
బెంగళూరు: ‘హాయ్..మైనేమ్ ఈజ్ సుజి(పేరు మార్చాం). వాట్ ఈజ్ యువర్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్. ఐ యామ్ సింగిల్...’ అంటూ యువతుల్ని ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని‘హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్ అనే పేరును వింటూనే ఉన్నాం. ఇప్పడీ హనీ ట్రాప్ వలలో సుమారు 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారని ఓ రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ అంశంపై దుమారం చెలరేగింది.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల కర్ణాటకలో ఇద్దురు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహొళి అసెంబ్లీలో వెల్లడించారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారని అన్నారు
అంతేకాదు, సీఎం సిద్ధరామయ్య సన్నిహితుడు, కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నపై రెండు సార్లు హనీట్రాప్ జరిగిందని ఇదే అంశంపై రాష్ట్ర హోంశాఖ విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా నేతల్ని హనీట్రాప్‌లోకి దించడం పరిపాటిగా మారింది. ఈ తరహా రాజకీయాలు చేయకూడదు. కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేస్తున్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలన్నారు.
హనీ ట్రాప్‌పై కేఎన్ రాజన్న మాట్లాడుతూ.. హనీట్రాప్‌లో కనీసం 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కొత్త విషయం కాదు. వారిలో చాలామంది హైకోర్టులో స్టే తీసుకున్నారు. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. హనీ ట్రాప్ సూత్రదారులు, పాత్రదారులెవరో తెలుసుకోవాలని అన్నారు. ప్రస్తుతం, ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ హనీట్రాప్‌పై కర్ణాటక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment