సాక్షి,బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎమ్ కృష్ణ (సోమనహళ్లి మల్లయ్య కృష్ణ) (92) ఏళ్ల వయసులో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు ఉదయం 2.30 -2.45 గంటల సమయంలో తన నివాసంలో మరణించారు.
ఎస్‌ఎం కృష్ణ అక్టోబర్ 11,1999 నుండి మే 28,2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా, 1993 నుండి 1994 డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. 2009-2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. అయితే, కాంగ్రెస్‌తో దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి స్వస్తి పలికారు. 2017 మార్చిలో బీజేపీలో చేరారు.
పద్మవిభూషణ్ అవార్డ్‌తో
ప్రజా వ్యవహారాల (Public Affairs) రంగంలో ఎస్‌ఎం కృష్ణ అందించిన అసమాన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2023లో పద్మవిభూషణ్ అవార్డ్‌తో సత్కరించింది.
సిలికాన్ సిటీ కేరాఫ్ ఎస్‌ఎం కృష్ణ
కర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఎస్‌ఎం కృష్ణ తన పదవీ కాలంలో ఐటీ రంగంలో చేసిన కృషి వల్లే బెంగళూరు సిలికాన్ వ్యాలీగా అవతరించిందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
జాన్ కెన్నెడీ తరుఫున కృష్ణ ఎన్నికల ప్రచారం
ఎస్‌ఎం కృష్ణ సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ (డల్లాస్), జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. 1960లో మాజీ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ తరుఫున ప్రచారం చేశారు. నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తన తరుఫున ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ 28 కృష్ణకు లేఖ రాశారు. దీంతో ఆయన జాన్ కెన్నెడీ మద్దుతగా ప్రచారంలో పాల్గొన్నారు.
1961లో కెన్నెడీ 35వ అమెరికా అధ్యక్షుడైన తర్వాత కృష్ణ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. 1962లో కృష్ణ.. మద్దూరు నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మాండ్యా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
👉చదవండి : నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు!
Comments
Please login to add a commentAdd a comment