మహా కూటమిలో ‘ముఖ్య’ విభేదాలు | Sakshi Guest Column On Congress Party Alliance differences | Sakshi
Sakshi News home page

మహా కూటమిలో ‘ముఖ్య’ విభేదాలు

Published Fri, Jul 5 2024 2:40 AM | Last Updated on Fri, Jul 5 2024 2:40 AM

Sakshi Guest Column On Congress Party Alliance differences

విశ్లేషణ

ముఖ్యమంత్రి అభ్యర్థి, సీట్ల పంపకం అంశాల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)లో విభేదాలు కనిపిస్తున్నాయి. రానున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన–ఉద్ధవ్‌ గ్రూపు, కాంగ్రెస్‌ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వీటి మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, మొత్తం 288 స్థానాలకు గానూ తలా 95 స్థానాల్లో పోటీ చేయాలనేది! కానీ ఉద్ధవ్‌ పార్టీ 150 సీట్లలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఎంవీఏ ముఖ్యమంత్రి ముఖం ఉద్ధవ్‌ అని ఆయన గ్రూపు ప్రతినిధి వ్యాఖ్యానించడమూ, అలాంటి ముఖం ఏదీ లేదని శరద్‌ పవార్‌ అనడమూ, మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలేను ముఖ్యమంత్రి ముఖంగా చెబుతూ పోస్టర్లు వెలియడమూ కూటమి మధ్య జరగనున్న ఘర్షణను సంకేతిస్తున్నాయి.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సభ్యులు సాధించిన అధిక ఓట్ల శాతం, మహారాష్ట్రలో ప్రతిపక్షాల చేతిలో తుపాకి గుండులా పనిచేసింది. అది వారికి ఎంత విశ్వాసాన్ని కలిగించిందంటే, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం గురించి, రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోటీ గురించి అనేక అంశాలపై పరస్పరం వివాదాలకు దిగుతూ కనిపిస్తున్నారు. ఎంఏవీ భాగస్వాములు ఇటీవల ముంబైలో మీడియా ముందు ఐక్యతా ముఖాన్ని ప్రదర్శించి ఉండవచ్చు; కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు ముంబై వంటి ముఖ్య నగరాల్లోని కీలక నియోజకవర్గాలపై కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు.

‘ముఖ్యమంత్రి ముఖం’ ఎవరు?
విధాన్‌ భవన్‌లో ఈ మంగళవారం కూటమిలో పగుళ్లు స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఉద్ధవ్‌ ఠాకరేకు చెందిన శివసేన పార్టీ, ఆకస్మికంగా పార్టీ కార్యదర్శి మిలింద్‌ నార్వేకర్‌ను జూలై 12 నాటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేయమని కోరింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం చూస్తే మహా వికాస్‌ అఘాడీకి కేవలం రెండు సీట్ల కోటా మాత్రమే ఉంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ ఈ కోటాలో ఒక సీటును ‘పీజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ (పీడబ్ల్యూపీ)కి ఇవ్వాలని అనుకున్నారు. 

అయితే, ఉద్ధవ్‌ 12వ తేదీన పోటీని అనివార్యం చేస్తూ తన సొంత అభ్యర్థి ఎంపికతో ముందుకు సాగారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజక వర్గంలో ఉద్ధవ్‌ తన పార్టీ పోటీ చేస్తుందని పట్టుబట్టారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మల్లయోధుడు చంద్రహర్‌ పాటిల్‌కు ఉద్ధవ్‌ పార్టీ టిక్కెట్‌ ఇచ్చారు. కానీ అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత విశాల్‌ పాటిల్‌ మంచి ఆధిక్యతతో గెలుపొందారు.

