Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం! | BJP sets date for Maharashtra oath as Mahayuti deadlock drags on: Sources | Sakshi
Sakshi News home page

Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం!

Published Sat, Nov 30 2024 4:15 PM | Last Updated on Sat, Nov 30 2024 4:54 PM

BJP sets date for Maharashtra oath as Mahayuti deadlock drags on: Sources

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధికార మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్‌ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.

ఈ మేరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం (డిసెంబర్ 2) సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత గురువారం (డిసెంబర్ 5) ముంబైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి.

అయితే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో  అసంతృప్తి చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.

అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పారు. 
చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు

సమావేశాలు భౌతికంగానే కాదు.. వీడియో కాన్ఫరెన్స్‌, మొబైల్‌ కమ్యూనికేషన్‌ ద్వారా కూడా జరుగుతాయి. షిండే చెప్పినట్లుగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గం ఖరారు అవుతుంది. 60 మంది ఎమ్మెల్యేలు కలిసి షిండేను ఉప ముఖ్యమంత్రి  పదవి చేపట్టాలని కోరాం. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. లాడ్లీ బెహన్ యోజనను ప్రవేశపెట్టినందున అతను ప్రభుత్వంలో కొనసాగడం చాలా ముఖ్యం. ప్రభుత్వంలో అతని ఉనికి ముఖ్యం. 

మరోసారి, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్‌  షిండే, అజిత్ పవార్ మధ్య సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై కూలంకషంగా చర్చిస్తాం’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ముంబైలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన భేటీ కావాల్సి ఉండేది. కానీ షిండే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది.

కాగా నవంబర్‌ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 233 స్థానాలను కైవం చేసుకుంది. బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57 చోట్ల, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది.  అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

అయితే సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్‌ తీసుకుంటున్న నేపథ్యంలో  ఏక్‌నాథ్‌షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలపై పట్టుబడుతున్ట్లు తెలుస్తోంది. గతంలో ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా ఉన్న్పుడు హోంమంత్రిత్వ శాఖను కూడా ఆయనే నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement