అజిత్ పవార్‌పై ఏసీబీ విచారణ
అవినీతి కేసులో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఆదేశం
నాగ్‌పూర్: అవినీతి ఆరోపణపై మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ముగ్గురు ఎన్సీపీ నేతలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏసీబీ విచారణకు ఆదేశించారు. మహారాష్ట్రలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాల నిర్మాణంలో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో నీటి వనరుల శాఖల మంత్రులుగా పనిచేసిన అజిత్ పవార్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ టట్కారేలపై ఏసీబీ విచారణకు సీఎం ఫడ్నవిస్ ఆదేశించారు.
దీనితో పాటు ఢిల్లీలో మహారాష్ట్ర సదన్‌తో పాటు ముంబైలో పీపీపీ పద్ధతిలో చేపట్టిన పలు ప్రభుత్వ భవనాల నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై అప్పటి ప్రజా పనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌పైనా.. సాగునీటిశాఖ అధికారులు, కాంట్రాక్టర్లపైనా విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆ కుంభకోణాలకు సంబంధించి బాంబే హైకోర్టులో దాఖలైన ఒక పిల్ విచారణ సందర్భంగా... శుక్రవారం ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సునీల్ మనోహర్ ఈ వివరాలను కోర్టుకు వెల్లడించారు. కాగా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడంపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘‘ఇది వారి (బీజేపీ) ప్రభుత్వం. ఏం చేయాలో వారి ఇష్టం. దీనివల్ల మాకేం సమస్యలేదు. విచారణ జరిగితే వాస్తవాలు బయటికి వస్తాయి’’ అని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని సునీల్ టట్కారే చెప్పారు.