రాష్ట్రంలోని 150కి పైగా నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని ఉద్ధవ్‌ కోరినట్లు శివసేన–ఉద్ధవ్‌ గ్రూపు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో జరిగిన కూటమి సమావేశంలో మహావికాస్‌ అఘాడిలోని ముూడు భాగస్వాములు ఒక్కొక్కటీ 95 స్థానాల్లో పోటీ చేస్తాయని విస్తృత అవగాహన ఉన్నప్పటికీ, శివసేన–ఉద్ధవ్‌ గ్రూపు 150 నియోజకవర్గాల్లో ఎందుకు సర్వే చేస్తోందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. గత వారం శివసేన ఫైర్‌ బ్రాండ్‌ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్‌ ఠాకరే ముఖ్యమంత్రి పదవికి కూటమి తరపు అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. 

ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ వెంటనే, తమ కూటమిలో సీఎం అభ్యర్థిని ముందుగానే నిర్ణయించబోమని స్పష్టతనిచ్చారు. ‘‘మేము కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బలంతో ఎన్నికల్లో పోరాడతాం. మా అందరికీ ఉమ్మడి బాధ్యత ఉంది. ప్రస్తుతానికి సీఎం ముఖం అంటూ ఏమీ లేదు’’ అని శరద్‌ పవార్‌ పుణెలో మీడియాతో అన్నారు. ఈ ‘సీఎం ఫేస్‌’ విషయంపై భిన్నాభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అయితే శరద్‌ పవార్‌ కూటమిలో విభేదాలు లేవని చెప్పడమే కాకుండా, ప్రతి విషయంపైనా కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం ఉందని అన్నారు.

ఎవరు ఎక్కడ?
అలాగే కాంగ్రెస్‌ పార్టీ, శివసేన– ఉద్ధవ్‌ ఠాకరే గ్రూపు మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌) లేదా ఎంఎంఆర్‌ లోని నియోజకవర్గాలకు సంబంధించినవి. ముంబై ఎంఎంఆర్‌ ప్రాంతంలో తమ ఉనికిని నిలుపుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తుండగా, ఉద్ధవ్‌ ఇప్పుడు తనకు గరిష్ఠంగా ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ సీట్లు కావాలని పట్టుబట్టారు. ముంబై నార్త్‌ సెంట్రల్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. 

గతంలో పార్టీకి కంచుకోటగా ఉన్న నార్త్‌ సెంట్రల్, నార్త్‌ వెస్ట్‌లలో తమ స్థావరాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, శివసేన–ఉద్ధవ్‌ గ్రూప్‌ కొంకణ్, థానే, మరాఠ్వాడా ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; కాంగ్రెస్‌ పార్టీ విదర్భ ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; ఇకపోతే, శరద్‌ పవార్‌ ఎన్సీపీ పశ్చిమ మహారాష్ట్రపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేకు చెందిన విదర్భ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అలాగే పశ్చిమ మహారాష్ట్రలోని పుణె, సాంగ్లీ జిల్లాల్లో కూడా పార్టీ క్షేత్రస్థాయి కార్యాచరణను మొదలుపెట్టింది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో సాంగ్లీలో ఏమి జరిగిందో పునరావృతం కాకుండా పశ్చిమ మహారాష్ట్రలో కచ్చితమైన సీట్ల పంపకం గురించి తమ పార్టీ, శివసేన ఉద్ధవ్‌ ఠాకరే గ్రూపుతో తెర వెనుక కమ్యూనికేషన్‌ ను ప్రారంభించిందని శరద్‌ పవార్‌–ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీలూ కెమెరా ముందు పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యలకు దూరంగా ఉన్నప్పటికీ, సీట్ల పంపకాల చర్చల కోసం కూర్చున్నప్పుడు కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉందని లోపలి వ్యక్తులు అంటున్నారు. 

కూటమి వర్గాల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన సాధారణ సూత్రం ఏమిటంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజారిటీని పొందినట్లయితే, అసెంబ్లీలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తుంది. విదర్భలో కాంగ్రెస్‌ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు. కాబట్టి, ‘కాబోయే ముఖ్యమంత్రి ముఖం’ అనే సమస్య కూటమి భాగస్వాములలో కొన్ని చీలికలను, ఒత్తిడిని కలిగిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. 

రోహిత్‌ చందావర్కర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement