బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ విషయంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది. సీఎం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని
ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పుపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతానని, చివరకు నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, హైకమాండ్ నాకు అండగా నిలిచింది. నా పోరాటాన్ని కొనసాగించేందుకు ప్రోత్సహించాయి. నేను పేదల పక్షాన ఉన్నాను. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందుకు బీజేపీ, జేడీఎస్‌లు నాపై రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుతున్నాయి’ అని మండిపడ్డారు.
అయితే తనపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడంపై చట్టపరంగా ఎదుర్కోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తమ న్యాయ నిపుణలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. 17A కింద విచారణ రద్దు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
‘ఈ రాజకీయ పోరాటంలో రాష్ట్ర ప్రజలు నాకు అండగా నిలుస్తున్నారు. వారి ఆశీస్సులే నాకు రక్షణ. నేను చట్టాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముతాను. ఈ పోరాటంలో ఎట్టకేలకు సత్యమే గెలుస్తుంది. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం. బీజేపీ, జేడీఎస్‌ల ఈ ప్రతీకార రాజకీయాలపై మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. కోర్టుపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి’ అని అన్నారు.
మరోవైపు సిద్దరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీనియర్ నేతలు ప్రియాంక ఖర్గే, రామలింగారెడ్డి తదితరులు మద్దతుగా నిలిచారు. తమ బాస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఆయన 100శాత స్వచ్చమైన సీఎం అని ప్రకటించారు. శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము సీఎంకు అండగా ఉంటాం. ఆయనకు మద్దతు ఇస్తాం. ఆయన ఎల్లప్పుడు రాష్ట్రం, పార్టీ కోసం మంచి పని చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ఇక కోర్టు తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారనుంది. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తం అవ్వనుంది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. సీఎం నిర్మించిన అబద్ధాల సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయిందని.. ఇక గౌరవప్రదంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ’ అని కన్నడలో బీజేపీ పోస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment