మహారాష్ట్రలో ‘మహాయుతి’ విజయోత్సవం
విశ్లేషణ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ప్రజలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మెజారిటీ సర్వే సంస్థలు పాలకపక్ష కూటమి ‘మహాయుతి’కి అనుకూలంగానే చెప్పాయి. కానీ, ఇంతటి ఘనవిజయాన్ని అవి కూడా అంచనా వేయలేకపోయాయి. ఈ గెలుపును విశ్లేషిస్తే, ‘మహా వికాస్ ఆఘాడీ’పై మహాయుతి విజయంగా కన్నా... మహాయుతి చేతిలో ఎమ్వీయే ఘోర పరాజయంగా పరిగణించడమే సమంజసం. ఇది విపక్ష కూటమి చేజేతులా తెచ్చుకున్న ఓటమి. మితిమీరిన ఆత్మవిశ్వాసం, కొరవడిన ఎన్నికల వ్యూహం వారికీ గతి పట్టించాయి. అతి విశ్వాసంతో సరైన ‘ఎన్నికల నినాదమే’ లేకుండా కూటమి గుడ్డిపోరు సల్పింది. లోక్‌సభ ఎన్నికల్లో లభించిన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలుపుకోలేక పోయింది.
మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేసిన ట్టుగానే, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ‘మహాయుతి’ ఘన విజయాన్ని సాధించింది. గరిష్ఠంగా ‘పీపుల్స్ పల్స్’ చెప్పిన 195 సంఖ్యను కూడా మించి,ఏకంగా 234 స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ నేతృత్వపు కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
మహారాష్ట్ర ఫలితం ‘ఇండియా కూటమి’కి ఎదురు దెబ్బే అయినా, పార్టీగా కాంగ్రెస్‌కు కోలుకోలేని పెద్ద దెబ్బ. హిమాచల్ ప్రదేశ్ గెలుపు కర్ణాటకలో విజయానికీ, కర్ణాటకలో గెలుపు తెలంగా ణలో విజయానికీ కొంత ప్రేరణ ఇచ్చిన క్రమంలో... 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన స్థానాలను రెట్టింపు చేసుకోగలిగింది. సెంచరీ మార్క్ సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగుదల మిత్ర పక్షాలకూ ప్రేరణ కలిగించి, దేశ రాజకీయాల్లో ‘ఇండియా కూటమి’ బలమైన ప్రత్యామ్నాయంగా నిలువగలిగింది.
అయితే, చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న తరహాలో ‘ఇండియా’ కూటమికి దక్కిన నిన్నటి జమ్ము–కశ్మీర్ గెలుపైనా, ఇవాళ్టి ‘జార్ఖండ్’ విజయమైనా మిత్రుల ఘనతే తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదు. కాంగ్రెస్ సంస్థాగత స్థితి, ఎన్నికల నిర్వహణా సామర్థ్యం దిగదుడుపుగానే ఉంటోంది. 1990లలో బీజేపీ–శివసేన కూటమి రాజకీయాలు మొదలయ్యే వరకు మహారాష్ట్రలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. బీజేపీ–శివసేన శకం ఆధిపత్య క్రమంలో కూడా 2004–14 మధ్య శరద్ పవార్ నేతృత్వంలోని జాతీయవాద కాంగ్రెస్ (ఎన్సీపీ)తో పొత్తుల వల్ల కాంగ్రెస్ మళ్లీ పాలకపక్ష స్థాయికి వచ్చింది. 2014 తర్వాత, ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి, పార్టీ మార్పిళ్లు, రాజకీయ శక్తుల పునరేకీకరణల్లో కాంగ్రెస్ క్రమంగా పలుచబారుతోంది.
కాంగ్రెస్‌ది మహావైఫల్యం
ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకా శాలను దాదాపు అన్ని సర్వే సంస్థలూ అంచనా వేశాయి. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ, మొత్తం పది లోక్‌సభ స్థానాలూ ఓడి పోయిన హరియాణాలో కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికలకు వచ్చేసరికి 5 స్థానాలు గెలిచింది. ఓటు వాటాలోనూ బీజేపీ కన్నా 1 శాతం స్పష్టమైన ఆధిక్యత దక్కించుకుంది. తర్వాతి ఒకటి, రెండు మాసాల్లో కాంగ్రెస్ సానుకూలత మరింత పెరిగినట్టు వివిధ సర్వేల్లో సంకేతా లొచ్చాయి.
కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, మూడోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు ప్రాతిపదికలపై జరుగుతాయనీ, ప్రజాతీర్పు భిన్నంగా వచ్చే ఆస్కారం ఉంటుందనీ కాంగ్రెస్ పాఠం నేర్వనందునే మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తప్పలేదు.
హరియాణా పరిస్థితే మహారాష్ట్రలోనూ ఉండింది. లోక్‌సభ ఎన్నికల్లో 48కి 30 స్థానాలు నెగ్గి మహా వికాస్ అఘాడీ స్పష్టమైన ఆధిక్యత పొందింది. పాలక పక్షంగా ఉండిన మహాయుతికి 17 స్థానాలే లభించాయి. మరాఠ్వాడా వంటి కొన్ని ప్రాంతాల్లో మహా యుతికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆ పరిస్థితిని నిలబెట్టు కోవడమో, మెరుగుపరచుకోవడమో చేయకుండా... తమ గెలుపు ఖాయమైపోయినట్టు ఎమ్వీయే పక్షాలు ధీమా ప్రదర్శించాయి. కూటమి గెలుపు మీద కన్నా ‘ఎవరు ముఖ్యమంత్రి?’ అన్న దానిపైనే వివిధ పక్షాల నేతలు కన్నుపెట్టారు.
సంస్థాగత నిర్వహణ, మిత్రులతో సయోధ్య, ప్రభావవంతమైన నినాదమివ్వడం, ప్రజలకో స్పష్టమైన వాదన (నెరేటివ్) వినిపించగలగడం... ఇలా అన్నింటా విఫల మయ్యారు. ఎన్నికల వేళ ఆ యా ప్రాంతాలకు పార్టీ ఇన్‌చార్జీల నియా మకం కూడా సహేతుకంగా జరుగలేదు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నాయకుడిని ఒక నియోజకవర్గానికి నియమిస్తే, ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థియే పోటీలో లేరు. ప్రత్యర్థి పార్టీ ఓబీసీలతో 60 వేల ‘బృంద సమావేశాలు’ ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకులు స్టార్ హోటళ్లలో దిగి, రూ. 60 వేల బిల్లులు చేశారంతే!
పాత చింతకాయ పచ్చడి
చంకలో పుస్తకం పెట్టుకొని ‘రాజ్యాంగం ప్రమాదంలో ఉంది’ (సంవిధాన్ ఖత్రే మే హై) అన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నినాదం ఈసారి పనిచేయలేదు. ‘బీజేపీ అడుగుతున్నట్టు 400కు పైగా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు గల్లంతవుతాయి’ అని ప్రచారం చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో అది కాంగ్రెస్‌కూ, వారి కూటమికీ లాభించింది. అసెంబ్లీ ఎన్నికలు గనుక... సోయ, పత్తి వంటి రైతాంగ సమస్యలు, కొన్ని ప్రాంతాల వెనుకబాటుతనం, మరాఠా యువత నిరుద్యోగిత వంటి స్థానికాంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది.
మహా వికాస్ ఆఘాడీలోని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) కూడా, తమ పార్టీలను బీజేపీ నిలువునా చీల్చిందన్న పాత నినాదాన్నే ఈ ఎన్నికల్లోనూ ప్రచారాంశంగా ఎత్తుకున్నాయి. అదే అంశంపై లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కలిసి ఎన్నికలకు వెళ్లి, సానుకూల ప్రజాతీర్పు పొందిన తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన... కాంగ్రెస్ –ఎన్సీపీ పంచన చేరడం వారి నైతిక స్థితిని కొంత బలహీనపరిచింది. అందుకే, చీలికల అంశంలో బీజేపీపై నిందలు తాజా ఎన్నికల్లో ఆధిక్యతను ఇవ్వలేకపోయాయి.
వాస్తవిక బలాల ఆధారంగా లోక్‌సభ సీట్ల పంపకాలు చేసుకున్న ఎమ్వీయే కూటమి ఈసారి మాత్రం పొత్తుల్ని కడదాకా తేల్చలేదు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం వల్లనేమో... సీట్ల పంపకాల్లో సయోధ్యకు నీళ్లొదిలారు. కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో 11 బీజేపీతో నేరుగా తలపడ్డ స్థానాలే. అయినా, ఆ పార్టీతో పోలిస్తే విజయశాతం అట్టడుగున ఉంది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కూడా ప్రత్యర్థి కూటమి పక్షాలైన శివసేన (షిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి.
దిద్దుబాటు చర్యలతో...
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టిన మహాయుతి కూటమి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, 18–59 మధ్య వయస్కులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చెల్లిస్తూ చేపట్టిన ‘మాజీ–లడ్కీ–బహెన్’ పథకం తిరుగు లేని ఆధిక్యతనిచ్చింది. మహిళా ఓటింగ్ 6 శాతం పెరగటం ఇందు కొక సంకేతమే! తాము తిరిగి గెలిస్తే దాన్ని రూ. 2,100లకు పెంచుతామన్న ‘మహాయుతి’ హామీ 2.4 కోట్ల కుటుంబాలకు ఆశ కల్పించింది. దానికి తోడు ‘ఓట్ జిహాద్’, ‘బటేంగే తో కటేంగే’ నినాదాలు, ఆ దిశలో చేసిన ప్రచారం హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడంలో ప్రభావం చూపాయి.
బీజేపీ యంత్రాంగానికి తోడు ఆర్‌ఎస్‌ఎస్ ఈ ఎన్నికల్ని ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని పనిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాల్లో ప్రతికూలంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గమనించిన బీజేపీ, ఓబీసీల మద్దతు కూడగట్టడంపై పెట్టిన శ్రద్ధ కలిసొచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను అమలు చేయట్లేదంటూ చేసిన ‘ప్రతి ప్రచారం’తో, ఎమ్వీయే కూటమి హామీ లపై సందేహాల్ని రేకెత్తించడంలో మహాయుతి పైచేయి సాధించింది. అంతిమంగా మహారాష్ట్ర ఫలితం ‘మహాయుతి’ భారీ విజయాన్ని మించి, ‘మహా వికాస్ ఆఘాడీ’ ఘోర పరాజయంగా మిగిలింది.
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment