Sakshi Guest Column On Sharad Pawar Biography And Political Career In Telugu - Sakshi
Sakshi News home page

Sharad Pawar Biography: ఆది నుంచి ఫిరాయింపులే!

Published Sun, Jul 16 2023 12:13 AM | Last Updated on Sun, Jul 16 2023 12:21 PM

Sakshi Guest Column On Sharad Pawar

1958 నాటి సంగతి; పూనా(ఇప్పుడు పుణె) సిటీ, ‘బృహన్‌ మహారాష్ట్ర కాలేజి ఆఫ్‌ కామర్స్‌’లో స్టూడెంట్స్‌ యూనియన్‌ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇరు ప్యానల్‌ అభ్యర్థులు చివరి రోజు రాత్రి తమ తమ విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు. ఓటమిని శంకించిన ఓ గ్రూప్‌ లీడర్‌ ఒక పథకం వేశాడు. ఆ రోజు మధ్య రాత్రి, ఆయన ఓ నలుగురు మిత్రులతో హాస్టల్‌ గదుల్లో  నిద్రిస్తున్న కొందరు రైవల్‌ గ్రూప్‌ విద్యార్థులను నిద్ర లేపి తమ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా బతిమాలాడు. బదులుగా, తన టీం గెలిచిన వెంటనే కాలేజి యాజమాన్యంతో సంప్రదించి వారి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చాడు. తెల్లవారే వరకు ఈ ప్రచారం నడిచింది. మరుసటి రోజు జరిగిన ఎన్నికల్లో ఆయన టీం గెలిచింది. ఆ టీమ్‌ లీడర్‌ మరెవరో కాదు– శరద్‌ చంద్ర గోవిందరావ్‌ పవార్‌. 

కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన శరద్‌ రావ్‌ నేరుగా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్త అయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎదిగి, తన 27వ ఏట (1967లో) ఎమ్మెల్యేగా ఎన్నికై  వైబీ చవాన్‌ ఆశీస్సులతో మొదటిసారి రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి (1972) కూడా అయ్యారు. 1977 లోక్‌ సభ ఎన్నికలలో జనతా పార్టీ ప్రభంజనంతో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోవటమే కాక, నిలువునా చీలి రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్‌ (1978)గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1978లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ  ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సాధించక పోవటంతో, రెండు కాంగ్రెస్‌ పార్టీలూ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

వసంత్‌ దాదా పాటిల్‌ (రెడ్డి కాంగ్రెస్‌) ముఖ్య మంత్రి అయ్యారు. శరద్‌ పవార్‌ రెవెన్యూ మంత్రిగా ఆయన క్యాబినెట్‌లో చేరారు. కొన్ని రోజులకే,  జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌ (మాజీ కాంగ్రెస్‌ యంగ్‌ టర్క్‌ లీడర్‌) స్నేహాన్ని ఆసరా చేసుకుని, యంగ్‌ పవార్‌ కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పార్టీని వీడి, ప్రతిపక్ష జనతా పార్టీ మద్దతుతో తన 38వ ఏట (జూలై, 1978) ముఖ్య మంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

తెల్లబోవటం కాకలు తీరిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వంతైంది. ఇందిరా గాంధీ 1980లో కేంద్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో శరద్‌ పవార్‌ సీఎం పదవి కోల్పోయారు. ఆ తర్వాత ‘కాంగ్రెస్‌ (సెక్యులర్‌)’ పేరుతో కొంత కాలం ప్రాంతీయ పార్టీ నడిపించారు పవార్‌ సాబ్‌. ఇందిరాజీ హత్య తరువాత రాజీవ్‌ గాంధీ పవార్‌ను, తన పార్టీ బలగంతో తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. 1988 జూన్‌లో శరద్‌ పవార్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

1991లో నాగపూర్‌ అసెంబ్లీ సమావేశాల్లో, శివసేన పార్టీ అంతర్గత కుమ్ములాటను గమనించి, ఆ పార్టీ ఓబీసీ నేత చగన్‌ భుజ్‌బల్, మరో 16 మంది శివ సేన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ తీర్థం ఇప్పించారు సీఎం పవార్‌.  ఆయన పర్యవేక్షణలో అలా శివసేన నుండి మొదటిసారిగా ‘వలసలు’ ప్రారంభమయ్యాయి. ఇక పదేళ్ల అనంతరం (2001) కొంతమంది పార్టీ నాయకులను తీసుకొని కాంగ్రెస్‌కు మరోసారి తిలోదకాలు ఇచ్చి, ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ’ (ఎన్సీపీ)ని స్థాపించారు. 

1989 నుండి మూడు దశాబ్దాల వరకు హిందూత్వ భావజాలం పులుముకున్న శివసేన – భారతీయ జనతాపార్టీలు ప్రతీ ఎన్నికలోనూ కలిసే పోటీ చేశాయి. 1995–2000 ఈ కూటమి ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేసింది. ఇక 2019 ఎన్నికల్లో ఈ కూటమి 161 సీట్లు గెలవటంతో సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది, కాని అది కుదర్లేదు. కారణం, ముఖ్యమంత్రి పదవి తమకే చెందాలని 56 సీట్లు గెలుచుకున్న శివసేన మారాం చేయడమే.

ఇంతలో ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్, తన బాబాయి సీనియర్‌ పవార్‌ను కాదని భాజపాతో చేతులు కలిపారు. ఫలితంగా భాజపా నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం, అజిత్‌ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పడింది. తనను విడిచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను పవార్‌ సాహెబ్‌  చాకచక్యంగా తిరిగి తన గూటిలోకి చేర్చుకోవటంతో అజిత్‌ పవార్‌ పాచిక పారలేదు. ఇక సంఖ్యా బలం కోల్పోయిన ఈ కొత్త ప్రభుత్వం, 60 గంటల్లోనే (26.11.2019న) పడిపోవటం విశేషం.

ఆ తర్వాత శరద్‌ పవార్‌ రంగంలోకి దిగి, తనదైన శైలిలో చకచకా పావులు కదిలించారు. ‘మహా వికాస్‌ అఘాడి’ పేరుతో శివసేన (56), ఎన్‌సీపీ (54), కాంగ్రెస్‌ (44) కూటమిని ఏర్పాటు చేసి, శివసేన కోరిక మేరకే ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా (28.11.2019) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో 105 స్థానాలు గెలిచిన భాజపా ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. దిగ్భ్రాంతికి గురైన భాజాపా తనతో శివసేనకు ఉన్న మూడు పదుల దోస్తీని తుంచిన శరద్‌ పవార్‌తో పాటు, శివసేన అధినాయకుడు ఉద్ధవ్‌కూ గుణపాఠం నేర్పాలని పకడ్బందీగా ప్లాన్‌ చేసింది.

45 ఏళ్ల క్రితం పవార్‌ రచించిన రాజకీయ స్క్రిప్ట్‌నే ఆదర్శంగా తీసుకొని 2022 జూన్‌లో ఏక్‌నాథ్‌ శిందేని ఉపయోగించి శివసేననూ, 2023 జూలైలో అజిత్‌ పవార్‌ను ఉపయోగించి ఎన్‌సీపీని... చీల్చి కొత్త ప్రభుత్వాల ఏర్పాటును దిగ్విజయంగా పూర్తి చేసి ‘టిట్‌ ఫర్‌ టాట్‌’ అంది భారతీయ జనతా పార్టీ. ఔను మరి, మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు (శివసేన, ఎన్‌సీపీ) సంస్థాపరంగా చెదిరి, కోలుకోలేని స్థితిలో, తెరచాప తెగిన నావలా మారాయి. 

చివరిగా, క్యాన్సర్‌ జబ్బుకు ‘షికార్‌’ అయినప్పటికీ, 83 ఏళ్ల సీనియర్‌ నేత శరద్‌ చంద్ర పవార్, ‘నా టైర్డ్‌ హు, నా రిటైర్డ్‌ హు’ అంటూ, ధీమాగా సానుభూతి కోసం (ఓటు బ్యాంకు), రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఇప్పుడు సుడిగాలి ప్రచారం మొదలు పెట్టారు. తన ఫార్ములా తనకే బెడిసి కొట్టడంతో ఏర్పడ్డ (రాజకీయ) గాయం, మరో వైపు పార్టీ అనుయాయులు తననే పార్టీ అధ్యక్ష పదవి నుండి వెలివేయటంతో ఒంటరి పక్షి అయ్యారు. ఈ సంక్షోభం నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి మరి!

(శరద్‌ పవార్‌ స్వీయచరిత్ర ‘ఆన్‌ మై టర్మ్స్‌’, వైభవ్‌ పురంధరే రాసిన ‘ది రైజ్‌ ఆఫ్‌ ది శివసేన’ ఆధారంగా)
జిల్లా గోవర్ధన్‌ 
వ్యాసకర్త విశ్రాంత పి.ఎఫ్‌. కమిషనర్‌ ‘ 9819096949

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement