పులి కాస్తా పిల్లి అయింది
అతి విశ్వాసం వమ్మయిన వైనం
* సీఎం తానేనన్న ఉద్ధవ్ ఠాక్రేకు భంగపాటు
* మోదీ హవాను అంచనా వేయని వైఫల్యం
* బీజేపీకి మద్దతు ఇవ్వక తప్పని దుస్థితికి చేరిన శివసేన
సాక్షి, ముంబై: మహారాష్ట్ర 2014 అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాలు బీజేపీ, శివసేనలకు మరచిపోలేని అనుభవాలను ఇచ్చాయి. 2014 ఎన్నికల ముందు వరకు కూడా ఈ రెండు పార్టీల్లో మహారాష్ట్రలో సేనది పైచేయి కాగా.. బీజేపీ జూనియర్ భాగస్వామిగానే ఉంది. కానీ 2014 ఎన్నికల్లో ‘మోదీ హవా’ పరిస్థితులను తారుమారు చేసింది. శివసేన ఊహించని స్థాయిలో మహారాష్ట్రలో బీజేపీ బలపడింది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి తానేనని కలలు కన్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ప్రస్తుతం వాస్తవాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు, తరువాత ఆయన స్వరంలో మార్పులను కళ్లకు కట్టే కథనం..!
పొత్తు చర్చల్లో..
పొత్తు చర్చల సందర్భంగా కూడా శివసేన ఒంటెద్దు పోకడలనే అనుసరించింది. తాము ఇచ్చేవారమే కానీ తీసుకునేవారం కాదంటూ గొప్పలు పోయింది. బీజేపీకి 119 సీట్లకు మించి ఒక్క సీటు కూడా ఎక్కువ ఇవ్వబోమంటూ ఉద్ధవ్ ఠాక్రే మొండిగా వ్యవహరించారు.
పోటీకి దిగాక..
పొత్తు చర్చలు విఫలమై.. ఎవరికి వారు పోటీకి దిగిన తరువాత కూడా వ్యూహాత్మకంగా బీజేపీ శివసేనపై ప్రత్యక్ష దాడికి దిగలేదు. ప్రధాని మోదీ కూడా ‘మహా’ ప్రచారంలో బాల్ ఠాక్రేపై తనకున్న గౌరవం దృష్ట్యా శివసేనను విమర్శించబోనన్నారు. కానీ శివసేన మాత్రం బీజేపీ, మోదీలే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. బీజేపీ తమను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించింది. ‘మోదీ హవానే ఉంటే ఆయన ఇక్కడ ఇన్ని సభల్లో ఎందుకు పాల్గొంటున్నారు?’ అంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికల అనంతరం..
ఎన్నికలు జరిగిన రోజు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే హవా అంటూ ప్రకటించడంతో సేన స్వరంలో మార్పు ప్రారంభమైంది. తమ మధ్య శత్రుత్వమేమీ లేదని అక్టోబర్ 17న వ్యాఖ్యానించింది. ‘హృదయాలు పగిలాయి. అవి అతకడం కష్టమే అయినా.. మహారాష్ట్రకు ఇప్పుడు స్థిరత్వం, శాంతి అవసరం’ అంటూ పరోక్షంగా పార్టీ పత్రిక ‘సామ్నా’లో బీజేపీకి స్నేహ హస్తాన్ని చాచింది.
ఫలితాలు వెలువడ్డాక..
బీజేపీకి మద్ధతిచ్చేందుకు, ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమయింది. మంత్రిత్వ శాఖల విషయంలోనూ బీజేపీ ఎలాంటి మాటివ్వకపోయినా.. బీజేపీ ఎవరిని సీఎం చేసినా మద్ధతిస్తామంటూ ఏకపక్షంగా ప్రకటించింది.