ఎన్సీపీ నాయకులపై ఉచ్చు బిగించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. జలవనరుల కుంభకోణానికి సంబంధించి..
జలవనరుల కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తునకు సీఎం ఆదేశం
సాక్షి, ముంబై: ఎన్సీపీ నాయకులపై ఉచ్చు బిగించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. జలవనరుల కుంభకోణానికి సంబంధించి మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ జలవనరుల శాఖ మంత్రి సునీల్ తట్కరేలతోపాటు ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ భవననిర్మాణం విషయంపై అప్పటి ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆధ్వర్యంలో దర్యాప్తు జరపనుంది. ఈ దర్యాప్తుకు సంబంధించిన ఆదేశాలను ఏసీబీకి ముఖ్యమంత్రి జారీ చేసినట్లు నాగపూర్ హైకోర్టులో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మరోసారి ముఖ్యంగా జలవనరుల కుంభకోణం అంశం తెరపైకి వచ్చింది. గతంలో ఈ విషయంపై అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
అనంతరం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన అనంతరం మళ్లీ అజిత్ పవార్ పదవీబాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సమయంలోనే పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టించిన ఈ అంశం మరోసారి తెరపైకి రావడంతో ఎన్సీపీ వర్గాల్లో కలకలం రేగుతోంది. లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీపై బీజేపీ, శివసేన పార్టీలు జలవనరుల కుంభకోణం అంశంపై తీవ్ర ఆరోపణలు చేశాయి. అదే విధంగా ‘రాష్ట్రవాది పార్టీ’ కాస్తా ‘బ్రష్టాచార్‌వాది పార్టీ’గా (అవినీతి పార్టీ)గా మారిందని ఈ విషయంపై అధికారంలోకి రాగానే దర్యాప్తు జరిపిస్తామని బీజేపీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నట్టుగా ఎన్సీపీ నాయకులపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నత అధికారి సునీల్ మనోహర్ నాగపూర్ హైకోర్టులో తెలియపరిచారు. దీంతో రాబోయే రోజుల్లో ఎన్సీపీకి తలనొప్పులు పెరగనున్నాయని చెప్పవచ్చు.