్టీ సభల్లో పాల్గొనబోతున్నారనేది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. అయితే ఆయనను నాలుగు నుంచి 22 సభల్లో మాట్లాడించేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉద్ధవ్ మాట్లాడుతూ.. తమ 25 ఏళ్ల అనుబంధాన్ని బీజేపీ ఎందుకు వదులుకుందో ఇప్పటికీ తనకు అర్ధం కాలేదన్నారు. ‘మేం ఎప్పుడూ పొత్తును వదులుకోవాలని ఆలోచించలేదు.
మేం మొదటినుంచి కూటమిని కొనసాగించాలనే ప్రయత్నించాం.. అయితే వాళ్లు మాతో తెగతెంపులు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.. ఈ విషయాలన్నింటి మీద మేం రాష్ర్ట ప్రజల ముందు విశదపరచదలుచుకున్నామంటూ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మోడీ అమెరికా పర్యటన పూర్తి చేసుకునిరాగానే కేంద్ర మంత్రివర్గం నుంచి అనంత్ గీతే తొలగాలా వద్దా అనే విషయమై స్పష్టత వస్తుంది. అసలు తమ కూటమి విడిపోవడానికి కారణమేంటనే విషయమై ఆయనతోనే చర్చించి తేల్చుకుంటాం..’ అని చెప్పారు.
‘సేన’ దసరా ర్యాలీ సీదాసాదాగానే..
సాక్షి, ముంబై: నాలుగు దశాబ్దాలకు పైగా శివాజీపార్క్‌లో శివసేన పార్టీ నిర్వహిస్తూ వస్తున్న దసరా ర్యాలీని ఈ ఏడాది ఎలాంటి ఆర్భాటం లేకుండా సీదాసాదాగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించారు. మాతోశ్రీ బంగ్లాలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుమారు 45 యేళ్ల నుంచి ఏటా దసరా రోజున బాల్ ఠాక్రే కార్యకర్తలకు మార్గదర్శనం చేశేవారన్నారు. కాని ఈసారి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఎందుకని, ప్రసంగం లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ రోజు కేవలం ఆయుధ పూజ, రావణుడి దిష్టి బొమ్మ దహనం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఠాక్రే స్పష్టం చేశారు.
బీజేపీ స్థానిక నాయకత్వంపై ఉద్ధవ్ వ్యంగ్య వ్యాఖ్యలు
Published Wed, Oct 1 2014 10:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement