నేడు జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఇవి పాత కొత్త పార్టీలకు అస్తిత్వ పోరాటంగా మారాయి. ఎందుకంటే, శివసేన, ఎన్సీపీ రెండింటిలోనూ అతి పెద్ద చీలికలు జరిగాయి. పైగా ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నాలను ఉంచుకున్నాయి.
ఇది ఓటర్లలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీనికితోడు, డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశవాదం ఈ ఎన్నికల్లో గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తున్నాయి. 2024లో దేశంలో జరిగిన పంటనష్టంలో 60 శాతం మహారాష్ట్రలోనే సంభవించింది. అయినా స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై పార్టీలు ఆధారపడటం పెరిగింది. ఇది సంక్షేమ ఎజెండాకు ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతోంది.
అనేక రాజకీయ ఒడుదొడుకులు, నిట్టనిలువు చీలికలు, ప్రముఖ నాయకుల అడ్డగోలు దారులు, అధికారం కోసం నిరంతర పోరు వంటి వాటిని చూసిన తర్వాత, మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు ప్రముఖ పార్టీలు నేడు (నవంబర్ 20) అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు అనేక విధాలుగా విశేషమైనవి. ఎందుకంటే ఇవి రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికల, రాజకీయ చర్చను రూపొందించే అవ కాశం ఉన్న కొన్ని కీలకమైన తప్పులను బహిర్గతం చేశాయి. ఈ కథనం అటువంటి ఐదు తప్పులను, అవి విసిరే సంక్లిష్ట సవాళ్లను అందిస్తుంది.
1. ఉచితాలపై ఆధారపడటం: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలన్నీ ‘మాఝీ లడ్‌కీ బహిన్ యోజన’, ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు, సీనియర్ సిటిజన్ లకు ఉచిత తీర్థయాత్రలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకున్నాయి. ఉచితాలు ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇలాంటి ప్రకట నలపై ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య పోటీ కనిపిస్తోంది.
ఈ పథకాలు చాలావరకు రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగం మందిగా ఉన్న మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై ఆధారపడటం అనేది విపరీతంగా పెరుగుతోంది. ఇది రాష్ట్రంలో సంక్షేమ ఎజెండాకు సమర్థంగా ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతుంది. ఎందుకంటే, గతంలో మహిళల భద్రత, శ్రేయస్సుపై ఆదుర్దా, ఆందోళనలు కనబడేవి.
గత రెండు దశాబ్దాలుగా, కీలక అభివృద్ధి సూచికలలో మహారాష్ట్ర కిందికి జారిపోయింది. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం, మహారాష్ట్ర స్థూల దేశీ యోత్పత్తి వృద్ధి గత 14 సంవత్సరాలలో రెండు శాతం పాయింట్లు పడిపోయింది. ‘వార్షిక విద్యా నివేదిక– 2022’ ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంకగణితం, పఠన నైపు ణ్యాలలో మునుపటి కంటే చాలా పేలవంగా ఉన్నారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ నుండి వెలు వడిన ‘భారతదేశ నిరుద్యోగ నివేదిక–2023’ మహా రాష్ట్రలో విద్యావంతులైన నిరుద్యోగిత నిష్పత్తి 2022లో 15 శాతంగా ఉందని పేర్కొంది. దశాబ్దం క్రితం కంటే ఇది 11 శాతం పెరుగుదల. ఈ ప్రాథ మిక ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, పార్టీలు ఎన్నికల లాభాల కోసం ఉచితాల మీద దృష్టి పెడుతున్నాయి.
2. కరిగిపోయే పొత్తులు, మారుతున్న విధేయతలు: 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాషాయ కూటమి (భారతీయ జనతా పార్టీ, శివసేన) విచ్ఛిన్నం కావడం ‘మహా వికాస్ ఆఘాడీ’ ఏర్పాటుకు దారితీసింది. ఇది చాలా భిన్నమైన సిద్ధాంతాలు గల పార్టీల (కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్–ఎన్సీపీ, శివసేన) మధ్య అసహజ కూటమి. వారి ప్రభుత్వం స్వల్పకాలికంగా పనిచేసింది. పైగా మనం శివసేన, ఎన్సీపీ రెండు పార్టీలలో అతిపెద్ద చీలికలను చూశాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో చేతులు కలిపేందుకు రెండు పెద్ద భాగస్వామ్యాలు సిద్ధమైనాయి.
భారత రాజకీయాల్లో ఇలాంటి ఫిరాయింపులు అసాధారణం ఏమీకాదు. కానీ ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నా లను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందర గోళాన్ని సృష్టించింది. ఇది సాధారణంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించే దీర్ఘకాలిక పొత్తులు, సైద్ధాంతిక ప్రాధాన్యతలు, కేడర్ విధేయతలు వంటి సాంప్రదాయ సమీకరణాలను పూర్తిగా బలహీనపరిచింది. ఇది మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని దెబ్బ తీసింది. డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశ వాదం గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తు న్నాయి.
3. వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ– ప్రేరిత సవాళ్లను పట్టించుకోకపోవడం: 2024లో దేశంలో జరిగిన పంట నష్టంలో 60 శాతం మహా రాష్ట్రలోనే సంభవించిందని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. దాదాపు సగం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ ప్రేరిత సవాళ్లను పరిష్క రించడానికి సమష్టి కృషి జరగలేదు.
రుణమాఫీ వంటి తక్షణ చర్యలకు మించి దీన్ని పరిష్కరించ డానికి రాజకీయ పార్టీలకు కచ్చితమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ మూలాలు ప్రధానంగా వ్యవసాయా ధారిత మరాఠా సమాజం ఎదుర్కొంటున్న సామా జిక–ఆర్థిక సవాళ్లలో ఉన్నాయి. భారీగా ఉన్నసంఖ్యను బట్టి, ఎన్నికల వేడిలో వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మూల కార ణాన్ని పరిష్కరించడంలో రాజకీయ పార్టీలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.
4. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం: మహా రాష్ట్రలోని పలు స్థానిక సంస్థలకు గత రెండు నుంచి ఐదేళ్లుగా ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 29 మున్సిపల్ కార్పొరేషన్లు (రెండు కొత్తవి), 200 కంటే ఎక్కువ మున్సిపల్ కౌన్సిళ్లు, 27 జిల్లా సమి తులు ఉన్నాయి. బొంబాయి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగలేదు.
స్థానిక సంస్థల ఎన్నికలలో జాప్యం వల్ల స్థానిక పరి పాలనా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక నియంత్రణను సాధించేలా చేసింది. ఇది అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం క్షీణించడం గురించిన ఆందోళనలకు దారితీసింది. స్థానిక సంస్థల పరిధిలోని కొన్ని విధాన నిర్ణయాలు రాజకీయ పరిశీలనల ద్వారా ఎక్కువగా ప్రభావితమవు తాయి. ‘గట్టర్, మీటర్, నీరు’ (మురుగునీటి పారు దల, విద్యుత్, నీరు)కు సంబంధించిన సాధారణ పౌరుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎందుకంటే వాటిని పరిష్కరించడానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు.
5. అభివృద్ధి విధానం: ఇటీవలి సంవత్స రాలలో, మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, బుల్లెట్ రైలు వంటి ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మహారాష్ట్ర గణనీయమైన ప్రాధాన్య మిస్తోంది. ఈ విధానం పెద్ద స్థాయి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తుంది. స్థానిక రైల్వేలు, ప్రభుత్వ ఆధీ నంలో నడిచే రోడ్డు రవాణా, అందుబాటులో ఉండే పబ్లిక్ రోడ్లు వంటి విస్తృత జనాభాకు మరింత నేరుగా ప్రయోజనం చేకూర్చే అవసరమైన సేవ లను బలోపేతం చేయాల్సిన ఖర్చుతో ప్రైవేట్, ఉన్నత వర్గాల ఆసక్తులకు ఎక్కువ ప్రాధాన్యత కనబడుతోంది.
2024 మహారాష్ట్ర ఎన్నికలు పాత, కొత్త పార్టీలు, నాయకులు, పొత్తులకు అస్తిత్వయుద్ధంగా పరిణమించాయి. కానీ అంతకుమించి, ఇది ఓటర్లకు నిజమైన పరీక్ష అవుతుంది. ఎందుకంటే వారి ఎంపికలే రాబోయే దశాబ్దాల రాష్ట్ర రాజకీ యాల గమనాన్ని నిర్ణయిస్తాయి.
– సంజయ్ పాటిల్ ‘ రాజకీయ పరిశోధకుడు
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment