అధికారం పోయింది, మరి పార్టీ? | Dr. Seshadri Chari Article on Latest Developments in Maharashtra Politics | Sakshi
Sakshi News home page

అధికారం పోయింది, మరి పార్టీ?

Published Fri, Jul 8 2022 7:46 AM | Last Updated on Fri, Jul 8 2022 7:46 AM

Dr. Seshadri Chari Article on Latest Developments in Maharashtra Politics - Sakshi

మహారాష్ట్ర తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాకరేకు దక్కిందేమిటి? శివ సైనికుడైన ఏక్‌నాథ్‌ శిందేకు మహారాష్ట్ర అత్యున్నత పదవి లభించడం ఠాకరే కుటుంబా నికి చెంపపెట్టు అనడంలో ఏం సందేహమూ లేదు. ఏక్‌నాథ్‌ శిందేను సీఎం కుర్చీకి ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అధికారిక గుర్తింపునిచ్చింది. ఈ ‘రెబెల్‌’ వర్గం మహా రాష్ట్రలో అసలైన శివసేనగా ఎదుగుతుంది. శిందే వర్గ మిప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎన్నికల కమిషన్‌ దగ్గరకు వెళ్లి శివసేన ఎన్నికల గుర్తు విల్లూ బాణాన్ని తమకు కేటాయించాల్సిందిగా కోరగలదు. 

నమ్మకస్థులని అనుకున్న వాళ్లే తనను వదిలేసి నప్పుడే ఉద్ధవ్‌ భవిష్యత్తును ఊహించి ఉండాల్సింది. పైగా నష్ట నివారణ చర్యలు తీసుకోకపోగా... కొడుకు ఆదిత్యనాథ్, పార్టీ వాగుడుకాయ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ ద్వారా కుప్పకూలిపోతుందని స్పష్టంగా తెలిసినా ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రెండున్నర ఏళ్ల క్రితం బీజేపీ అధికారం చేపట్టేందుకు ఉద్ధవ్‌ అంగీకరించి ఉంటే సీఎంగా రెండు న్నరేళ్లు ఆయన కొనసాగి ఉండేవారు. ఒకవేళ రెండున్న రేళ్ల తరువాత పదవి నుంచి తప్పుకొనేందుకు బీజేపీ నిరాకరించి ఉంటే, బీజేపీ ద్వంద్వ ప్రమాణా లను ఎత్తి చూపే అవకాశం దక్కేది. అలా చేసి ఉంటే పార్టీ విడిపోయే ప్రమాదం కూడా తప్పి ఉండేదేమో! లేదా ఏ సైద్ధాంతిక అంశాన్ని అయినా ఎంచుకుని ఉద్ధవ్‌ బీజేపీ భాగస్వామ్యాన్ని నిరాకరించి ఉండవచ్చు. ఔరం గాబాద్‌ పేరు శంభాజీ నగర్‌గా మార్చేదైనా ఒక అంశం అయ్యుండేది. అధికారం వదులుకునే క్రమంలో ఉద్ధవ్‌ తీసుకున్న చివరి నిర్ణయం ఇదే కావడం ఇంకో వైచిత్రి. 

1994లో బీజేపీ, శివసేన రెండూ వేర్వేరుగా ఎన్నికల బరిలో దిగినప్పుడు శివసేన ఇచ్చిన హామీల్లో ఒకటి ఔరంగాబాద్‌ పేరు మార్చడం. హిందుత్వ అనుకూలమైన ఈ వాగ్దానమే సేనకు ఓట్ల వర్షం కురిపించింది. గాంధియన్‌ సోషలిజమ్‌ విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ ఘోరమైన ఓటమి తరువాత బీజేపీ తన తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేసింది. బాల్‌ ఠాకరే నేతృత్వంలోని శివసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు కారణంగా బీజేపీ తన హిందుత్వ అజెండాను రాష్ట్రం నలుమూలలకూ విస్తరించగలిగింది. శివసేనకు కూడా ఈ సందర్భంలోనే ఉత్తర/దక్షిణ భారతదేశాల వ్యతిరేకత కలిగిన పార్టీ అన్న ముద్రను చెరిపేసు కునేందుకు మంచి అవకాశం లభించింది. బాల్‌ ఠాకరే సంపాదించిన రాజకీయ బలం మొత్తాన్నీ 22 ఏళ్ల తరువాత కాంగ్రెస్, ఎన్‌సీపీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఉద్ధవ్‌ వృథా చేసినట్లు అయ్యింది. ఆదిత్య ఠాకరేను తన వారసుడిగా శివసేన అధ్యక్షుడిగా ప్రకటించేందుకు తొందరపడటం కూడా పార్టీ సీని యర్‌ నేతల తీవ్ర విమర్శలకు కారణమైంది. 

నిజానికి బాల్‌ ఠాకరే ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రకమైన అధికారమూ చేపట్టలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు సొంత కుమారుడిని కాదని పార్టీ సీనియర్‌ నేత, నమ్మకస్థుడైన మనోహర్‌ జోషీ పేరు ప్రతిపాదించారు. ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఉద్ధవ్‌కు అధికారం లేకుండా పోయింది. అదే సమయంలో మహారాష్ట్ర మొత్తాన్ని శాసించిన కుటుంబ వారసుడిగా ఉన్న గౌర వమూ పోయింది. మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ ప్రభుత్వ పతనం తరువాత శివసేన, ఎన్‌సీపీ రెండూ ఇప్పుడు తీవ్ర సవాలు ఎదుర్కొంటున్నాయి. అయితే మహా రాష్ట్రను మళ్లీ పట్టాలెక్కించడం ప్రభుత్వానికీ అంత సులువైన పనేమీ కాబోదు. ఉద్ధవ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం వెళుతూ వెళుతూ దాదాపు 390 నోటిఫి కేషన్లు జారీ చేసింది. వీటిల్లో అత్యధికం ప్రభుత్వం మైనార్టీలో ఉందని నిర్ధారణ అయిన తరువాతే జరిగి నట్లు తెలుస్తోంది. కాబట్టి వీటన్నింటినీ ఛాలెంజ్‌ చేయడం గ్యారెంటీ! 


డాక్టర్‌ శేషాద్రి చారి 
వ్యాసకర్త ‘ఆర్గనైజర్‌’ పత్రిక మాజీ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement