Sunil Tatkare
-
ముంబై ఎన్సీపీ అధ్యక్షుడిగా సచిన్ అహిర్
♦ వెల్లడించిన రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ♦ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నవాబ్ మలిక్ నియామకం ♦ బీఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న అహిర్ సాక్షి, ముంబై : బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న తరుణంలో ఎన్సీపీ ముంబై అధ్యక్షునిగా మాజీ మంత్రి సచిన్ అహిర్‌ను ఎంపిక చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని పదవితోపాటు ముఖ్య అధికార ప్రతినిధిగా, ముంబై యూనిట్ ఇన్చార్జిగా నవాబ్ మలిక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరితోపాటు జిల్లాలవారి అధ్యక్షులను కూడా ప్రకటించారు. ముంబై ఎన్సీపీ అధ్యక్షుని రేసులో సచిన్ అహిర్తోపాటు కిరణ్ పావస్కర్, నవాబ్ మలిక్, సంజయ్ దీనా పాటిల్‌ల పేర్లను చర్చించారు. కాగా ఎన్సీపీ అహిర్‌ను ముంబై అధ్యక్షునిగా ఎంపిక చేసింది. గతంలో సచిన్ అహిర్ గృహనిర్మాణ శాఖ సహాయక మంత్రులుగా, ముంబైలో ఉట్టి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపపి తనదైన ముద్రవేసుకున్నారు. మిల్లు కార్మికుల సమస్యలపై ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ యూనియన్‌లో విధులు నిర్వహించారు. మరోవైపు ‘ఇంటక్ కామ్‌గార్ యూనియన్’ అధ్యక్షుని పదవి కూడా చేపట్టారు. స్వతంత్రంగా పోటీ చేస్తాం : అహిర్ రాబోయే ఎన్నికల్లో పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని అహిర్ తెలిపారు. గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం వల్ల తమ పార్టీ ప్రజల్లో గుర్తింపు పొందలేకపోయిందన్నారు. ఓటు బ్యాంకును పెంపొందించకోలేక పోయామన్నారు. బూత్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి మొత్తం 227 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. దహీహందీ, నవరాత్రి, గణేశ్ ఉత్సవాలు, పండుగల సమయంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై మందిరాల ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. దహీ హందీ విషయమై గతంలో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, అప్పుడు కోర్టు స్టే ఇచ్చిందన్నారు. పండుగలకు అంతరాయం కలిగించకూడదనీ, పండుగలు నగరాలు ఏర్పడకముందే మొదలయ్యాయని చెప్పారు. ముంబై ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీని త్వరలో వెల్లడిస్తామని తట్కరే అన్నారు. 100 మందిని బలిగొన్న కల్తీసారా కేసు, రైతుల సమస్యలు, బీజేపీ మంత్రులపై అవినీతి ఆరోపణలను త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని ఆయన అన్నారు. -
బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది: పవార్
ముంబై: బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. పది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమలం పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని తెలిపారు. మంచి రోజులు వస్తాయని ఎన్నికల ప్రచారంలో బీజేపీ హామీయిచ్చిందని కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కషాయ పార్టీకి గడ్డుకాలం దాపురించిందని ఎద్దేవా చేశారు. ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ తత్కారే తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ... విదేశీ పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ మనదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం తగదని అన్నారు. రాహుల్ గాంధీ వల్లే నేపాల్ భూకంపం వచ్చిందని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యలను పవార్ తప్పుబట్టారు. -
అజిత్ పవార్‌పై ఏసీబీ విచారణ
అవినీతి కేసులో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఆదేశం నాగ్‌పూర్: అవినీతి ఆరోపణపై మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ముగ్గురు ఎన్సీపీ నేతలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏసీబీ విచారణకు ఆదేశించారు. మహారాష్ట్రలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాల నిర్మాణంలో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో నీటి వనరుల శాఖల మంత్రులుగా పనిచేసిన అజిత్ పవార్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ టట్కారేలపై ఏసీబీ విచారణకు సీఎం ఫడ్నవిస్ ఆదేశించారు. దీనితో పాటు ఢిల్లీలో మహారాష్ట్ర సదన్‌తో పాటు ముంబైలో పీపీపీ పద్ధతిలో చేపట్టిన పలు ప్రభుత్వ భవనాల నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై అప్పటి ప్రజా పనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్బల్పైనా.. సాగునీటిశాఖ అధికారులు, కాంట్రాక్టర్లపైనా విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆ కుంభకోణాలకు సంబంధించి బాంబే హైకోర్టులో దాఖలైన ఒక పిల్ విచారణ సందర్భంగా... శుక్రవారం ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సునీల్ మనోహర్ ఈ వివరాలను కోర్టుకు వెల్లడించారు. కాగా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడంపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘‘ఇది వారి (బీజేపీ) ప్రభుత్వం. ఏం చేయాలో వారి ఇష్టం. దీనివల్ల మాకేం సమస్యలేదు. విచారణ జరిగితే వాస్తవాలు బయటికి వస్తాయి’’ అని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని సునీల్ టట్కారే చెప్పారు. -
ఎన్సీపీ నాయకులకు ‘జల’గండం
జలవనరుల కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తునకు సీఎం ఆదేశం సాక్షి, ముంబై: ఎన్సీపీ నాయకులపై ఉచ్చు బిగించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. జలవనరుల కుంభకోణానికి సంబంధించి మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ జలవనరుల శాఖ మంత్రి సునీల్ తట్కరేలతోపాటు ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ భవననిర్మాణం విషయంపై అప్పటి ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆధ్వర్యంలో దర్యాప్తు జరపనుంది. ఈ దర్యాప్తుకు సంబంధించిన ఆదేశాలను ఏసీబీకి ముఖ్యమంత్రి జారీ చేసినట్లు నాగపూర్ హైకోర్టులో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మరోసారి ముఖ్యంగా జలవనరుల కుంభకోణం అంశం తెరపైకి వచ్చింది. గతంలో ఈ విషయంపై అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన అనంతరం మళ్లీ అజిత్ పవార్ పదవీబాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సమయంలోనే పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టించిన ఈ అంశం మరోసారి తెరపైకి రావడంతో ఎన్సీపీ వర్గాల్లో కలకలం రేగుతోంది. లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీపై బీజేపీ, శివసేన పార్టీలు జలవనరుల కుంభకోణం అంశంపై తీవ్ర ఆరోపణలు చేశాయి. అదే విధంగా ‘రాష్ట్రవాది పార్టీ’ కాస్తా ‘బ్రష్టాచార్వాది పార్టీ’గా (అవినీతి పార్టీ)గా మారిందని ఈ విషయంపై అధికారంలోకి రాగానే దర్యాప్తు జరిపిస్తామని బీజేపీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నట్టుగా ఎన్సీపీ నాయకులపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నత అధికారి సునీల్ మనోహర్ నాగపూర్ హైకోర్టులో తెలియపరిచారు. దీంతో రాబోయే రోజుల్లో ఎన్సీపీకి తలనొప్పులు పెరగనున్నాయని చెప్పవచ్చు. -
పవార్‌కు మరో పరేషాన్
ముంబై: నీటిపారుదల ప్రాజెక్టుల కుంభకోణంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే పాత్రపై దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 12 నీటిపారుదల ప్రాజెక్టుల్లో అజిత్, శరద్ అవినీతికి పాల్పడ్డారని ప్రవీణ్ వటగావ్కర్ అనే సామాజిక కార్యకర్త ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, నీటి పారుదలశాఖ మంత్రి సునీల్ తట్కరేతోపాటు కొంకణ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ (కేఐడీసీ)లో పనిచేసే అధికారుల ప్రమేయంపైనా దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ ఫిర్యాదును తాము రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన మాట నిజమేనని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే కంపెనీకి మూడు కంటే ఎక్కువ కాంట్రాక్టులు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీకి బుధవారం అందజేసిన ఫిర్యాదులో ప్రవీణ్ పేర్కొన్నారు. పవార్, తట్కరే నీటిపారుదలశాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ఈ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. టెండర్ల మంజూరులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల డిమాండ్లను అంగీకరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని తెఇపారు. నిబంధనలను పాటించకుండానే ప్రాజెక్టులు మంజూరు చేశారని తెలిపారు. మాధవ్ చితాలే కమిటీ కూడా అక్రమాలు జరిగినట్టు ధ్రువీకరించిందని ఏసీబీకి తెలిపారు. ఈ విషయమై తట్కరేను విలేకరుల ప్రశ్నించగా, చితాలే కమిటీ తనకు క్లీన్చిట్ ఇచ్చిందని, తాను అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాల అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టుల వ్యయం పెరుగుదల మొత్తాలను చెల్లించామని సునీల్ తట్కరే ఈ సందర్భంగా వివరణ వచ్చారు. -
కేబినెట్లోకి భాస్కర్ జాదవ్
మంత్రిగా ప్రమాణం చేసిన రాష్ట్ర ఎన్సీపీ మాజీ సారథి సాక్షి, ముంబై: ఎన్సీపీ మాజీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్‌కు ఊహించినట్టుగానే రాష్ట్ర కేబినేట్లో చోటుదక్కింది. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుని పదవి నుంచి బుధవారం ఆయన వైదొలగిన అనంతరం ఆ బాధ్యతలను సునీల్ తట్కరేకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటిదాకా తాను కొనసాగిన జలవనరులశాఖ మంత్రి పదవి నుంచి తట్కరే తప్పుకోవడం, భాస్కర్ జాదవ్‌ను కేబినెట్లోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే జాదవ్‌కు ఏ శాఖ కట్టబెట్టనున్నారనే విషయమై ఇప్పటిదాకా ఎటువంటి వివరాలు వెలువడలేదు. అయితే జలవనరులశాఖనే కట్టబెట్టనున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఆయనకు మరో శాఖను కట్టబెడితే మరికొందరి శాఖలు కూడా మార్చాల్సి ఉంటుందని, ఎన్నికల ముందు ఈ హడావుడి అక్కరలేదని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ మార్పులు చేసింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ కె. శంకర్‌నారాయణ, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, విధాన మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్, విధానసభ చెర్మైన్ దిలీప్వల్సే పాటిల్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి జాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎన్సీపీ ‘మహా’నేతగా తట్కరే
- బీసీ నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు - ఓబీసీ ఓట్లకు గాలం వేసేందుకే ‘మాలీ’ నేత ఎంపిక ముంబై: జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సునీల్ తట్కరే నియమితులయ్యారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో కంగుతిన్న ఎన్సీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీ నాయకుడు సునీల్ తట్కరేకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించింది. గత ఏడాది జూన్ 14 నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న భాస్కర్ యాదవ్ స్థానంలో తట్కరేను నియమిస్తూ ఎన్సీపీ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. బుధవారం జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తట్కరే పేరును భాస్కర్ యాదవ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు పార్టీ సీనియర్ నేతలు మధుకర్ పిచడ్, హసన్ ముష్రిఫ్, అనిల్ దేశ్‌ముఖ్, అన్నా డాంగే మద్దతు తెలిపారు. పార్టీ అత్యున్నత పదవిలో ఓ ఓబీసీ నాయకుడు ఉండాలని అధినేత శరద్‌పవార్ పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరుసగా నాలుగోసారి రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న ఎన్సీపీ, కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కీలకమైన పదవిలో బీసీ నాయకుడు ఉండాలని భావించినట్లు తెలిపాయి. మాలీ కులానికి చెందిన తట్కరే ఎంపిక ద్వారా ఇతర వెనుకబడిన వర్గాల వారిని తమవైపు తిప్పుకోవచ్చని ఎన్సీపీ భావిస్తోంది. ప్రముఖ బీసీ నాయకుడు, బీజేపీ నేత గోపీనాథ్ ముండే మరణంతో ఆ వర్గాల్లో ఏర్పడిన ఖాళీని తట్కరేతో పూరించాలని ఎన్సీపీ యోచిస్తోంది. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీకి ముఖ్యమంత్రి పదవి దక్కేలా తట్కరే కృషి చేయగలరని హసన్ ముష్రిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా ప్రారంభమై, రాయిగడ్ జిల్లా పరిషత్ సభ్యునిగా, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షునిగా, ఆ తరువాత మంత్రిగా తట్కరే అంచెలంచెలుగా ఎదిగారని పలువురు కొనియాడారు. ఆర్థిక శాఖ, జల వనరుల శాఖలకు ఆయన మంత్రిగా పని చేశారని అన్నారు. పార్టీ నిర్మాణంలో ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు అతిక్లిష్టమైనవని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని మరచిపోయి తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందని, ఆ ఫలితాన్ని ఎన్సీపీ కూడా అనుభవించాల్సి వచ్చిందని పవార్ వ్యాఖ్యానించారు. పరిపాలనలో తమ పాత్ర నామమాత్రమే అయినప్పటికీ ప్రభుత్వంపై వ్యతిరేకత తమపై కూడా పడిందని అన్నారు. అవినీతి ఆరోపణలపై స్పందించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పొందిన ఓట్ల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల బేరం చేయాలని ఆయన తట్కరేకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో, ఎన్సీపీ 114 స్థానాల్లో పోటీ చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన విజయంపై పవార్ ‘‘సునామీ ప్రతిసారీ రాదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కూడా పాల్గొన్నారు. -
గరంగరంగా కేబినెట్ భేటీ
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎఫ్ కూటమి దారుణ పరాభవం అనంతరం జరిగిన తొలి రాష్ట్ర కేబినెట్ సమావేశం గరంగరంగా సాగింది. ఈ ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ముందుకు సాగని అభివృద్ధి పనుల గురించి గళమెత్తారు. ఈ సమావేశానికి ఛగన్ భుజ్‌బల్, సురేశ్ దాస్, సునీల్ తట్కరే, శివాజీరావ్ మోఘే కూడా హాజరయ్యారు. రాయ్‌గఢ్ స్థానం నుంచి శివసేన ఎంపీ అనంత్ గీతే చేతిలో ఓడిన తట్కరే మాట్లాడుతూ దిగ్గి పోర్టు అభివృద్ధిలో జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులు చేపట్టిన డెవలపర్‌కు నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీడ్‌లో బీజేపీ నేత గోపీనాథ్ ముండే చేతిలో ఓడిన దాస్ మాట్లాడుతూ మరాఠ్వాడా ప్రాంతంలో నీటి కొరత సమస్యను లేవనెత్తారు. దీనిని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర మంత్రులు వివాదాస్పద టోల్ వసూలు గురించి ఘాటుగా మాట్లాడారు. నాగపూర్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే తన నియోజకవర్గంలో ప్రత్యర్థి, బీజేపీ నేత గడ్కారీ 12 వేల ఓట్ల ఆధిక్యత రావడంతో పదవికి రాజీనామా చేసిన ఉపాధి హామీ పథక మంత్రి నితిన్ రౌత్ గరంగరంగానే మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ న్యాయ పాఠశాల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యాన్ని లేవనెత్తారు. అడ్మిషన్ విధానాన్ని ప్రారంభించేందుకు కేబినెట్లో ప్రతిపాదన పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబై, నాగపూర్, ఔరంగాబాద్‌లో ఈ న్యాయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. బుల్దానా, నాగపూర్, వార్ధా జిల్లా సహకార బ్యాంక్‌ల ఆర్థిక ఇబ్బందులపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. రూ.260 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. చేపల్లో వ్యాధులు త్వరితగతిన గుర్తించేందుకు పాల్ఘర్లో ల్యాబోరేటరీ ఏర్పాటుకోసం పది ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు సిబ్బందికి పోస్టింగ్‌లను ఇవ్వనుంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించేందుకోసం నాగపూర్ రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ పదోన్నతులను రాష్ట్ర డీజీపీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఈ పదోన్నతులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అధిష్టానం తీరే కొంపముంచింది: చవాన్ సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాభవంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పదవికి రాజీనామా చేయాలని అటు ప్రతిపక్షంతో పాటు ఇటు అధికార పక్షంలోని నేతల నుంచే డిమాండ్ పెరుగుతోంది. దీంతో తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో ఏమో అనుకున్నాడో గానీ ఈ ఓటమికి కారణం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో ఆఫ్ ది రికార్డ్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడానికి అధిష్టానమే కారణమని చవాన్ చేతులెత్తేశారు. విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన అవినీతి, వెలుగులోకి వచ్చిన కుంభకోణాలు ఓటమికి కారణాలయ్యాయని వివరణ ఇచ్చారు. అందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత చవాన్ రాజీనామా చేయాలని అయన వ్యతిరేకులతోపాటు అనుకూలురు కూడా పట్టుబట్టారు. శాసనసభ ఎన్నికలు మరో ఐదు నెలల్లో జరగనున్నాయి. చవాన్ రాజీనామా చేస్తే కనీసం ఈ ఐదు నెలల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని అనేకమంది ప్రముఖులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయినా చవాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. నాయకత్వం మారే అవకాశాలు లేకపోవడంతో సీఎం కూడా ధైర్యంగా ఉన్నారు. చివరకు ఓటమిని కాంగ్రెస్ అధిష్టానంపై నెట్టేసి చేతులెత్తేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన ఓటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక చాలెంజ్‌గా పరిణమించనుంది. ఇప్పటినుంచే సాధ్యమైనన్ని ప్రజోపయోగ పనులు చేపట్టాలనుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 240 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులు వెనకబడడం చింతించాల్సిన విషయమ’ని చవాన్ అంగీకరించారు. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలా...? లేక మరొకరిని నియమించాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఒకవేళ సీఎం పదవి నుంచి తొలగిస్తే తన రాజకీయ భవిష్యత్‌పై కూడా నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించినట్లు ఆయన వెల్లడించారు. -
హైకోర్టుకు తుది నివేదిక
ముంబై: మంత్రి సునీల్ తట్కరేపై మనీల్యాండరింగ్, భూకబ్జా కేసులకు సంబంధించి విచారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), నగర పోలీసు శాఖ అనుబంధ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈవోడబ్ల్యూ), రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ మంగళవారం హైకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. కాగా మంత్రిపై ఆరోపణలపై విచారణ జరిపాలంటూ వివిధ దర్యాప్తు సంస్థలను గత ఏడాది అక్టోబర్‌లో హైకోర్టు ఆదేశించిన సంగతి విదితమే. ఈ మేరకు రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఏసీబీ, ఈవోడబ్ల్యూ అధికారులు తమ తమ నివేదికలను జస్టిస్ ఎస్.జె.వజిఫ్‌దార్, జీఎస్ పటేల్‌ల నేతృత్వంలోని ధర్మాసనానికి సమర్పించారు. ఇదిలాఉంచితే మంత్రి సునీల్ తట్కరే, ఆయన బంధువులు ఏర్పాటుచేసిన కంపెనీలు మనీల్యాండరింగ్‌తోపాటు భూకబ్జాలకు పాల్పడ్డాయని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ బీజేపీ అగ్రనాయకుడు కిరీట్ సోమయ్య గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసిన సంగతి విదితమే. -
బాబ్లీకి తాళం
భైంసా, న్యూస్‌లైన్ : మహారాష్ట్ర సర్కారు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ప్రాజెక్టు గేట్లను దించే విషయంలో మహారాష్ర్ట సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గేట్లు దించే కార్యక్రమానికి మహారాష్ర్ట సీఎం పృథ్వీరాజ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి అజీత్రావుపవార్, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావు చౌహాన్, జలవనరుల శాఖ మంత్రి సునిత్తట్కారే, నాందేడ్ జిల్లా ఇన్చార్జి మంత్రి డీపీ సావంత్ హాజరయ్యారు. మూడు రోజులుగా అక్కడి పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే సోమవారం అర్ధరాత్రి 12 గంటలు తర్వాత ప్రాజెక్టు 14 గేట్లలో 12 గేట్లను కిందికి దించేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో బాబ్లీ చేరుకున్న అమాత్యులు మిగిలిన రెండు గేట్లను మధ్యాహ్నం 3.16 గంటలకు కిందికి దిం చారు. సుప్రీంకోర్టు తీర్పును క్షణం కూడా ఆల స్యం చేయకుండా కిందికి దించిన వైనం అక్కడి అమాత్యులు ఆ ప్రాంత రైతుల కోసం అక్కడి ప్రాజెక్టుల నిర్వహణ కోసం పట్టిన పట్టుదల ఈ కార్యక్రమంతో మరోసారి మన పాలకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మా వాటా వదులుకోం.. బాబ్లీ గేట్లు కిందికి దించడాన్ని మహారాష్ర్ట సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. ఎన్నో వివాదాలతో పూర్తయిన బాబ్లీ ప్రాజెక్టుతో నాలుగు పట్టణాలతోపాటు 20 వేల ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. మహారాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రాంతం లో ప్రవహించే నదులపై ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించేందుకు వెనక్కి తగ్గేదిలేదని ఉప ముఖ్యమంత్రి అజీత్పవార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దాదాగిరి తాము కొనసాగించబోమని తమకు అందాల్సిన నీటి వాటాను వదులుకోలేమని అన్నారు. గ్రామం నుంచి జిల్లా వరకు, రాష్ట్రం నుంచి దేశాల వరకు నీటి గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నారు. గోదావరి నదిపై గాయక్వాడ్ నుంచి బాబ్లీ వరకు ఉన్న 15 ప్రాజెక్టులతో ఈ ప్రాంత రైతులందరికి సాగునీరు అందిస్తామన్నారు. నాలుగు దశాబ్దాల కల నిజమైందని జలవనరు ల శాఖ మంత్రి సునీత్ తట్కారే స్పష్టం చేశారు. మహారాష్ట్ర పరీవాహక ప్రాంతంలోని నీటిని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. మన నీళ్లు మనకే.. మహారాష్ట్ర నీళ్లు మాకే చెందాలని మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావు చౌహాన్ బాబ్లీ సభలో స్ప ష్టం చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనే బాబ్లీ ప్రాజెక్టు వివాదాలపై వెనక్కి తగ్గలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు రాజకీయం చేస్తే పీఎం మన్మోహన్సింగ్ను కలిసి ఈ ప్రాం త కష్టాలను వివరించామన్నారు. బాబ్లీ విషయంలో ధర్మాబాద్‌కు వచ్చిన చంద్రబాబు బృందానికి ఔరంగాబాద్ తీసుకువెళ్లి ప్రత్యేక విమానంలో పంపించామని తెలిపారు. మహా రాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్ల దించివేత చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తమవారికి దీపావళి రెం డు రోజుల ముందే వచ్చేసిందన్నారు. బాబ్లీ ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్వాడి, బిలోలి, ఉమ్రి పట్టణాలకు తాగునీరు 7,395 హెక్టార్లకు సాగునీరు అందనుందన్నా రు. ఇక త్వరితగతిన లెండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయం లో మహారాష్ట్ర 1975 నుంచి పోరాటం చేస్తుం దని నాందేడ్ జిల్లా ఇన్చార్జి మంత్రి డీపీ సావం త్ పేర్కొన్నారు. దక్షిణ గంగపై బాబ్లీ ప్రాజెక్టు పూజలు చేయడం మరిచిపోలేమన్నారు. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ ప్రవహించే నదుల్లో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. భారీ బందోబస్తు ప్రాజెక్టు గేట్ల కిందికి దించే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేసింది. గేట్లను కిందికి దించే విషయంలో మూడు రోజులుగా ప్రాజెక్టు ప్రాం తంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు మోహరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నూ అనుమతి ఉన్న పాత్రికేయులకే లోపలకు ఆహ్వానించారు. గేట్లు కిందకు దించగానే అక్కడికి చేరుకున్న వేలాది రైతులు టపాసులు మో గించి సంబరాలు జరుపుకున్నారు. అమాత్యులు గోదారమ్మకు పచ్చచీరలు, టెంకాయలు పై నుంచి కిందకు జారవిడిచారు. -
ఇదేమి దర్యాప్తు?
ముంబై: మంత్రి సునీల్ తట్కరేపై కేసుపై నగర పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపడం లేదంటూ బాంబే హైకోర్టు శుక్రవారం నగర పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నగర పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) దర్యాప్తు చేయకపోగా పిటిషనర్ కిరీట్ సోమయ్య అందిస్తున్న పత్రాలపైనే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది. వారు స్వతంత్రంగా ఏమీ చేయలేదు’ అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఎస్.సోనక్‌ల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు సంస్థ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం పై విధంగా స్పందించింది. కాగా మంత్రి సునీల్ తట్కరే, ఆయన బంధువులు కలసి ఏర్పాటుచేసిన వివిధ సంస్థలు మనీల్యాండరింగ్‌తోపాటు భూకబ్జాలకు పాల్పడ్డాయని, అందువల్ల ఆయా సంస్థలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ )తో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య బాంబే హైకోర్టులో గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి విదితమే. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ కేసును విచారించి, ఓ నివేదిక సమర్పించాలంటూ ఈఓడబ్ల్యూతోపాటు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లను అప్పట్లో ఆదేశించింది. దీంతో ఈఓడబ్ల్యూతోపాటు ఏసీబీ అధికారులు, రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్లు రూపొందించిన నివేదికలను అడ్వొకేట్ జనరల్ దారియస్ ఖంబాటా శుక్రవారం హైకోర్టుకు సమర్పించారు.