యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి నువ్వా-నేనా అన్నట్టుగా ఎన్నికల్లో పోరాడాయి. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన అత్యధిక ఎగ్జిట్స్ పోల్స్ మహాయుతి కూటమే విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న బీజేపీ, శివసేన (ఉద్దవ్ వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్) నేతృత్వంలోని కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.
..మరోవైపు ఎన్నికల్లో విజయంపై అటు ప్రతిపక్ష కూటమి మహ వికాస్ అఘాడీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా లేకపోయినా.. ఫలితాల అనంతరం ఎంవీఏ కూటమే అధికారం చేపడుతుందని భావిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన నేపథ్యంలో మహారాష్ట్రలోనూ సర్వేల ఫలితాలు తారుమారు అవుతాయని గట్టిగా నమ్ముతోంది. ఇక మరో 24 గంటల్లో మహారాష్ట్ర భవితవ్యం తేలనుంది. నవంబర్ 23న అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి.
అయితే ఫలితాల ముందే అటు మహాయూతి, ఇటు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు నుంచి ఇరు వర్గాలు తమ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తమ పార్టీ నాయకత్వంలోనే మహారాష్టట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని ఓటింగ్ ట్రెండ్‌లు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలను మిత్రపక్షమైన శివసేన(ఉద్దవ్) ఖండించింది. ఎన్నికల్లో ఎంవీఏ మెజారిటీ పొందిన తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా చర్చించ నిర్ణయం తీసుకుంటామని స్పఫ్టం చేశారు. పటోలే ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దాని అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా అదే విషయాన్ని ప్రకటించాలని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
అటు మహాయుతి కూటమిలో శివసేన ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముఖాముఖిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నట్లు పేర్కొననారు. పోలింగ్ నాడు ఓటర్లు షిండేకు తమ ప్రాధాన్యతను చూపించారని ఆయనే మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. షిండేనే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సీఎం అవుతారని పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎవరైనా సీఎం అయితే.. అది దేవేంద్ర ఫడ్నవీసే అని తెలిపారు.
ఇక ఎన్సీపీ నాయకుడు అమోల్ మిత్కారీ తన పార్టీ చీ ఫ్ఉ, ప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరును సీఎం చర్చలోకి తీసుకొచ్చారు. ఫలితాలు ఏమైనప్పటికీ, ఎన్‌సిపి కింగ్‌మేకర్ అవుతుందని అన్నారు. మహాయుతి కూటమిలోని అన్ని పార్టీలు కలిసి కూర్చుని సీఎం ఎవరనే నిర్ణయం తీసుకుంటాయని మిస్టర్ ఫడ్నవీస్ తెలిపారు. మొత్తానికి అన్ని పార్టీలు తమ నేతనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ కూటమి అధికారంలోకి వస్తుందది, ఎవరు సీఎం పీఠంపై కూర్చుంటారనేదానిపై రేపటి(శనివారం) ఫలితాల తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment