Devendra phadnavis
-
ముంబై పీఠంపై ప్రతిష్టంభన
► బీజేపీ–శివసేన దోస్తీయే ప్రత్యామ్నాయమన్న గడ్కరీ ► సామ్నాలో కమలంపై నిప్పులు చెరిగిన శివసేన ముంబై: బీఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో మేయర్ ఎవరనే దానిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎక్కువ సీట్లు గెలుపొందిన శివసేన.. బీజేపీతో కలవబోమంటూ గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఎన్నికలు అయిపోయాక కూడా అధికార పత్రిక సామ్నాలో బీజేపీపై విమర్శలు గుప్పించింది. కాగా, బీజేపీ–శివసేన కలిసిరావటం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ‘రెండు పార్టీలకు ఒకరితో ఒకరు కలవటం తప్ప వేరే దారిలేదు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కలసి తీసుకుంటారు’ అని గడ్కరీ తెలిపారు. అయితే, ఈ దోస్తీ కలకాలం ఉండాలని శివసేన కోరుకుంటే తన అధికార పత్రిక సామ్నాలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలపై అవమానకరంగా రాస్తున్న వార్తలపై ఆలోచించాలని సూచించారు. కాగా, కాంగ్రెస్ మద్దతుతో శివసేన మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనుందనే వార్తలను ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఖండించారు. కలవటం కష్టమే: శివసేన బీజేపీ స్నేహహస్తాన్ని అందిస్తున్నప్పటికీ.. వీరితో దోస్తీకి సుముఖంగాలేమని శివసేన తెలిపింది. బీజేపీతో తమ పోరు కొనసాగుతుందని.. మహారాష్ట్ర సమగ్రత కోసం యుద్ధం కొనసాగుతుందని.. అధికారం కోసం కాదని ‘సామ్నా’లో పేర్కొంది. ‘మేం (శివసేన) 25 ఏళ్లుగా బీఎంసీని ఏలుతున్నాం. వారు (బీజేపీ) కుయుక్తులతో మా పాలనను అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉన్నపుడు కూడా ఇలా జరగలేదు’ అని సామ్నా వెల్లడించింది. శనివారం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశమయ్యాక తదనంతర పరిస్థితులపై ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకోనున్నారు. అటు, ఈ అంశంపై చర్చించేందుకు రెండు మూడు రోజుల్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. -
పాక్ నటులను తీసుకోం!
బాలీవుడ్ ప్రకటన ముంబై: ఇక నుంచి బాలీవుడ్ తెరక్కెకించబోయే ఏ చిత్రాల్లోను పాకిస్తాన్ నటులను తీసుకోబోమంటూ బాలీవుడ్ శనివారం సంచలన ప్రకటన చేసింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడితో బాలీవుడ్ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో జరిగిన కీలక భేటీలో.. ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలకు అంగీకారం కుదిరింది. ఉడీ దాడిపై బాలీవుడ్ నటులు అందరూ పాక్ చర్యలను ఖండించినా, బాలీవుడ్లో పనిచేస్తున్న పాక్ నటులు మాత్రం దాడిపై నోరు మెదపలేదు. దీంతో పాక్ న టులను బహిష్కరించాలని ఎంఎన్ఎస్ అంటోంది. ఎంఎన్ఎస్ డిమాండ్ల మేరకు ఈ చిత్రంలో నటించిన ఐశ్వర్యరాయ్, రణబీర్‌కపూర్, అనుష్కశర్మలు సైనిక సంక్షేమ నిధికి రూ. 5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో పాకిస్తాన్‌కు చెందిన నటుడు ఫవద్‌ఖాన్ 4 నిమిషాల పాటు కనిపించనున్నారు. -
చేతులు విరిచి..గొంతు నులిమి..
-
చేతులు విరిచి..గొంతు నులిమి..
