తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే.. తొలిసారిగా ప్రతీకార రాజకీయం
అధికారంలోకి రాగానే.. ప్రత్యర్థులపై పెచ్చు మీరిన వేధింపులు
హక్కుల గురించి ఎవరూ నోరు మెదపడకూడదు!
నోరు తెరిచి ప్రశ్నించినా.. సోషల్ మీడియా పోస్టులు చేసినా జైలుకే!
నిలదీస్తే.. తప్పుడు కేసుల బనాయింపు-అక్రమ నిర్భంధాలు
ఏపీలో ఆరు నెలలుగా.. మానవ హక్కులపైనే కూటమి సర్కార్ సవారీ
ప్రపంచమంతా మానవ హక్కుల దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ(డిసెంబర్ 10న).. ఏపీలో మాత్రం ఆ హక్కులు ఊసేలేకుండా పోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పెంచుకున్న పగను.. అధికారంలోకి రాగానే వెల్లగక్కడం మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే రాష్ట్ర శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగానే.. గత ఆరు నెలలుగా దాడులు, హత్యలు, అత్యాచారాలకు నిలయంగా మారింది. భద్రత కరువైన వేళ బతుకుజీవుడా అనుకుంటూ కొందరు ఏపీని విడిచి వెళ్లిపోతుండగా.. ప్రభుత్వ వేధింపులు భరించలేక మరికొందరు బలవనర్మరణాలకు పాల్పడ్డారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను సైతం వదలకుండా దాడులకు తమ శ్రేణులను ఉసిగొల్పింది కూటమి. ఇక.. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక.. ఆ దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రతిపక్ష నేతలూ, కార్యకర్తల మీద ఏపీ పోలీసులూ.. కూటమి వర్గాల దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. దళితులపైనా దారుణమైన దాడులు జరుగుతున్నాయి. విపక్ష నాయకుల నిరసనలపై ఖాకీల ఆంక్షలు సరేసరి.
‘ఒక మనిషి స్వేచ్ఛగా, గౌరవంగా బతకడానికి కొన్ని హక్కులు అవసరం. జాతి, కుల, మత, వర్ణ, లింగ, రాజకీయపరమైన వివక్షకు గురవ్వకుండా వ్యక్తుల రక్షణ కోసం రూపొందించినవే మానవ హక్కులు. ఆ హక్కులపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అలాంటి ప్రభుత్వమే ఏపీలో ఆ బాధ్యత మరిచి.. హక్కులను కాలరాస్తోంది’
అధికారం చేపట్టాక.. పవన్ కల్యాణ్ ప్రతీకార రాజకీయాల్లాంటివి ఉండబోవని ప్రకటించారు. కానీ, స్వయానా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్‌బుక్ పేరిట ఇష్టారాజ్యానికి దిగారు. ఆ ఎర్రబుక్‌లో ఉన్నవాళ్లను అధికార దుర్వినియోగంతో హింసిస్తున్నారు. తమ అనుకూలురను ప్రొత్సహించే క్రమంలో ఇతరులను బదిలీలు చేయించారు. మాట విననివాళ్లను బలవంతంగా ఇళ్లకు పంపించారు. ఈ పరిణామాలకు భయపడే అధికారులు కళ్లు మూసుకుండిపోయారు.
ఇదీ చదవండి: చంద్రబాబు ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం
ఏవో కొంపలు మునిగిపోయినట్లే!
నచ్చని అంశాలను విమర్శించడం.. ప్రజలకున్న హక్కు. ఆ హక్కు ఎంతంగా వినియోగంలో ఉంటే.. ప్రజాస్వామ్యం అంతగా బలోపేతమవుతుంది. అయితే ఏపీలో రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఏపీలో తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల హామీల గురించి, ప్రజా సమస్యలపై మాట్లాడిన వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.
సాధారణంగా.. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేయడం సహజం. కానీ, కూటమి ప్రభుత్వ కర్కోటక ఏలుబడిలో మాత్రం అది మహాపాపం. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే- ఏవో కొంపలు మునిగిపోయినట్టు కేసులు పెడుతున్నారు. రాజకీయ ఆసక్తితో పోస్టులు చేస్తున్నవాళ్లనూ వదలడం లేదు. అక్రమ కేసులు బనాయిస్తూ.. స్టేషన్ల చుట్టూ తిప్పుతూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆఖరికి.. ఆడపడుచుల విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గుతున్న వాళ్లు కొందరైతే.. ధైర్యంగా పోరాడుతున్నవాళ్లు మరికొందరు.
ఇదీ చదవండి: టీడీపీ వేధింపులతో వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్య
అన్నింటిని మేనేజ్ చేస్తున్న బాబు!
దేశంలో ఎక్కడా లేనంతగా.. చంద్రబాబు సారథ్యంలో ఏపీలో పౌరహక్కుల హననం నిరాటంకంగా సాగుతోంది. ఈ ఆర్నెల్ల కాలంలోనే ఏపీ నుంచి జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు రికార్డు స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్ర పెద్దలకు, గవర్నర్ స్థాయి వాళ్లకు స్వయంగా ఫిర్యాదులు అందజేసింది వైఎస్సార్‌సీపీ. ఇక.. పోలీస్ శాఖకు వెళ్లిన ఫిర్యాదుల సంగతి సరేసరి. అయినా తన పరపతిని ఉపయోగించి చంద్రబాబు ఎక్కడికక్కడే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు.
రాజ్యాంగ నిర్దేశాలను నట్టేట్లో కలుపుతున్న కూటమి ప్రభుత్వం- మానవ హక్కుల హంతకిగా మారింది. ఏపీలో భయోత్పాతాన్ని సృష్టిస్తూ తాను ఆడిందే ఆటగా చెలరేగిపోతోంది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అధోపాతాళానికి దిగజార్చింది. ఇప్పుడు ఏపీలో మానవహక్కులతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు మిగిలింది హక్కుల కమిషన్ల, న్యాయస్థానాల జోక్యం మాత్రమే!.
Comments
Please login to add a commentAdd a comment