
కామెంట్
రాజకీయ నాయకుడి సత్తా ఏమిటో గుర్తించాలంటే వాళ్లు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో గమనించాలి. పార్టీ, కుటుంబం, లేదా వ్యక్తిగతమైన తప్పులను ఒప్పుకొంటారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఇది మరీ ముఖ్యమవుతుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ... ఆ మాటకొస్తే ఆయన కుటుంబం, నాయనమ్మ కూడా బలహీనులనే చెప్పాలి.
కొన్నేళ్ల క్రితం కార్నెల్ యూనివర్సిటీలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థికవేత్త కౌశిక్ బసు ఎమర్జెన్సీ గురించి రాహుల్ గాంధీని ఒక ప్రశ్న వేశారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ‘పొర బాటు’గా అభివర్ణించారనీ, ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ దేశంలోని వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదనీ’’ రాహుల్ వివరించారు. రెండు విషయాల్లోనూ రాహుల్ తప్పే చెప్పారు.
ఎందుకంటే, అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు సుమారు లక్ష మందిని అరెస్ట్ చేసింది. పత్రికలపై నిషేధాజ్ఞలు విధించారు. న్యాయ, అధికార వ్యవస్థలను ఇష్టారీతిన వాడుకున్నారు. అత్యంత దారుణమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చేశారు. అçప్పుడు ఆయనకు ఐదేళ్లు అయినప్పటికీ, రాహుల్ గాంధీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి!
వ్యూహాత్మక సమర్థనలు
అత్యవసర పరిస్థితిని ‘పొరబాటు’ అని ఇందిరా గాంధీ అన్నారనడం కూడా అబద్ధమే. ఆమె స్వయంగా దానికి బాధ్యత వహించారు. అందులో సందేహం లేదు. ఆ తరువాత జరిగిన ఎన్ని కల్లో ఘోరంగా ఓడిపోయారు. కానీ దాన్ని ‘పొరబాటు’ అన్నారనడం అవాస్తవం. ఎమర్జెన్సీ అకృత్యాలను సమర్థించుకునేందుకు ఇందిర రకరకాల ఎత్తులు పన్నారు. ఆమె మాటల్లో దానిపట్ల సమర్థింపే కనిపించేది.
ఇందిరా గాంధీ అనుసరించిన వ్యూహాల్లో ఒకటి, అవసరానికి మించి జరిగిన ఘటనను అంగీకరించడం. 1978 జూలైలో మేరీ కరాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘పత్రికలను అణచివేయడం మరీ గట్టి చర్య’’ అని వ్యాఖ్యానించారు. ఇంకోలా చెప్పాలంటే, కట్టడి చేసేందుకు ఇంకొంచెం తేలికైన పద్ధతి ఉంటే బాగుండేదని అర్థం.
అంతేతప్ప, పత్రికలను నియంత్రించడం పొరబాటైతే కాదు.ఇంకో వ్యూహం ఉంది. ఇతరులు తప్పులు చేశారు... నేను మాత్రం వాటికి బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పడం. 1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఇందిరా గాంధీ యవ త్మాల్ (మహారాష్ట్ర)లో ఇచ్చిన ఒక ప్రసంగంపై కథనాన్ని ప్రచురించింది. ‘‘తప్పులు చేసిన ఇతరులు తమ అతిని ఒప్పుకొనేందుకు సిద్ధంగా లేరు. నేను మాత్రం జరిగిన తప్పులకు బాధ్యత తీసుకుంటున్నాను’ అని ఇందిరాగాంధీ చెప్పారు’’ అని ఉంది అందులో.
ఇక మూడో వ్యూహం: ఏ రకమైన తప్పులు జరిగినా వాటిని చాలా చిన్నవిగా చూపించి ఒప్పుకోవడం. మేరీ కారస్ ఇంట ర్వ్యూలోనే ఇందిరా గాంధీ ‘‘రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకోవడం, పత్రికా స్వాతంత్య్రాన్ని హరించడం మినహా అసాధార ణమైనవి ఏవీ లేవు’’ అని వ్యాఖ్యానించారు. తుర్క్‌మాన్ గేట్ (ఢిల్లీ) వద్ద కొంతమంది మరణించిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ‘‘హింస జరగలేదు... అవి ఒకట్రెండు విడి ఘటనలు’’ అని తేల్చే శారు.
దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ కూడా పెద్దగా జరగలేదంటారు ఇందిర. ‘‘తప్పుడు ప్రచారమే మమ్మల్ని ఓడించింది. అలాగని మేమేమీ తప్పులు చేయలేదని అనడం లేదు. అయితే వాటిని కొండంత చేసి చూపించారు. బలవంతపు కుటుంబ నియంత్రణ విషయంలోనూ ఇదే జరిగింది.
విషయాలను వాళ్లు ఎట్లా ప్రచారం చేస్తారంటే... చెప్పాలంటే నా దృష్టిలో అవి అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే కాదు. ప్రచారం మాత్రమే. వారు చెప్పేంత స్థాయిలో జరగలేదు. కొన్ని కేసులున్నాయి కానీ... చాలా కేసుల గురించి వాకబు చేసిన ప్పుడు తప్పని తేలింది’’ అని ఇందిర 1978 మార్చి 26న పాల్ ఆర్ బ్రాస్‌తో జరిపిన సంభాషణలో స్పష్టం చేశారు.
ఇప్పటివరకూ చెప్పుకొన్న ప్రతి అంశంలోనూ ఇందిరాగాంధీ కొన్ని నిర్దిష్ట అంశాల గురించి అంటే... నిషేధాజ్ఞలు, అరెస్టులు, తుర్క్‌మాన్ గేట్, బలవంతపు కుటుంబ నియంత్రణ వంటి వాటి గురించి మాట్లాడారే కానీ... అత్యవసర పరిస్థితి గురించి నేరుగా మాట్లాడలేదు. అత్యవసర పరిస్థితిలోంచి ఈ తప్పులను వేరుగా చూపే ప్రయత్నం చేశారు. దీన్నిబట్టే అత్యవసర పరిస్థితి విధింపుపై ఇందిరా గాంధీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.
క్షమాపణ చెప్పలేదు!
1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం, అత్యవసర పరిస్థితి సమయంలో ఇతరులు చేసిన తప్పులు, అక్రమాలకు ఇందిరా గాంధీ బాధ్యత వహిస్తూనే, ‘‘ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో దేశంలోని పరిస్థితి ఏమిటో ఆలోచించాలి’’ అని శ్రోతలను కోరారు. ‘‘అన్నివైపులా గందరగోళం నెలకొని ఉండింది. పరిస్థితి అలాగే కొనసాగి ఉంటే భారత్ పరిస్థితి బంగ్లా దేశ్‌లా అయ్యేదని వ్యాఖ్యానించారు.’’ ‘‘రోగానికి చికిత్స చేసేందుకు ఇచ్చిన ఔషధమే ఎమర్జెన్సీ’’ అని అన్నారు.
ఎమర్జెన్సీకి సంబంధించి మీరేదైనా భిన్నంగా చేసేవారా? అని పాల్ బ్రాస్ అడిగినప్పుడు ఇందిర ఇచ్చిన సమాధానం ‘లేదు’ అని. సూటి ప్రశ్నకు వచ్చిన మొట్టమొదటి స్పందన అది. ఆ తరువాత... ఎమర్జెన్సీ కష్టాలను, బాధలను ‘వ్యక్తిగతంగా’ చూడలేకపోవడం తన తప్పు అని అన్నారు. ‘‘నా తప్పేమిటి అంటే... ఆ విషయాలను వ్యక్తిగతంగా చూడకపోవడం, చర్చించకపోవడం.’’ ఇవీ ఆమె మాటలు!
కాబట్టి విషయమైతే స్పష్టం. ఎమర్జెన్సీ ఒక పొరబాటు అని ఇందిరా గాంధీ ఎప్పుడూ అనుకోలేదు. అందుకు క్షమాపణ కూడా చెప్పలేదనడం నిస్సందేహం. 1977 ఎన్నికల్లో ఓటమికి బాధ్యతను మాత్రం అంగీకరించారు. దానికి అతిపెద్ద కారణం ఎమర్జెన్సీ అన్నారే గానీ, అది తప్పు అని మాత్రం అనలేదు. నా పరిశోధనలో ఎంతో సాయం చేసిన, ఇందిరా గాంధీ ఆత్మకథ రాసిన సాగరికా ఘోష్ కూడా దీనితో ఏకీభవిస్తారు. ఎమర్జెన్సీ విధించడం తప్పు అని ఇందిరా గాంధీ అన్న దాఖలా నాకు ఎక్కడా కనిపించలేదు.
మౌలికంగా భిన్నమా?
ఆర్‌ఎస్‌ఎస్ అన్ని వ్యవస్థల్లో తనవాళ్లను ప్రవేశపెడుతోందని ఇప్పుడు ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ... ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రవర్తన మాత్రం ‘మౌలికంగా భిన్నం’ అంటారు. ఇది కూడా తప్పే. అప్పట్లో ఓ జూనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా చేయడంతో హెచ్.ఆర్.ఖన్నా రాజీనామా చేయాల్సి వచ్చింది. హోంశాఖ కార్యదర్శి నిర్మల్ ముఖర్జీ వంటి నిబద్ధత కలిగిన అధికారులను పదవుల నుంచి తప్పించారు.
రాహుల్ గాంధీ ఎక్కడ పప్పులో కాలేశారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితినీ, ఎమర్జెన్సీ పరిస్థితినీ వేరుగా చూపాలని ఆయన భావించారు. తద్వారా ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితి మెరుగు అన్న భావన కల్పించాలని అనుకున్నారు. అందుకే ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ వ్యవస్థలను వశపరచుకోవాలని అనుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో అంశం... ఎమర్జెన్సీని నానమ్మ ‘పొరబాటు’ అన్నారని చెప్పడం ద్వారా ఆ అంశంపై మరిన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురు కాకుండా జాగ్రత్తపడ్డారు. చర్చను ముగించేందుకుగానూ, కొంత నష్టపోవడం అన్నమాట.
అయితే రాహుల్ మాటలు అప్పట్లోనే వివాదాన్ని సృష్టించాయి. ఆయన జ్ఞానం, తీర్పరితనం, నిజాయితీ, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం... అన్నింటిపై సందేహాలు వచ్చాయి.
ఈ విషయాలన్నింటిలోనూ ఆయన చాలా తేలికగా ఓడి పోయారేమో అనిపిస్తుంది. ఇదో గూగ్లీ అనుకుంటే రాహుల్ బౌల్డ్ అయ్యారు. దీన్ని ఒక పరీక్షగా అనుకుంటే రాహుల్ దీంట్లో పాస్ కాలేదు. జనాలను ఆకట్టుకోవాలన్నది రాహుల్ ఉద్దేశమైతే అది కూడా జరగలేదు. రాహుల్ ఈ దేశ ప్రధాని అయితే... ఇబ్బంది కరమైన పరిస్థితులను, మరీ ముఖ్యంగా తన కుటుంబ గత చరిత్ర గురించి ఎదుర్కోవడం ఎలాగో ఏదో ఒక రోజు కచ్చితంగా నేర్చు కోవాల్సి ఉంటుంది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment