సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పారీ్టలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. వీరిలో 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పుణె జిల్లాలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం బారామతి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. బారామతి ఎంపీ స్థానం శరద్ పవార్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటోంది. అందుకే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌పవార్ కుమార్తె సుప్రియాసూలేపై అజిత్ తన భార్య సునేత్రా పవార్‌ను పోటీకి నిలిపినా సునేత్రా ఓటమిని చవిచూడటం తెల్సిందే. ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు.
45 మందితో శివసేనజాబితా విడుదల
మంగళవారం అర్ధరాత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 45 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం ఏక్‌నాథ్ షిండే మరోసారి కోప్రి పాచ్ పాఖాడి నుంచి పోటీచేయనున్నారు. విలాస్ సందీపన్ భూమ్రే పైఠాన్ నుంచి, మంత్రి ఉదయ్ సమంత్ రత్నగిరి నుంచి బరిలో దిగనున్నారు. రాష్ట్రంలోని అధికార మహాయుతి కూటమి ఇప్పటివరకు 182 పేర్లను ప్రకటించింది. ఇందులో బీజేపీ నుంచి 99 మంది, శివసేన నుంచి 45 మంది, ఎన్సీపీ నుంచి 38 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడు అమిత్ ఠాక్రేను మాహిం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపారు.
శివసేన(యూబీటీ) తొలిజాబితా
ఉద్ధవ్‌ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) బుధవారం 65 మంది అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను విడుదలచేసింది. పార్టీ నేత, మాజీ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే సెంట్రల్ ముంబై పరిధిలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. యువసేన నేత, ఆదిత్య బంధువు వరుణ్ సర్దేశాయ్ బాంద్రా(ఈస్ట్) నుంచి పోటీచేస్తారు. పార్టీ నుంచి చీలిపోయి పార్టీ పేరు, గుర్తును కైవసం చేసుకున్న ఏక్‌నాథ్ షిండే పోటీచేస్తున్న కోప్రి పాచ్ పాఖాడి నియోజకవర్గంలో శివసేన(యూబీటీ) తరఫున కేదార్ దిఘే బరిలో దిగుతున్నారు. షిండే రాజకీయగురువు ఆనంద్ దిఘే మేనల్లుడే కేదార్.
Comments
Please login to add a commentAdd a comment