మహారాష్ట్రలో బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారం చేసి, చేతులు విరిచి, ఆమె శరీరం మొత్తం గాయాలు చేసి గొంతు నులిమి చంపేశారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు విషయం వెలుగుచూడటం తీవ్ర చర్చనీయాంశమైంది. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పోలీసులు ప్రధాన నిందితుడు జితేంద్ర షిండే అలియాస్ ‘పప్పు’ను ఘటన జరిగిన మరుసటి రోజున, నేరంలో సహాయపడిన సంతోష్ భవ్, నితిన్ ధైల్యూమ్‌లను తర్వాత అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త బైక్ కొన్న జితేంద్ర షిండే జూలై 13న ఇద్దరు మిత్రులతో కలసి చెట్టుకింద మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో బాలిక తన తాతను కలిసి తిరిగి వెళ్తోంది. ఆమెతో ముగ్గురు నిందితులు మాటలు కలిపారు. తర్వాత అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపారు. స్థానికులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మరణించింది. జితేంద్ర ఇటుకల బట్టీలో పనిచేసేవాడనీ, ఆమె వెంటపడి వేధించే వాడని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ రూ.3 లక్షల చెక్కును ఎక్స్‌గ్రేషియాగా బాలిక కుటుంబానికి ఇచ్చారు. -
‘మహా’ ఒప్పందాల ప్రక్రియ వాయిదా!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి రష్యా పర్యటనలో ఉండటంతో ఆలస్యం సాక్షి, హైదరాబాద్ : గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించే మూడు బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈ నెల 15న జరగాల్సిన ఒప్పందాల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రష్యా పర్యటనలో ఉండటం, మరో మూడు, నాలుగు రోజులు ఆయన పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒప్పందాల ప్రక్రియ వాయిదా పడినట్లుగా తెలిసింది. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అధికారులు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిజానికి ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్ వేదికగా ఈ నెల 15న బ్యారేజీ నిర్మాణాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. దీనిపై గత నెల చివరి వారంలోనే ఒప్పందాల తేదీలను ఖరారు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సమాచారం పంపింది. తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట, మహారాష్ట్ర పింపర్డ్ వద్ద నిర్మించే బ్యారేజీలపై ఒప్పందాలు ఉంటాయని తెలిపింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ రష్యా పర్యటనలో ఉన్నందున ఈ నెల 15న ఒప్పందాల ప్రక్రియ ఉండదని, మరో తేదీని తర్వాత తెలియజేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు సమాచారం ఇచ్చారు. -
ఆర్కే లక్ష్మణ్‌కు తుది వీడ్కోలు
సాక్షి, ముంబై/పుణే: పదునైన కార్టూన్లతో కోట్లాది మంది ముఖాల్లో నవ్వులు పూయించిన ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్‌కు దేశం కంటతడితో తుడి వీడ్కోలు పలికింది. అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన అంత్యక్రియలను మంగళవారం పుణేలోని వైంకుఠ్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ‘కామన్ మేన్’ కార్టూన్ల సృష్టికర్తకు గౌరవంగా సైనిక వందనం చేశారు. లక్ష్మణ్ తనయుడు శ్రీనివాస్ చితికి నిప్పంటించారు. అంతకుముందు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, విద్యామంత్రి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే, లక్ష్మణ్ పనిచేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మాజీ సంపాదకుడు దిలీప్ పడ్గావ్కర్ తదితరులు ల క్ష్మణ్ భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని జవదేకర్ అందజేశారు. ‘గొప్ప కార్టూనిస్టును, పొద్దుటిపూట నవ్వును శాశ్వతంగా కోల్పోయాం’ అని మోదీ అందులో పేర్కొన్నారు. అంత్యక్రియలకు ముందు లక్ష్మణ్ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శన కోసం సింబయోసిస్ ఇన్స్టిట్యూట్లో ఉంచారు. లక్ష్మణ్ సృష్టించిన కామన్ మేన్ ప్రపంచం ఉన్నంతవరకు ఉంటాడని, రాజకీయ వ్యవస్థకు అతడు చెక్ పెడతాడని ఫడ్నవిస్ పేర్కొన్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు లక్ష్మణ్ పేరిట స్మార కాన్ని నిర్మిస్తామని తెలిపారు. తన తండ్రి బాల్ ఠాక్రేతో లక్ష్మణ్కున్న అనుబంధాన్ని ఉద్ధవ్ గుర్తు చేసుకున్నారు. 94 ఏళ్ల లక్ష్మణ్ దీర్ఘకాల అనారోగ్యంతో సోమవారం పుణేలో మృతిచెందడం తెలిసిందే. ఆయన మృతికి బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, అమీషా పటేల్ తదితరులు ట్వీటర్లో నివాళి అర్పించారు. లక్ష్మణ్ కుటుంబం వద్ద వందలాది చిత్రాలు లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో సంభాషణల సమయంలో వేసిన వందలాది చిత్రాలు(డూడుల్స్) పదిలంగా ఉన్నాయి. ఎక్కడా ప్రచురితం కాని ఇవి ఆయన అన్న కుమారుడు ఆర్ఎస్ కృష్ణస్వామి వద్ద ఉన్నాయి. ల క్ష్మణ్ 1975-1991 మధ్య సెలవుల కోసం మైసూర్, బెంగళూరు వెళ్లినప్పుడు వీటిని గీశారు. -
రావత్, ఫడ్నవిస్ వాగ్వాదం
ప్రణాళికా సంఘం రద్దు ప్రతిపాదనపై గొడవ న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాలన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య శనివారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అంశంపై, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు, బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు వాదోపవాదాలు జరిగాయి. శనివారం ఢిల్లీలో ‘ఎజెండా ఆజ్‌తక్’ శీర్షికతో జరిగిన చర్చ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ వాగ్వాదం నెలకొంది. చాలా కాలంగా ఎన్నో పరీక్షలకు తట్టుకుని నిలబడ్డ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనవల్ల దేశంలో అనిశ్చితి ఏర్పడిందని, దీనిపై ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాలకు పలు అనుమానాలు నెలకొన్నాయని, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు ప్రణాళికా సంఘం వంటి సంస్థలు గతంలో ఎంతో కృషిచేశాయని హరీష్ రావత్ వాదించగా, ఆయనవాదనను ఫడ్నవిస్ ఖండించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడబోయే సంస్థవల్ల రాష్ట్రాలకు మరిన్ని హక్కులు సంక్రమిస్తాయని ఫడ్నవిస్ అన్నారు. ఈ విషయమై రావత్ వ్యక్తంచేసిన ఆందోళనలు ఆధారరహితమైనవని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాలన్న ప్రతిపాదన ఏకపక్షంగా ఉందని రావత్ వ్యాఖ్యానించగా, దేశం అభివృద్ధి పథంలో సాగేందుకు, బీజేపీ రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు ప్రగతి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ తగిన చర్యలు తీసుకుంటుందని ఫడ్నవిస్ అన్నారు. -
అజిత్ పవార్‌పై ఏసీబీ విచారణ
అవినీతి కేసులో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఆదేశం నాగ్‌పూర్: అవినీతి ఆరోపణపై మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ముగ్గురు ఎన్సీపీ నేతలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏసీబీ విచారణకు ఆదేశించారు. మహారాష్ట్రలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాల నిర్మాణంలో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో నీటి వనరుల శాఖల మంత్రులుగా పనిచేసిన అజిత్ పవార్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ టట్కారేలపై ఏసీబీ విచారణకు సీఎం ఫడ్నవిస్ ఆదేశించారు. దీనితో పాటు ఢిల్లీలో మహారాష్ట్ర సదన్‌తో పాటు ముంబైలో పీపీపీ పద్ధతిలో చేపట్టిన పలు ప్రభుత్వ భవనాల నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై అప్పటి ప్రజా పనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్బల్పైనా.. సాగునీటిశాఖ అధికారులు, కాంట్రాక్టర్లపైనా విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆ కుంభకోణాలకు సంబంధించి బాంబే హైకోర్టులో దాఖలైన ఒక పిల్ విచారణ సందర్భంగా... శుక్రవారం ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సునీల్ మనోహర్ ఈ వివరాలను కోర్టుకు వెల్లడించారు. కాగా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడంపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘‘ఇది వారి (బీజేపీ) ప్రభుత్వం. ఏం చేయాలో వారి ఇష్టం. దీనివల్ల మాకేం సమస్యలేదు. విచారణ జరిగితే వాస్తవాలు బయటికి వస్తాయి’’ అని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని సునీల్ టట్కారే చెప్పారు. -
బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ బలపరీక్ష కోరండి
‘మహా’ గవర్నర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి ముంబై: మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి విశ్వాసపరీక్షను ఎదుర్కోవలసిందిగా ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును డిమాండ్ చేసింది. మళ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కొనే వరకూ.. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలుపుదల చేయాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే నేతృత్వంలో శాసనసభ్యుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్నం అందజేసింది. 20 నిమిషాలపాటు గవర్నర్‌తో సమావేశమైన కాంగ్రెస్ సభ్యులు బుధవారం నాటి విశ్వాస పరీక్షలో ఫడ్నవిస్ ప్రభుత్వం అక్రమంగా మూజువాణి ఓటు ద్వారా విజయం సాధించిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మాణిక్‌రావు ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తులను పరిశీలిస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని చెప్పారు. -
ఫడ్నవిస్ ప్రభుత్వం చెల్లదు: శివసేన
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శివసేన సభ్యులు ముంబై: మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం శివసేన విమర్శలను తీవ్రతరం చేసింది. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలోప్రభుత్వం మోసపూరితంగా గెలిచిందని, దీనిని మైనారిటీ ప్రభుత్వంగా ప్రకటించాలని, ప్రభుత్వాన్ని మరోసారి విశ్వాస పరీక్ష నిర్వహిం చేలా ఆదేశించాలనికోరుతూ ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలోశివసేన సభ్యులు గురువారం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం చెల్లదని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం నాటి విశ్వాస పరీక్షలో బీజేపీ ప్రభుత్వం మూజువాణి ఓటు ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడిన శివసేన, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌తో భేటీ అనంతరం శివసేన సీనియర్ నేత దివాకర్ రావ్టే రాజ్‌భవన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ సర్కారును మైనారిటీ ప్రభుత్వంగా ప్రకటించాలని, తాజాగా విశ్వాస పరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌ది కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కొనసాగుతోందని ఆరోపించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా తమకు 122 ఓట్ల కంటే ఎక్కువ వచ్చినట్టు ప్రభుత్వ నిరూపించలేకపోయిందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కొట్టిపారేశారు. తాము నిబంధనల ప్రకార మే విశ్వాస పరీక్షలో గెలిచామన్నారు. మరోవైపు మహారాష్ట్రఅసెంబ్లీని రద్దు చేయాల ని, రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలంటూ ఆర్పీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం కొట్టేసింది. -
ఆ భద్రత అవసరం లేదు..
సాక్షి, ముంబై: తనకు పోలీసులు ఏర్పాటుచేసిన జెడ్ ప్లస్ భద్రతను నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారుల కమిటీకి ఓ లేఖ రాశారు. అందులో తనకు ప్రస్తుతం కేటాయించిన జెడ్ ప్లస్ భద్రతను తొలగించి సాధారణ వై స్థాయి భద్రత కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి అనేది రాష్ట్రంలో అత్యున్నత పదవి కావడంతో ఆ పదవిలో కొనసాగుతున్న వ్యక్తి కోసం 150 మంది పోలీసు అధికారులు, ఇతర సిబ్బందితోపాటు జెడ్ ప్లస్ భద్రత ఉంటుంది. కాని ఫడ్నవిస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి భద్రత తీసుకోలేదు. ఆ తర్వాత కూడా ఇతర పదవుల్లో కొనసాగినప్పటికీ తాత్కాలికంగా మినహా శాశ్వతంగా ఎప్పుడు పోలీసు భద్రత కోరలేదు. కాని ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. ముంబైలో ప్రభుత్వ అధికార నివాసమైన వర్షా బంగ్లా, నాగపూర్‌లో ఆయన నివాస బంగ్లా వద్ద కూడా భారీగా పోలీసులను నియమించారు. ధరంపేట్‌లో ఉన్న ఇంటికి కూడా పోలీసు భద్రత కల్పించారు. ఇలా భారీగా పోలీసులను మోహరించడంవల్ల ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ధరంపేట్‌లో ఇంటివద్ద ఉన్న పోలీసులను తొలగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా తను నాగపూర్ వచ్చినప్పుడు సొంత బంగ్లాలో కాకుండా ప్రభుత్వం బంగ్లాలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీంతో సొంత ఇంటివద్ద నియమించిన పోలీసు బలగాలను తొలగించాలని కోరారు. తనకు ఎవరివల్ల ముప్పు లేదని, భారీ స్థాయిలో భద్రత అవసరం లేదని వెంటనే జెడ్ కేటగిరి భద్రతను తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. కాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా మావోయిస్టులతో వారికి ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే సీఎం ఫడ్నవిస్ కేవలం సాధారణ వై భద్రత కల్పించాలని కమిటీని కోరడంతో పోలీసులు ఆయోమయంలో పడిపోయారు. -
మంత్రులకు శాఖల కేటాయింపు
ముంబై: నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గసభ్యులకు శాఖలను కేటాయించారు. అయితే హోం, పట్టణాభివృద్ధి వంటి కీలక శాఖలను మాత్రం తనతోనే ఉంచుకున్నారు. మంత్రుల శాఖల వివరాలివే.. ఏక్నాథ్ ఖడ్సే: రెవెన్యూ, వక్ఫ్, వ్యవసాయ, పశు సంవర్థక, పాడి, మత్స్య, ఎక్సైజ్ శాఖలు సుధీర్ మునగంటివార్: ఆర్థిక శాఖ, ప్లానింగ్, అటవీ శాఖలు వినోద్ తావ్డే: పాఠశాల విద్య, క్రీడలు, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య, మరాఠీ భాష, సాంస్కృతిక శాఖలు {పకాశ్ మెహతా: పరిశ్రమలు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు చంద్రకాంత్ పాటిల్: సహకార, మార్కెటింగ్, టెక్స్టైల్స్, ప్రజా పనులు శాఖలు పంకజా ముండే: గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, మహిళా శిశు సంక్షేమ శాఖలు విష్ణు సవేరా: గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయ శాఖలు సహాయ మంత్రులు: విద్యా ఠాకూర్: గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, మహిళా శిశు సంక్షేమ శాఖలు దిలీప్ కాంబ్లే: గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయ శాఖలు -
ఇంతకంటే ఏమి కావాలి
కొడుకు సీఎం అవడంపై దేవేంద్ర తల్లి సరిత సాక్షి, ముంబై: ‘కొడుకులు ప్రయోజకుడైతే ముందుగా సంతోషించేది కన్నవారే. అందులోనూ నా కుమారుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంకంటే సంతోషం ఇంకేముంది’ అంటూ దేవేంద్ర ఫడణవిస్ తల్లి సరితా ఫడణవిస్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర పేరు ప్రకటించగానే నాగపూర్‌లో మంగళవారం సాయంత్రం ఆయన అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్న సంగతి విదితమే. ఈ సంగతి తెలిసినవెంటనే దేవేంద్ర తల్లి సరిత మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర, రాష్ట్రంలో దేవేంద్ర అంటూ ముందుగా ప్రకటించిన విధంగానే జరిగిందన్నారు. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని అందరూ కోరుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తన కుమారుడికి కూడా మంత్రి పదవి లభించొచ్చని అనుకున్నాం. అయితే ఏకంగా ముఖ్యమంత్రి అవుతాడని మాత్రం అనుకోలేదు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తప్పకుండా అభివృద్ధి బాటలో నడిపిస్తాడు’ అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దేవేంద్ర పట్టుదలకు మారుపేరని, అనుకున్నది సాధించి తీరుతాడంటూ కితాబిచ్చారు. -
దేవేంద్ర స్థానం కొల్హాపూర్ ఎమ్మెల్సీ చంద్రకాంత్‌కి?
ముంబై: దేవేంద్ర ఫడణవిస్ సీఎం కావడం కొల్హాపూర్ బీజేపీ ఎమ్మెల్సీ చంద్రకాంత్ పాటిల్‌కి కలిసొచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రకాంత్‌కు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవీ బాధ్యతలను అప్పగించే అవకాశముందని తెలియవచ్చింది. ఈ నెల 31వ తేదీ తరువాత ఆయనను ఈ పదవి వరించనుందని వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఓ నాయకుడు తెలియజేశారు. చంద్రకాంత్‌కు ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇదిలాఉంచితే బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్కు మంత్రి పదవి దక్కే అవకాశముండడంతో ఈ పదవి కూడా ఖాళీ అయ్యే అవకాశముంది. ఈ పదవి విలేపార్లే ఎమ్మెల్యే పరాగ్ అల్వనికి ద క్కే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
వచ్చే నెల 22న మోడీ ర్యాలీ
సాక్షి, ముంబై: : బీజేపీ ఆధ్వర్యంలో వచ్చే నెల 22వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ సభలో మోడీతోపాటు అగ్రనాయకులు రాజ్‌నాథ్ సింగ్, రాజీవ్‌ప్రతాప్ రూడీ, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొంటారన్నారు. కాగా ఈ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వర్గా లు నిర్ణయించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. శివాజీపార్కు మైదానం నిశ్శబ్ద ప్రాంతం పరిధిలోకి రావడంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఇక్కడ సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేకుండా పోయింది. దీంతో బాంద్రా కుర్లా కాంప్లెక్సు (బీకేసీ)లోని విశాలమైన మైదానంలోఈ సభను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని ఫడ్నవీస్ తెలిపారు. మిత్రపక్షాలైన శివసేన, ఆర్పీఐలకు కూడా ఆహ్వాన పత్రికలను పంపిస్తామన్నారు. సభ నిర్వహణ అందుకు అవసరమైన జనసమీకరణలో మాత్రం వారి పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం రాష్ట్రానికి చెందిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు దాదాపు రూ.25 కోట్ల మేర నిధులన కూడగట్టారు. ఈ మొత్తాన్ని జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేయనున్నారు. నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత రాష్ట్ర బీజేపీ తరఫున బహిరంగ సభను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. విద్యార్థుల సదస్సులో పాల్గొనేందుకు రెండు నెలల క్రితం మోడీ ఇక్కడికొచ్చారు. అయితే పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో సభకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబై తరువాత విదర్భ, ఖాందేశ్, మరఠ్వాడాలలోనూ సభలు జరగనున్నాయి. -
కాంగ్రెస్‌పై దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు
రత్నగిరి: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సీబీఐని ఆడిస్తోందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. సీబీఐ, యూపీఏ ఒత్తిడి మధ్య పనిచేస్తోందన్నారు. సీబీఐ అంటేనే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ముద్ర పడిందని, కాంగ్రెస్ ఒత్తిడి మధ్యే అది పనిచేయాల్సి వస్తోందన్నారు. రత్నగిరి జిల్లాలోని చిప్లున్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ఈ ఆరోపణలు చేశారు. తమ రాజకీయ స్వార్థానికి సీబీఐని వాడుకుంటోందని, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై కూడా సీబీఐని ప్రయోగించాలని చూస్తోందన్నారు. అయితే మోడీ ఇలాంటివాటికి బెదిరే వ్యక్తి కాదన్నారు. ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన దాదాపు 10 మంది మంత్రుల హస్తముందని, అయినప్పటికీ సీబీఐ ఈ కేసును సరైన దిశగా దర్యాప్తు జరపడం లేదన్నారు. బీజేపీ, శివసేన, ఆర్పీఐల మహాకూటమి అధికారంలోకి వస్తే ఇలాంటి అవినీతి ప్రముఖులందరినీ జైలుకు పంపుతామన్నారు. ఫడ్నవీస్ రత్నగిరి జిల్లాలోని చిప్లున్, గుహగర్ పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే.