అప్పుడు మీకు ఆయన గుర్తుకు రాలేదా?
ముంబై: బాల్ ఠాక్రేకు నివాళిగా ఆ పార్టీని విమర్శించనని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హిందుత్వ విలువల ఆధారంగా కుదిరిన పాతికేళ్ల బీజేపీ-శివసేనల పొత్తును తెంచుకోకుండా కొనసాగించి ఉంటే బాల్ ఠాక్రేకు అసలైన నివాళి అయ్యేదని సోమవారం తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. ‘బాలాసాహేబ్‌పై గౌరవంతో శివసేనను విమర్శించనని మోదీ అన్నారు. మాకు కూడా ప్రధాని అంటే గౌరవముంది. అయితే ఎన్నికలకు కొన్నిరోజుల ముందు చిన్న విషయమైన సీట్ల పంపకంలో మీరు మాకు వెన్నుపోటు పొడిచినప్పుడు బాల్ ఠాక్రేపై గౌరవం ఎక్కడికి పోయింది? పొత్తును తెంచుకునే ముందుకు మీకు ఆయన గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించింది.
కాంగ్రెస్, ఎన్సీపీలు మహారాష్ట్రను లూటీ చేశాయని, ఈ విషయంలో బీజేపీ కూడా వాటి దారిలో నడుస్తోందని వ్యాఖ్యానించింది. ‘గుజరాత్ సీఎం ఆనందీబెన్ మహారాష్ట్రకు ఎందుకొచ్చారు? అన్ని పరిశ్రమలను గురుజాత్‌లోనే పెట్టాలని ఆమె పారిశ్రామికవేత్తలను అడగడం మహారాష్ర్టను లూటీ చేయడం కిందికే వస్తుంది’ అని విమర్శించింది. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి మహారాష్ట్రను చీల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడింది.ప్రస్తుతం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని బీజేపీ ఎన్నికలకు వాడుకోవాలని చూస్తోందని శివసేన విమర్శించింది. గతంలో ఎప్పుడూ శివాజీ వార్షికోత్సవాన్ని జరపని బీజేపీ తాజాగా ఆయన పేరును తెరపైకి తీసుకురావడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది.