సాక్షి, ముంబై: అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానా శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్వం జరిగిన 20 రోజుల్లో ఉద్ధవ్ బీజేపీతో చేరుతారని జోస్యం చెప్పారు. జూన్ 20లోపు ఉద్ధవ్ వర్గం శివసేన ఎన్డీయే కూటమిలో చేరబోతుంని తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భార్య నవనీత్ కౌర్‌తో ఎమ్మెల్యే రవి రానా
‘నేను నమ్మకంగా చెప్పగలను. కేంద్రలో మోదీ మళ్లీ ప్రధాని అయిన 20 రోజుల్లో ఉద్దవ్ ఠాక్రే మోదీ ప్రభుత్వంలో కలుస్తారు. రాబోయే కాలం మోదీదే.. ఆ విషయం ఉద్దవ్‌కు కూడా తెలుసు. బాబాసాహెబ్ థాక్రే ఆలోచనలు ముందుకు తీసుకెళ్తేది మోదీనే. ఉద్దవ్ కోసం ప్రధాని మోదీ ఓ కిటికీ ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. ఈ విషయం మోదీనే స్వయంగా చెప్పారు కూడా. బీజేపీలో చేరేందుకు ఉద్ధవ్ ఈ ‘విండో’ను ఉపయోగించుకుంటారు’ అని పేర్కొన్నారు.
గతంలోనూ శివసేన, ఎన్సీపీ నుంచి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వైదొలుగుతారని తాను ఖచ్చితంగా చెప్పానని, తరువాత అదే జరిగిందని అన్నారు. కాగా ఎన్సీపీ వ్యవస్థాపకుడు, శరద్ పవార్‌తోపాటు ఉద్దవ్ ఠాక్రేలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాని ఇటీవల మోదీ కోరారు. కాంగ్రెస్‌లో విలీనమై కనుమరుగవడం కంటే బీజేపీలో చేరడం మేలని అన్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యాయతను తాను ఎప్పటికీ మరచిపోలేనని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment